పెళ్లంటే..! ఏదో తెలియని భయం!

24 Nov, 2015 03:50 IST|Sakshi
పెళ్లంటే..! ఏదో తెలియని భయం!

అబ్బాయి నచ్చినా...
పెళ్లి ఇష్టమైనా...
కొత్త జీవితాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నా...
ఏదో తెలియని భయం.
మెట్టినింట్లో మసలగలనా?
కొత్త బంధువులతో మనగలనా?
కట్టు బొట్టు, వంటావార్పు నచ్చుతుందా?!
పెళ్లి కూతురుకు అన్నీ భయాలే.
అస్సలు భయపడక్కర్లేదు అంటున్నారు పెద్దలు, నిపుణులు.
నిశ్చింతగా, ఉత్సాహంగా ఏడడుగులు వేయమంటున్నారు.

 
సుస్మిత బి.టెక్ చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాకేష్‌తో పెళ్లికుదిరింది. పెళ్లికూతురుని చేసిన రోజున విషెస్ చెప్పడానికి వెళితే...‘మంచి సంబంధం, అబ్బాయి కూడా చాలా బాగున్నాడట కదా! అదృష్టవంతురాలివి...’ పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కొక్కరూ అభినందిస్తున్నారు. అదే విషయం చెబితే- ‘‘లోలోపల ఎంత గుబులుగా ఉందో మాటల్లో చెప్పలేను’’ అంది సుస్మిత. ఎందుకని అడిగితే-‘‘ఏమో..! తెలియడం లేదు. రాకేష్ కొన్నాళ్లుగా తెలుసు. సంబంధం కూడా మరీ దూరం కాదు. పెళ్లికి కావల్సినవన్నీ రెండు మూడు నెలలుగా సమకూర్చుతూనే ఉన్నారు అమ్మానాన్న. షాపింగ్ హడావిడిలో, కావల్సినవి సెలక్ట్ చేసుకోవడంలో నాకూ నిన్న మొన్నటి వరకు ఏమీ అనిపించలేదు. కానీ, పెళ్లి ఘడియ దగ్గర పడుతున్నకొద్దీ చెప్పలేనంత టెన్షన్‌గా ఉంది. తెల్లవారితే పెళ్లి. పట్టు బట్టలు, పూల దండలు, పెళ్లిపందిరి, ఫొటోలు, వీడియోలు, బంధువులు, మిత్రుల ఆశీస్సులు, కానుకలు... సంబరంగానే గడిచిపోతుంది. కానీ, ఏంటో భయంగా ఉంది. ఒక చోట పెట్టిన వస్తువు కోసం మరో చోట వెతుకుతున్నాను. అప్పుడప్పుడు పరధ్యానంగా ఉంటున్నానేమో ‘ఏంటలా ఉన్నావు’ అని అమ్మ ఇప్పటికే రెండు మూడు సార్లు అడిగింది. పెళ్లి పనులతో రాత్రుళ్లు అమ్మకు నిద్ర ఉండటంలేదు. పెళ్లి గురించిన ఆలోచనలతో నాకు నిద్ర పట్టడంలేదు..‘ పెళ్లి అంటే ముఖం కళగా వెలిగిపోవాలి కానీ, ఇలా తోటకూరకాడలా వడలిపోయింది.. ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి?’ అని మా మేనత్త అంది. ఆ మాటలకు ఇంకా భయమేసింది. కానీ, ఈ టైమ్‌లో నా టెన్షన్ ఎలా ఉంటుందో ఆమెకు మాత్రం తెలియదా! ఆ విషయాలేవో నాకు చెబితే.. కొంత ఊరట ఉండేది...’’ అంటుండగా సుస్మిత స్నేహితులు వచ్చారు. వారిని ఆహ్వానించడంలో మునిగిపోయింది సుస్మిత.

తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్ళ హడావిడి మొదలయ్యింది. కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లి పందిళ్లు వెలిగిపోతున్నాయి. సంబరంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే పెళ్లికూతుళ్ల టెన్షన్ ఈ సమయంలో అంతా ఇంతా కాదు. అమెరికాలో అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక పారిపోయే పెళ్లి కూతుళ్లూ (రన్ అవే బ్రైడ్స్) ఉంటారు. పెళ్లి రోజు ఎలా గుడుస్తుందో.. ఆ తర్వాత రోజులున్నీ ఎలా ఉండబోతున్నాయో.. ఈ ఆలోచన వారిని స్థిమితంగా ఉండనివ్వదు. ఈ విషయం గురించి ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి మాట్లాడుతూ- ‘‘బాల్యంలో స్కూల్‌కి, అటు తర్వాత కాలేజీకి వెళ్లినట్టే .. ఒక దశ దాటాక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం అలాంటిదే అనుకోరు అమ్మాయిలు. పెద్దలు కూడా ఈ కొత్త జీవితం గురించి, దిద్దుకునే క్రమం గురించి చెప్పడం చాలా తక్కువ. కొత్తగా కాలేజీలో జాయిన్ అయితే అక్కడ మనకై మనంగా పరిచయాలు ఎలా పెంచుకుంటామో... గుర్తుతెచ్చుకోవాలి. కాలేజీ మొదటి రోజుల్లోనే కొందరు సన్నిహితులు అవుతారు. ఇంకొందరు పరిచయస్తులుగానే ఉండిపోతారు. వైవాహిక బంధం కూడా కొత్త కాలేజీ లాంటిదే! అయినా, ఆ తర్వాత తర్వాత ఆ కుటుంబం మనదే అవుతుంది కాబట్టి మనకు తగిన విధంగా ఎలా మలుచుకోవాలి అనే విషయాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ఆందోళనలే ఉండవు’’ అంటున్నారు.

పంచభూతాల సాక్షిగా ఏడడుగులు వేసి, కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న నవ వధువులకు మనస్తత్వ నిపుణులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు ఇస్తున్న సూచనలు ఇవన్నీ. అంతేకాదు... ‘ప్రేమ, దయ, క్షమ, సహనం, సర్దుబాటు అనే గుణాలతోపాటు బాంధవ్యాలను పదిలం చేసుకోగలను అని మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ జీవితాన్ని అందంగా మలుచుకోవడం మీ చేతుల్లోనే ఉంది’ అని కొత్త పెళ్లికూతుళ్లకు వీళ్లు సలహా ఇస్తున్నారు.
 
 
వివేచనతో దిద్దుబాటు
 మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉత్సాహంగా, ఆహ్లాదంగా మార్చే శక్తి మీకు మాత్రమే ఉంది. పెళ్లి రోజున  సంతోషం, సరదా, ఆసక్తి.. మిమ్మల్ని ఆకర్షణీయంగా చూపుతాయి. అత్తింటిలోనూ ఇదే తరహా కొనసాగిస్తే మీ భావి జీవితం ఆనందంగా సాగడానికి ఒక మెట్టు అధిగమించినట్టే. మీ భాగస్వామి అత్యంత ఇష్టత పెంచుకునేది కూడా ఈ సందర్భంలోనే. అలా కాకుండా పుట్టింటి వారినే తలుచుకుని చింతిస్తూ.. మూగబోయి ఉంటే... మీతో పాటు అక్కడంతా నిస్తేజంగా కనిపిస్తుంది. భాగస్వామితోనూ కబుర్లేమీ లేకుండా పలకరింపులకే పరిమితం అయితే.. తర్వాత మీ దాంపత్య జీవితం ఒడిదొడుకులలో పడవచ్చు. అందుకని మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మీ కొత్త జీవితం ఎలా ఉండాలో నిర్ధారించుకోవాల్సిందే మీరే!
 
ప్రధాన భయాలు ఇవే!

బాల్యం నుంచి పెళ్లి , వైవాహిక జీవితం, అత్తింటి.. గురించి నెగిటివ్ అంశాలు ఎక్కువ విని ఉంటారు. వాటినే తలుచుకొని భయపడుతుంటారు.

అప్పటి వరకు జీవితభాగస్వామి పట్ల ఎన్నో కలలు కని ఉంటారు. అవన్నీ నిజం అవుతాయో, లేవో అనే సందేహం.

పుట్టింటిలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అత్తింటిలో ఉండవనే అభిప్రాయం.

పెళ్లి అయితే ఇంటి పనులు, వంట పనులు.. అందరికీ చాకిరీ చేయాల్సి వస్తుందనుకుంటారు.

భర్త స్వభావం ఎలా ఉంటుందో.. అతని అలవాట్లు ఏమిటో... అనే అనుమానాలు.

భవిష్యత్తు గురించి భయాలు.
 
మనసులో చోటు ముఖ్యం
అత్తింటిలో ‘లేని నవ్వు తెచ్చి పెట్టుకొని, అందరినీ పలకరించాలి. నలుగురిలో నటిస్తున్నట్టుగా ఉంటుంది. కంఫర్ట్ లేదు... వీటి కన్నా ఒంటరిగా ఉండటమే బెస్ట్’ అని నవ వధువులు అనుకుంటూ ఉంటారు. కంఫర్ట్ అంటే ఉండే చోటు కాదు. నలుగురిలో మనం ఎలా ఉంటున్నామో సరిచూసుకోవాలి. ‘ఒంటరిగా ఉంటే ‘ప్రేమ’ను ఎవరికీ పంచలేను’ అనే నిజం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సాధించినవాటి కన్నా ఇక ముందు ప్రేమతో సాధించినవే మీకు నిజమైన బహుమతులు అనుకోవాలి. మీరున్న చోటు మీకు ఆనందాన్ని ఇవ్వకపోతే అదే విషయాన్ని మీ శ్రీవారితో చెబుతూ- ‘మీతో ఉంటే చాలా ఆనందంగా ఉంది. కానీ, ఈ ప్లేస్ అంత సౌకర్యంగా లేదు..’ అని సున్నితంగా వివరించండి. పెళ్లి తర్వాతి దశను అర్థం చేసుకోవడానికి ఇదో ప్రాధమిక విద్య. ఉన్న చోటు ముఖ్యమైనదే అయినా ముందు అత్తింటి మనసుల్లో స్థానం సంపాదించాలనుకోండి.
 
అనుకూలమైన వ్యక్తులను ఎంచుకోండి

పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు... ఆ తర్వాత అత్తివారింటిలో అడుగుపెట్టాక కొన్ని రోజుల వరకు మీకు అనుకూలంగా ఉండేవారితో ఉండండి, మీ అవసరాలను గుర్తించేవారు, మీతో మంచిగా ఉండేవారితో సానుకూలంగా ప్రవర్తించండి. కొందరు నెగిటివిటీ నూరిపోసే వ్యక్తులు ఉంటారు. ఎవరు మంచి, ఎవరు చెడు.. విషయాలను ఏకరువు పెడుతుంటారు. వారు చెప్పేవి ఆసక్తి లేనట్టుగా ఉండండి. మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత ఉంటే మీ భావి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. దాంపత్య జీవితం గురించి అందుకు అర్హత గల పెద్దవాళ్లు చెప్పే సూచనలు మీ భావి జీవితానికి ఉపయోగపడవచ్చు. అందుకని వాటిని శ్రద్ధగా వినండి.  

- సాక్షి ఫ్యామిలీ
 
 

మరిన్ని వార్తలు