ఫిబ్రవరి 18 ప్రేమికుల రోజు!

12 Feb, 2017 23:26 IST|Sakshi
ఫిబ్రవరి 18 ప్రేమికుల రోజు!

చెట్టు = అమ్మ

ఇదేంటి? ఫిబ్రవరి 14 కదా.. వాలెంటైన్‌ డే?! అది ఇంటర్నేషనల్‌. ఇది బెంగళూరు ప్రేమికుల రోజు. చెట్లను ప్రేమించే ప్రేమికుల రోజు. ఆ ఒక్కరోజే కాదు, ఫిబ్రవరి 19న కూడా ఆ హైటెక్‌ సిటీలో యూత్‌ అంతా చెట్ల వెంబడి తిరుగుతారు. చెట్లను తాకుతారు. చెట్లకు ఊగుతారు. చెట్లను ముద్దు పెట్టుకుంటారు. చెట్లను కావలించుకుంటారు. చెట్ల కింద భోజనం చేస్తారు. ఆఖర్న చెట్లను పరిరక్షించుకుందాం అని ప్రతిజ్ఞ చేస్తారు. డ్యాన్స్, మ్యూజిక్‌ కూడా ఉంటుంది. అన్నిటికీ ఒకటే థీమ్‌.. చెట్టు. ‘అమ్మకు ప్రేమతో..’ అంటూ ఆ రెండు రోజులూ చెట్లతో రిలేషన్‌ పెంచుకుంటారు. నిజమే. చెట్టు అంటే అమ్మ.

ఈ మాటను హైదరాబాద్‌లో గోడల మీద, మెట్రో రైల్‌ వంతెన దిమ్మెల మీద ‘చెట్టు = అమ్మ’ అంటూ రాస్తూ.. సురేశ్‌ దండు అనే ఒక అజ్ఞాత చెట్టు ప్రేమికుడు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాడు. బెంగళూరులో జరుగుతున్న చెట్ల పండగను అక్కడి ‘నెరలు’ అనే సంస్థ ఆర్గనైజ్‌ చేస్తోంది. నెరలు అంటే కన్నడంలో షేడ్‌. ఛాయ. చెట్టు ఛాయలో మనిషి జీవితం పచ్చగా ఉంటుందన్న సందేశం కావచ్చు. మనం కూడా ఇలాంటి చెట్ల ప్రేమికుల రోజును జరుపుకుంటూ ఉంటే బతుకు పచ్చగా ఉంటుంది.

మరిన్ని వార్తలు