పచ్చిమేతల ఎంపిక ఎలా?

20 Aug, 2019 07:02 IST|Sakshi

డెయిరీ డైరీ–4

మేలు జాతి పాడి పశువుల పెంపకం లాభదాయకంగా చేపట్టాలనుకునే రైతులు పచ్చిమేత, పశు దాణా ప్రాముఖ్యత గురించి శాస్త్రీయ అవగాహన  పెంచుకోవాలి. పాడి పశువుల పెంపకంలో  60–70% నిర్వహణ ఖర్చు మేపు పైనే ఉంటుంది. మేపు ఖర్చు ఎంత తగ్గితే నికర లాభం అంత పెరుగుతుంది. డెయిరీ రైతులు మేలు జాతి పాడి పశువులను ఎంపిక చేసుకొని పోషిస్తున్నప్పటికీ.. వాటిలో జన్యుపరంగా అధిక పాలిచ్చే లక్షణాలున్నప్పటికీ – వాటికి తగినంత మేత, పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇచ్చినప్పుడే ఆశించిన పాల ఉత్పత్తి పొందగలరు. మేలైన పచ్చి మేతల ఎంపిక, పెంపకం, వినియోగంపై వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా రైతులు పశువులకు అందించే వడిగడ్డి, చొప్ప లాంటి ఎండు మేత వాటి కడుపు నిండడానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఎండుమేతలో ఎలాంటి పోషక పదార్థాలుండవు.
కాబట్టి పశుమేతలో ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత కూడా ఉండాలి. పచ్చిమేతలో కూడా పప్పుజాతి(ద్విదళం) పచ్చిమేత ఒక పాలు, ధాన్యపు జాతి(ఏకదళం) పచ్చిమేత మూడు పాళ్లు మేపాలి. పశువు బరువుననుసరించి 25–30 కిలోల వరకు మేపినట్లయితే తగిన రీతిలో పాల ఉత్పత్తి జరుగుతుంది. అంతేగాక 5 లీటర్లకు మించి పాలు ఉత్పత్తి సామర్థ్యం గల పశువులకు పచ్చిమేతతోపాటు సమీకృత దాణా అందించవలసి ఉంటుంది.

పాడి పశువుల శరీర అవసరాలను బట్టి మేపును రెండు రకాలుగా విభజించవచ్చు. 1. నిర్వాహక మేపు. 2. ఉత్పత్తి మేపు. నిర్వాహక మేపు: గడ్డికి సంబంధించినది. గడ్డి పశువుకు కడుపు నింపి, సంతృప్తిని, శరీర నిర్వహణకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అందుకే పశుగ్రాసాన్ని పశువు శరీర బరువును బట్టి ఎంత పరిమాణంలో కావాలో లెక్కించి ఇవ్వవలసి ఉంటుంది. ఉత్పత్తి మేపు: దాణాకు సంబంధించింది. దాణా ద్వారా లభించే పోషకాలు పాల ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి నిర్వాహక మేపు, ఉత్పత్తి మేపుపై తగు శ్రద్ధవహించవలసి ఉంటుంది.

ఎకరంలో పెరిగే పచ్చిమేతను 5–6 పశువులకు మేపవచ్చు
పచ్చిమేతలో ఉండే విటమిన్‌–ఎ వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, సకాలంలో చూలు కట్టి పాల ఉత్పాదన పెరుగుతుంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాల ఉత్పత్తి లాభసాటిగా ఉంటుంది. రోజుకు ఒక పాడి పశువుకు 30–40 కిలోల చొప్పున, సంవత్సరానికి 11–12 టన్నుల పచ్చిమేత అవసరమవుతుంది. నీటి వసతి గల ఎకరం భూమిలో పండించే పచ్చిమేత 5–6 పశువుల పోషణకు సరిపోతుంది. వర్షాధార భూములలో సాగు చేస్తే రెండు పశువులకు సరిపోతుంది.

పాడి రైతులు పచ్చిమేతను కొని మేపలేరు. సొంత భూమిలో లేదా కౌలు భూమిలోనైనా సొంతంగానే సాగు చేసుకోవాలి. దీని ద్వారా సంవత్సరం పొడవునా పచ్చిమేత పొందడమే కాక దాణా ఖర్చును కూడా కొంతమేర తగ్గించుకోవచ్చు.

పచ్చిమేత, ఎండుమేత ఎంతెంత ఇవ్వాలి?
పాల దిగుబడిని బట్టి పాడి పశువులకు తగినంత దాణాతోపాటు రోజుకు పచ్చిమేత, ఎండుమేతలను నిర్దేశిత మోతాదు ప్రకారం ఇవ్వడం ద్వారా లాభదాయకంగా పాల దిగుబడి పొందవచ్చు. పచ్చిమేత లభించే కాలంలో కిలో నుంచి 3 కిలోల మధ్య పశువు గేదా, ఆవా అన్నదాన్ని బట్టి, ఎంత పాల దిగుబడి ఉందన్న దాన్ని బట్టి తగిన పరిమాణంలో సమీకృత దాణా ఇవ్వాల్సి ఉంటుంది.
మేలురకం పచ్చిమేత విత్తనాలు, బహువార్షిక పశుగ్రాసాల సాగుకు పిలకల కొరకు సమీప పశువైద్యశాలల్లోని నిపుణులను సంప్రదించవచ్చు.  (వివిధ రకాల పచ్చి మేత రకాలసాగు వివరాలు.. వచ్చే వారం)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా