స్త్రీత్వం కనబడని లోకం

8 Jul, 2019 02:58 IST|Sakshi

కొత్త బంగారం 

వుల్ఫ్‌గోంగ్‌ హిల్బీస్‌ రాసిన ‘ద ఫిమేల్స్‌’ జర్మన్‌ నవలిక– తూర్పు జర్మనీలో చిన్న పారిశ్రామిక సంఘపు నేపథ్యంతో ఉన్నది. పేరుండని కథకుడి మాటల్లో, అతను ‘అపరిశుభ్రమైన, అప్రయోజకుడైన, సమాజంలో ఇమడని మధ్యవయస్కుడు’. తల్లితో కలిసుంటాడు. ‘పదో తరగతి దాటని నీకు రాతలెందుకు?’ అని తల్లి కోపగించుకున్నా, సాహిత్యం రాస్తాడు. స్త్రీల పట్ల పరిపక్వత చెందని కిశోర ప్రాయపు అభిప్రాయాలుంటాయి. పుస్తకపు ప్రారంభంలో– కథకుడి నుంచి వచ్చే దుర్వాసనా, అతని చేతగానితనంవల్లా, ఒక కర్మాగారంలో నేలమాళిగలో పనికి పెడతారు. అతని తలపైనున్న ఇనుపచట్రాల్లోంచి పైన పని చేసే స్త్రీలు కనబడతారు. వారతనికి భౌతికంగా అందుబాటులో ఉండనప్పటికీ, వారిని చూడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ‘నాపైన స్థిరమైన శక్తితో, పొగ కక్కుతున్న ఆ వేడి కింద– సగం చీకట్లో, కుర్చీలో కూర్చున్నాను. నా చుట్టూతా అనేకమైన ఖాళీ బీరు సీసాలు దొర్లుతున్నాయి. స్త్రీలను చూడ్డానికి తల పైకైనాఎత్తాలి లేకపోతే కుర్చీలోనైనా నిలబడాలి.’

బస్సుల్లో యువతులను ఒక పర్యవేక్షకుడు వేధించాడని తెలిసిన కథకుడు, అతన్ని బెదిరిస్తాడు. ఉద్యోగం పోతుంది. తన జీవితం గురించీ, తప్పెక్కడ జరిగిందో ఆలోచిస్తూ, మతిభ్రమతో– ‘స్త్రీలు, స్త్రీత్వపు జాడలూ కూడా ఊరినుండి మాయమైపోయాయన్న నా అనుమానాన్ని నిర్ధారించుకునేందుకు రాత్రిళ్ళు వీధివీధికీ తిరిగాను’ అంటాడు. ‘లైంగిక కోరికలు అస్వాభావికమైనవన్న వికలోద్వేగ వైద్యుల నియమాలను పాటిస్తూ పెరిగాను’ అనే కథకుడు, స్త్రీల పట్ల ఆకర్షితుడూ అవుతాడు, వారతనికి చీదరా పుట్టిస్తారు. ప్రేమించబడాలనుకొని, మానవ సాహచర్యం కోసం తహతహలాడతాడు. తన ఆత్రుత తనను ఇతరులకి దూరం చేస్తుందేమోనని భయపడతాడు. అతని నిరాశ హెచ్చవుతుండగా, అతనంటే పాఠకులకు చిరాకు ఎక్కువవుతుంది. 

ఏకభాషణతో సాగే నవలికలో–నిర్బంధ శిబిరంలో అతను గడిపిన కాలం, రచయితయే ప్రయత్నాలు, ఒక ఉద్యోగంలో నిలకడగా ఉండలేకపోవడానికి ఉండే కారణాలతో– ఒక క్రమంలేకుండా సాగుతుంది కథనం. ‘ప్రభుత్వం నా చేతిలో ఉన్న ప్రతి ఉపకరణాన్నీ లాక్కుంది’ అనే అతను, తన సమస్యల మూల కారణాలను వెతుకుతాడు. చివరకు బెర్లిన్‌ చేరుకుని, జైల్లో ఉద్యోగం చేపడతాడు. జైలు ఆవరణలో ఆడ ఖైదీలను చూసినప్పుడు, ‘ఇప్పుడు స్త్రీలెక్కడ కనిపిస్తారో తెలిసింది. వారిని తిరిగి చూసి, నా హృదయంలో పదిలపరచుకున్నాను’ అంటాడు. తనపట్ల తనకు సిగ్గు, అసహ్యం ఉండే వ్యక్తి చిత్రం ఇది. సృజనాత్మకతనూ, లైంగికతనూ, కోరికలనూ అణచివేసే ప్రభుత్వం పట్ల కోపాన్ని చూపే కథ. ఆ పరిధీకృత సమాజంలో– పాత్రలు, మగతనం గురించుండే కఠినమైన నిర్వచనాలతో సతమతమవుతాయి. దీన్లో ఉన్న స్త్రీలు పశుప్రాయులు, పురుషులకన్నా మెరుగైనవారు.

మగవారు మానసిక నపుంసకులు. కథనంలో భాష– ముతకగా, అసభ్యంగా ఉన్నప్పటికీ, చివరకు గుర్తింపు కోసం కథకుని శోధన–  సానుభూతి కలుగజేసి, బలవంతంగానైనా సరే, చదివిస్తుంది. అధ్యాయాల విభజన కనపడదు. హిల్బీస్‌ 1987లో రాసిన ‘డీ వీబర్‌’ పేరుతో వచ్చిన యీ నవలికను ఇంగ్లిష్‌లోకి అనువదించినది ఈసబెల్‌ ఫార్గో కోల్‌. 136 పేజీలున్న పుస్తకాన్ని ‘టూ లైన్స్‌ ప్రెస్‌’ 2018లో ప్రచురించింది. హిల్బీస్‌ (1941–2007) యుద్ధానంతర యుగంలో పేరు తెచ్చుకున్న జర్మన్‌ రచయితల్లో ఒకరు. ఆయన తరంలో చాలామందికిలాగానే హిల్బీస్‌కు కూడా తండ్రి లేకుండా పోయారు. ఆయన తూర్పు జర్మనీలో పెరుగుతున్నప్పుడు– అధికారులకు ఇబ్బందికరంగా మారడంతో, బెర్లిన్‌ గోడ పడగొట్టడానికి ముందే 1985లో ఆయన్ను పశ్చిమ జర్మనీకి వలసపోయేందుకు అనుమతించింది ప్రభుత్వం. జర్మన్‌ ప్రధాన సాహిత్య బహుమతుల్లో ఇంచుమించు అన్నిటినీ హిల్బీస్‌ పొందారు. 

 కృష్ణ వేణి

మరిన్ని వార్తలు