ఫెమినిజం మగాళ్ల విషయం

5 Feb, 2018 00:31 IST|Sakshi

ఇరవై అంటే పెద్ద వయసేం కాదు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యుసాఫ్జాయ్‌ వయసు ఇరవైకి ఒక ఏడాది ఎక్కువ. అది కూడా ఎక్కువేం కాదు. అయితే ‘ఫెమినిజం’కి ఆమె చెప్పిన అర్థంలో.. వయసుకు మించిన పరిణతే కనిపిస్తోంది. టీనేజ్‌లోనే మలాలా నోబెల్‌ను సాధించడం కన్నా గొప్ప సంగతి ఈ పరిణతి. ‘ఫెమినిజం మగాళ్ల విషయం’ అన్నారు మలాలా. ఎగ్జాక్ట్‌లీ! ‘స్త్రీవాదం గురించీ, స్త్రీల హక్కుల గురించీ మాట్లాడ్డం అంటే.. నిజానికది స్త్రీవాదనను అంగీకరించాలని పురుషులకు నచ్చచెప్పడమే’ అని ఇటీవల మలాలా దావోస్‌లో ప్రసంగిస్తూ అన్నారు! ‘హౌ స్వీట్‌’ అంటూ హాలంతా చప్పట్లు.

2015లో హాలీవుడ్‌ నటి ఎమ్మా వాట్సన్‌తో సంభాషిస్తున్నప్పుడు ‘ఫెమినిజం అంటే ఏంటీ?’ అనే ప్రశ్నకు ‘ట్రికీ వర్డ్‌’ అని జవాబిచ్చారు మలాలా. తికమకపెట్టే పదం అని. అప్పటికి ‘జెండర్‌ ఈక్వాలిటీ’ అన్నదొక్కటే ఆమెకు తెలుసు. తర్వాత కొన్నాళ్లు ఫెమినిజం అంటే అదేదో సుపీరియరిజం అనుకున్నారట మలాలా. ఇప్పుడు ఫెమినిజాన్ని కూడా ఈక్వాలిటీ అనే అర్థంలోనే చూస్తున్నారు.

 ‘‘ఫెమినిజానికి ఇంకో అర్థం సమానత్వం. స్త్రీ.. సమానత్వాన్ని అడుగుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే మనం ఫెమినిజం అన్న ప్రతిసారీ అది పురుషుడిని ఉద్దేశించి మాట్లాడటమే’ అని దావోస్‌లో చెప్పారు మలాలా. అంతకంటే కూడా సభను మురిపించిన మరో సంగతి, ‘స్త్రీవాదాన్ని సమర్థిస్తున్నవారూ స్త్రీలు వాదించడాన్ని అంగీకరించలేకపోవచ్చు. ఇప్పుడైతే గట్టిగా చెప్పగలను. స్త్రీవాదాన్ని నేను స్వీకరించాను’ అని మలాలా చెప్పడం.

ఎమ్మా వాట్సన్‌ ప్రస్తుతం ‘హి ఫర్ షీ’ అనే స్త్రీవాద ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. ‘మీ టూ’, ‘టైమ్స్‌అప్‌’తో పాటు ‘హి ఫర్ షీ’ని.. మలాలా సమర్థిస్తున్నారు. ‘బయటపడిపోతాం అని భయపడుతూ ఉంటే, విషయం బయటపడేదెలా?’ అని మలాలా ఇంకో అర్థవంతమైన మాటను అన్నారు. స్త్రీవాదానికి నవతరం నాయిక దొరికినట్లే ఉంది మలాలా మెచ్యూరిటీని చూస్తుంటే.

మరిన్ని వార్తలు