16 పోషకాలనిచ్చే సమృద్ధ ఎరువు

22 May, 2018 05:33 IST|Sakshi

పంట పొలంలో వేసిన రసాయనిక ఎరువులు 30% మాత్రమే పంటలకు ఉపయోగపడతాయి. మిగిలిన 70% వృథాయే. ఈ రసాయనాల వల్ల భూసారం దెబ్బతింటుంది. అంతేకాదు.. భూమిలో ఉండి పంటలకు, రైతులకు మేలు చేసే జీవాలు చనిపోతాయి. పంటల దిగుబడి ఊహించనంతగా తగ్గిపోతుంది. ఇది గ్రహించిన కొందరు రైతులు ఇష్టపడి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వర్మీ కంపోస్టు(జెర్రెల ఎరువు), పెంట(పశువుల) ఎరువు, కంపోస్టు మొదలైనవి తమ వీలును బట్టి పంటలకు వాడుతున్నారు. అయితే, ఇలా ఏదో ఒక ఎరువు వేస్తే మన పంటలకు సరైన పోషకాలు అందక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. సేంద్రియ పంటలకు అవసరమైన ముఖ్యమైన 16 పోషకాలను అందించే ‘సమృద్ధ ఎరువు’ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, డీడీఎస్‌–కృషి విజ్ఞాన కేంద్రం వాడుకలోకి తెచ్చాయి.

సమృద్ధ ఎరువులో 16 పోషకాలు..
టన్ను వర్మీ కంపోస్టును పొలంలో వేస్తే సుమారు 15 కిలోల నత్రజని, 3 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాష్‌ లభిస్తుంది. వర్మీ కంపోస్టుతోపాటు పిడకల/పశువుల/పెంట ఎరువు, మేకల ఎరువులను 3:3:4 నిష్పత్తిలో కలిపి వేసినట్టయితే భూమికి అధిక పోషకాలు అందుతాయి. అంటే.. 3 టన్నులు వర్మీకంపోస్టు, 3 టన్నుల పిడకల ఎరువు, 4 టన్నుల మేకల ఎరువు కలిపితే 10 టన్నుల సమృద్ధ ఎరువు తయారవుతుంది. టన్ను సమృద్ధ ఎరువును వేస్తే.. 385 కిలోల సేంద్రియ కర్బనం, 18.6 కిలోల నత్రజని, 5.8 కిలోల భాస్వరం, 10.1 కిలోల పొటాష్‌ నేలకు అందుతాయి. సమృద్ధ ఎరువు మొత్తం 16 రకాల బలాల(పోషకాల)ను అందిస్తుంది. పంటకు తోడ్పడే సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండటం వల్ల పూత, కాత బాగా వస్తుంది. భూసారాన్ని పెంపొందిస్తుంది. ఇసుక భూములకు కూడా నీటిని పట్టుకునే గుణం పెరుగుతుంది. భూమి మెత్తగా అయి, గాలిని పీల్చుకునే గుణం పెరుగుతుంది. దీన్ని వేయడం వల్ల చౌడు తగ్గి పంటలు బాగా వస్తాయి. సమృద్ధ ఎరువు ప్రభావం భూమిపై 2–3 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రతి ఏటా ఎరువు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. దీనితో పండించిన పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచిగా ఉంటుంది. మంచి ధర పలుకుతుంది. వివరాలకు.. డీడీఎస్‌–90003 62144, డీడీఎస్‌–కృషి విజ్ఞాన కేంద్రం–90104 96756

మరిన్ని వార్తలు