ఏభయ్యేళ్లు దిగుబడినిచ్చే ఏనుగు చెవి అంజీర చెట్లు!

5 Feb, 2019 06:20 IST|Sakshi
ఏనుగు చెవి అంజీర చెట్టు, ఏనుగు చెవి అంజీర పండ్లు

మనకు అంజీర తెలుసు. కానీ, ఏనుగు చెవి అంజీర తెలీదు. అయితే, ఈ చెట్లు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన అంజీర పండ్ల దిగుబడిని ఏభయ్యేళ్ల పాటు అందిస్తాయని యానాం వాస్తవ్యులైన అంజీర నిపుణులు డాక్టర్‌ జె. వి. సుధాకర్‌ చెబుతున్నారు. పోషకాల పరంగా ఎన్నో సుగుణాలతోపాటు మార్కెట్‌ విలువ కలిగిన ఏనుగు చెవి అంజీర చెట్లను తెలుగు రాష్ట్రాల రైతులు ప్రత్యేక పండ్ల తోటగా లేదా అంతర పంటగా లేదా పొలాల గట్లపైన పెంచుకోవచ్చని.. ఏడాది పొడవునా అంజీర పండ్ల దిగుబడితో నిరంతరాదాయం పొందవచ్చని ఆయన ‘సాగుబడి’కి తెలిపారు. చదవండి ఆయన మాటల్లోనే..

ఏనుగు చెవి అంజీర (శాస్త్రీయ నామం.. ఫైకస్‌ ఆరిక్యులేటా) పనస, మల్బరీ చెట్ల మాదిరిగానే మోరేసి కుటుంబానికి చెందినది. దీని పుట్టిల్లు హిమాలయాలు. ఆకులు పెద్దగా విశాలమైన ఏనుగు చెవి అంత, హృదయాకారంలో ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్లనే దీనికి ఏనుగు చెవి అంజీర అని పేరు వచ్చింది. లేత ఆకులు ఎరుపురంగులో ఉండి ముదిరిన తరువాత లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి. దీన్ని ప్రస్తుతం మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉద్యాన వనాల్లో ‘స్పెసిమన్‌’ అలంకరణ మొక్కగా వాడుతున్నారు. ఈ చెట్టు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.

కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగు చెవి అంజీర చక్కగా పెరుగుతుంది. తేలిక నేలలు, తేమ గల నేలలు, సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండే నేలల్లో బాగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా కాండచ్ఛేదనాల ద్వారా అంట్లుకట్టి నాటుకోవచ్చు. నాటిన 4–5 ఏళ్ల నుంచి కాపు మొదలవుతుంది. నాటిన 40–50 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. పండ్లు నేరుగా కాండం మీద కింది నుంచి పై వరకు గుంపులుగా, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏడాది పొడవునా పండ్ల కాపు వస్తుంది. తాజా పండ్లను ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు.

పక్వానికి వచ్చిన పండు 30–100 గ్రాముల బరువుతో ఎరుపు రంగు నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ప్రస్తుతం ఇవి ఎక్కువగా తమిళనాడులోని సేలం, కేరళలోని త్రిస్సూర్, తిరువనంతపురంలలో సాగవుతున్నాయి. మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. కిలో రూ. 200–300 వరకు పలుకుతోంది. పోషకాలు అధికంగా ఉండటం వల్ల తమిళనాడు, కేరళల్లో గర్భిణు ఈ పండ్లను ఎక్కువగా తింటున్నారు.పిండిపదార్థం, చక్కెర, బి విటమిన్లు, కె విటమిన్, ఖనిజలవణాలైన కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, జింక్‌ తదితర పోషకాలు ఈ పండులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ అంజీర పండులో ఉండే పోషక గుణాలన్నీ ఏనుగు చెవి అంజీరలోనూ ఉన్నాయి.


తాజా ఫలాలను పైన పొరను తొలగించి తినవచ్చు. పండ్ల రసం, జామ్‌ చేసుకోవచ్చు. పండ్లతోపాటు దీని ఆకులో కూడా ఔషధ గుణాలున్నాయి. గాయాలు, పుండ్లు మానడానికి, విరేచనాలను అరికట్టడానికి వాడుతున్నారు. మధుమేహ వ్యాధి నివారణకు ఈ ఆకులను మణిపూర్‌లో వాడుతున్నారు. మలేసియాలో బీపీ తగ్గించడానికి ఈ ఆకులు వాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆకులను భోజనానికి విస్తరిగా వాడుతున్నారు. అదేవిధంగా ఈ ఆకులు పశువుల మేతగా కూడా మంచి ఫలితాలనిస్తాయి.

ఈ మొక్కల నుంచి వచ్చే తెల్లని పాల వంటి లేటెక్స్‌ ద్రవానికి ఔషధ విలువలున్నాయి. ఈ మొక్కలను ఏటవాలుగా ఉన్న భూముల్లో వేసినట్టయితే భూమి కోతను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇన్ని సుగుణాలు, మార్కెట్‌ విలువ గల ఈ మొక్కలను తెలుగు రాష్ట్రాల రైతులు ప్రత్యేక ఫల పంటగా, అంతర పంటగా లేదా పొలాల్లో, గట్ల మీద పెంచుకుంటే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కడియం తదితర ప్రాంతాల్లోని నర్సరీల్లో ఏనుగు చెవి అంజీర మొక్కలు అందుబాటులో ఉంటాయి.

 డాక్టర్‌ జె.వి.సుధాకర్, సహాయ ఆచార్యులు, యానాం కళాశాల (92442 14784 నంబరులో సంప్రదించవచ్చు)

మరిన్ని వార్తలు