ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం

25 Sep, 2017 00:36 IST|Sakshi

దేవీనవరాత్రులు

శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి  అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై వరాలను అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయ కార్యాలకు ఈమె అనుగ్రహం తప్పనిసరి.

నిత్యం ఈమెను పూజించిన ముత్తయిదువులు అఖండ మాంగల్య సౌభాగ్యం పొందుతారు. సకల సంపదలు ఈ తల్లి అనుగ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి. శ్రీచక్రాన్ని అర్చించి, కుంకుమ పూజ చేయడం ద్వారా ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్వయంగా ప్రతిష్టించి, ఇక్కడ నిత్యం కుంకుమపూజ జరిగేలా ఆదేశించారు. అంతకుపూర్వం ఉగ్రస్వరూపిణిగా ఉన్న కనకదుర్గాదేవి నాటినుంచి శాంతరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. లలితాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజున లలితా సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయాలి. అలాగే లలితా అష్టోత్తరం, స్తోత్రాలు, పంచరత్నాలు పఠించాలి.

మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి.
నివేదన: అమ్మకు గారెలు నివేదన చేయాలి. సువాసినులకు పూజచేసి,  మంగళద్రవ్యాలు అందించాలి.
ఫలం: దారిద్య్ర దుఃఖం తొలగి, సకల శుభాలు, ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి.

మరిన్ని వార్తలు