నిర్విఘ్నంగా సినిమా పండగ

17 Sep, 2015 01:03 IST|Sakshi
నిర్విఘ్నంగా సినిమా పండగ

 క్యూ కిటకిటలాడుతోంది.
 చవితి మంటపాల్లో భక్తులు... రిలీజ్‌ల కోసం నిర్మాతలు....
 ఇప్పటి నుంచి దీపావళి దాక.... 50 రోజులు... 50 సినిమాలు...
 సినిమా చూపిస్త మామా... నీకు సినిమా చూపిస్త మామా...
 ప్రేక్షకులు ఫుల్. ప్చ్.... థియేటర్లు నిల్.
 స్వామీ... గణనాయకా... థియేటర్లు కూడా నీ హోల్డ్‌లో తీసుకొని మాకు కాసిన్ని పడేయ్ తండ్రీ....
 తెలిసిన హీరో... లేత స్టార్... తాజా కుర్రాడు.... తోపులాటలో ఎవరు ముందు ఎవరు వెనుక?
 శశివర్ణం... చతుర్భుజం....
 ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉన్నారు.
 ఒక సినిమా అడిగితే నాలుగు ఇస్తామంటున్నారు.
 ఇండస్ట్రీ కళకళలాడుతోంది. వినోదం పంట పండుతోంది.
 ‘సాక్షి’ తన వంతుగా ఈ సమాచారంతో పాఠక దేవుళ్ళకు నైవేద్యం అందిస్తోంది.

 
 సినిమా పేరు: బ్రూస్‌లీ...

 శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటి స్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్. అక్టోబర్ 16న రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్.
 
 సినిమా పేరు: అఖిల్

 హీరో నితిన్ నిర్మాణంలో  అఖిల్ తెరంగేట్రం. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో వి.వి. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న  సోషియో ఫ్యాంటసీ. అక్టోబర్ 22న రిలీజ్.
 
 సినిమా పేరు: బెంగాల్ టైగర్
 సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ చేస్తున్న భారీ చిత్రం. తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లు. బొమన్ ఇరాని స్పెషల్ ఎట్రాక్షన్. అక్టోబర్ రిలీజ్.
 
 సినిమా పేరు: శివమ్
 దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ‘ఢీ’, ‘కందిరీగ’ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్. అక్టోబర్ 2న రిలీజ్.
 
 సినిమా పేరు: షేర్
 మల్లికార్జున్ దర్శకత్వంలో బయటి బేనర్‌లో కల్యాణ్‌రామ్ చేస్తున్న సినిమా. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల. సోనాల్ చౌహాన్ నాయిక.
 
 సినిమా పేరు: సాహసం శ్వాసగా సాగిపో
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి నాగచైతన్య చేస్తున్న చిత్రం. మంఝిమ కథానాయిక. యాక్షన్ లవ్‌స్టోరీ. నవంబ ర్‌లో రిలీజ్. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్.
 
 సినిమా పేరు: నాయకి
 తెలుగు తమిళ భాషల్లో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్. గోవి దర్శకుడు. రఘు కుంచె సంగీతం. 1980ల నాటి కథ, లుక్స్ ఉంటాయి.  షూటింగ్‌లో ఉంది.
 
 సినిమా పేరు: కొలంబస్
 ఆర్.సామల దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. సీరత్ కపూర్, మిస్తీ హీరోయిన్స్. నవంబర్‌లో రిలీజ్.
 
 సినిమా పేరు: కృష్ణాష్టమి

 వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కోన వెంకట్ కథ. దినేష్ సంగీతం. త్వరలో విడుదల.
 
 సినిమా పేరు: సుబ్రమణ్యం ఫర్ సేల్
 హరీశ్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా. రెజీనా హీరోయిన్. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మరో ఎంటర్‌టైనర్. ఈ నెల 24న రిలీజ్.
 
 సినిమా పేరు: కంచె
 రెండో ప్రపంచయుద్ధం నేపధ్యంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న క్రిష్ చిత్రం. చిరంతన్ భట్ సంగీతం. అదిరిపోయే లొకేషన్స్‌లో చిత్రీకరణ. అక్టోబర్ 2 విడుదల.
 
 సినిమా పేరు: శంకరాభరణం

 నిఖిల్, నందిత కాంబినేషన్‌లో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ కామెడీ. పాత శంకరాభరణానికీ దీనికీ సంబంధం లేదు. నవంబర్‌లో విడుదల.
 
 సినిమా పేరు: పులి
 చాలాకాలం తర్వాత శ్రీదేవి నటిస్తున్న చిత్రం. హీరో విజయ్. దర్శకత్వం సింబు దేవన్. జానపద స్వభావం ఉన్న సినిమా. అక్టోబర్1న  రిలీజ్.
 
 సినిమా పేరు: కుమారి 21 ఎఫ్.
 రాజ్‌తరుణ్ హీరోగా నటించిన మూడో సినిమా. సుకుమార్ కథ, మాటలు సమకూర్చడం విశేషం. సూర్యప్రతాప్ దర్శకుడు. అక్టోబర్ 30న రిలీజ్.
 
 సినిమా పేరు : భలే మంచిరోజు
 సుధీర్ బాబు హీరోగా శ్రీరామ్ ఆదిత్వ రచన, దర్శకత్వంలో విజయ్, శశి నిర్మిస్తున్న సినిమా ఇది. సన్ని ఎమ్మార్ సంగీతం. కొత్త తరహా కథతో థ్రిల్ చేసే కథనం.
 
 సినిమా పేరు : గరమ్
 మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఆదా శర్మ కథానాయిక. బ్రహ్మానందం పికె గెటప్ స్పెషల్. పాటలు మినహా పూర్తి.
 
 సినిమా పేరు : నిర్మలా కాన్వెంట్

 హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం. నాగార్జున స్పెషల్ రోల్. నాగ కోటేశ్వరరావు దర్శకుడు. షూటింగ్ జరుగుతోంది.
 
 సినిమా పేరు : అబ్బాయితో అమ్మాయి
 రమేష్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇళయరాజా సంగీతం. సినిమా దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో విడుదల.
 
 సినిమా పేరు : త్రిపుర
 గీతాంజలి ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి నటించిన ద్విభాషా చిత్రం. కలల నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్. సుమారు 5 కోట్ల బడ్జెట్. అక్టోబర్‌లో రిలీజ్.
 
 సినిమా పేరు : కొబ్బరి మట్ట
 సంపూర్ణేశ్‌బాబు హీరోగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పెదరాయుడు, పాపా రాయుడు, ఆండ్రాయుడుగా సంపూ త్రిబుల్ పోజ్.
 
 సంక్రాంతి బరిలో...
 పెద్ద పండుగ దసరాకు యువ హీరోల పోటీ సాగుతుంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి సీనియర్ సినీ హీరోలు బరిలో దిగుతున్నారు. శ్రీనివాస్ దర్శకత్వంలో బాబాయ్ బాలకృష్ణ ‘డిక్టేటర్’గా రావడానికి తయారవుతున్నారు. సుకుమార్ డెరైక్షన్‌లో అబ్బాయి చిన్న ఎన్టీయార్ కూడా ఆ టైమ్‌కి ‘నాన్నకు ప్రేమతో...’ (వర్కింగ్ టైటిల్) అని చెప్పాలనుకుంటున్నారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా సంక్రాంతి మొనగాళ్ళు వస్తున్నారు. బాబీ డెరైక్షన్‌లో పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా మరోసారి పోలీస్ యూనిఫామ్‌లో సందడి చేయనున్నారు. 

ఈ భారీ యాక్షన్ బాక్సాఫీస్ వార్ మధ్యలో ప్రేమపుష్పాలు కూడా పూస్తున్నాయి. ‘నువ్వే - నువ్వే’ తరువాత చాలాకాలం విరామానికి త్రివిక్రమ్ ఒక పూర్తిస్థాయి ప్రేమకథతో యువ హీరో నితిన్‌ను ‘అ...ఆ...’ అనిపిస్తున్నారు. వరస చూస్తుంటే, కొత్త ఏడాది ప్రారంభంలో మొదటి రెండు వారాలూ తెలుగు లోగిళ్ళలోనే కాక, సినిమాహాళ్ళలోనూ పండుగ వాతావరణం సందడి చేయనుంది.
 
 క్రిస్మస్ కానుకలు...
 ఈ డిసెంబర్‌లో కూడా ప్రముఖ హీరోల పెద్ద చిత్రాల హంగామా కొనసాగనుంది. మోహన్‌బాబు, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు గోపీచంద్, రామ్ లాంటి యువ హీరోలు కూడా ఈ డిసెంబర్ సినిమా సీజన్‌కు కళ తేనున్నారు. మోహన్‌బాబు, ‘అల్లరి’ నరేశ్ కలసి నటిస్తున్న వినోదభరిత చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’ చిత్రం ఈ క్రిస్మస్ సంబరాన్ని పెంచనుంది. దర్శకుడు శ్రీనివాసరెడ్డి తనదైన తరహాలో ఇందులో కామెడీ పండిస్తారని భావిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున నిర్మిస్తున్న ‘సోగ్గాడే... చిన్ని నాయనా’ రిలీజ్ కూడా ఆ సీజన్‌లోనే. చాలాకాలం తర్వాత నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రమ్యకృష్ణ నటించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్.

 పదేళ్ళ క్రితం నాటి ‘యజ్ఞం’ తరువాత ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్‌లో వస్తుంది. రచయిత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరికథ’ కూడా ప్రేక్షకులకు క్రిస్మస్ కానుకే. వేర్వేరు జానర్ల ఈ చిత్రాలతో తెలుగు తెర కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది.
 
 బాహుబలి, రుద్రమదేవి లాంటి పెద్ద సినిమాలు వస్తాయంటూ, మిగిలిన సినిమాలు రిలీజ్ చేయకుండా బంగారం లాంటి సమ్మర్ సీజన్ అంతా మనకు మనమే వృథా చేసుకున్నాం. అలా షూటింగ్‌లు, రిలీజ్‌లు డిలే చేసుకుంటూ వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా రిలీజ్‌కు వచ్చాయి. అందుకే సినిమాల క్లాష్ సమస్య, థియేటర్ల సమస్య.
 - ప్రముఖ నిర్మాత - హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకరరెడ్డి
 
 కొన్ని వారాల వ్యవధిలోనే ఇన్ని సినిమాలు బరిలో ఉండటం అంటే ఒక రకంగా మా కత్తితో మేమే పొడుచుకోవడమే. ఇలా ఒకేసారి పెద్ద సినిమాలన్నీ రావడం వల్ల రావాల్సినంత రెవెన్యూ రాదు. నిర్మాతలకూ, బయ్యర్లకూ రావాల్సిన ఆదాయంలో దాదాపు 25 శాతం కోత పడుతుంది. అంటే డబ్బు కొంత నష్టపోవడానికి ముందే సిద్ధపడి సినిమా రిలీజ్ చేయడమన్న మాట. ఇది నిజంగా బాధ కలిగించే విషయం.
 - ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా