అలసట తెలీని వలస హీరోలు

14 May, 2020 05:07 IST|Sakshi
క్వారంటైన్‌కు వెళ్లబోతున్న వలస కార్మికులతో వినోద్‌ కాప్రి

ఆశ ఉసిగొల్పుతుంది.. కష్టంలో తనవాళ్లను చేరాలని!
ఆ ఆశ అంతే వేగంగా వందల కిలోమీటర్ల గమ్యాన్ని నడిచేలా చేస్తుందా?
ఎండ, చీకటి, ఆకలి, దప్పిక.. ఎన్ని అవాంతరాలు?
అయినా ముందుకే పరిగెత్తిస్తోంది సొంత ఊరు ఆపేక్ష!
ఆ సాహసాన్ని చూడాలనుకున్నాడు వినోద్‌ కాప్రి..  హిందీ సినిమా డైరెక్టర్, రైటర్, జర్నలిస్ట్‌ కూడా!

కిందటి నెల.. ఏప్రిల్‌13న ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చూశాడు వినోద్‌ కాప్రి. ఘజియాబాద్‌లోని లోనీలో 30, 40 మంది వలస కార్మికులు తిండి లేక, డబ్బుల్లేక ఇబ్బంది పడ్తున్నారు అని. వెంటనే తన స్నేహితులను కలిసి కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఇచ్చాడు. మూణ్ణాలుగు రోజుల తర్వాత ఆ కార్మికుల దగ్గర్నుంచి ఫోన్‌ ‘మీరు ఇచ్చిన డబ్బులతో కొన్న సరుకులు అయిపోయాయి’ అని మొహమాటం ధ్వనిస్తూ. మరేం పర్లేదు అని భరోసానిస్తూ మళ్లీ సరకులు కొనిచ్చాడు వినోద్‌. వారం రోజులకు మళ్లీ ఫోన్‌. ‘మాటిమాటికీ మిమ్మల్ని అడగడం ఇబ్బందిగా ఉంది. అందుకే మా ఊరు సహార్సా వెళ్లడానికి మార్గం ఉంటే చెప్పండి’ అంటూ వేడుకోలు. ‘అయ్యో అంత పని చేయొద్దు.

బస్సులు, రైళ్లు ఏం లేవు. ఆ ప్రయత్నం మానుకోండి. ప్రమాదం. మాకు తోచిన సహాయం చేస్తాం’ అని మాటిచ్చాడు. మాట ప్రకారం కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఫోన్‌ చేశాడు వినోద్‌. అప్పటికే ఆ సమూహంలో ఏడుగురు ఇంటిబాట పట్టేశారు. మిగిలిన వాళ్లూ సిద్ధం అయ్యారు ‘ఇక్కడుంటే కన్నా దార్లో ప్రాణాలు పోయినా సరే’ అని అనుకుని. ఇరుగు పొరుగు దగ్గర సైకిళ్లు అడిగి తీసుకున్నారు ఇంటికి వెళ్లాక డబ్బు పంపిస్తామని బతిమాలుకొని. వాళ్ల సొంతూరు సహార్సా ఉన్నది బీహార్‌ రాష్ట్రంలో. ఘజియాబాద్‌ నుంచి 12 వందల కిలోమీటర్లు. ఆ దూరాన్ని తలచుకొని ఆందోళనపడ్డాడు వినోద్‌. వెంటనే తన టీమ్‌తో కలిసి కార్లో బయలుదేరాడు వాళ్లను అనుసరించడానికి. ఆ ప్రయాణం గురించి అతని మాటల్లోనే..

గంగను దాటే ప్రయత్నం చేసి...
‘మర్నాడు పొద్దున వాళ్లు మాకు సంభాల్‌ దగ్గర కనిపించారు పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ. వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపొండి అంటూ వాళ్లకు పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. వెనక్కి మళ్లకపోగా అక్కడినుంచి తమ ఊరికి అడ్డదార్లేమున్నాయా అని ఆలోచించండం మొదలుపెట్టారు. వాళ్లలో ఒకతను గూగుల్‌ ఎర్త్‌ యాప్‌లో కాలిబాట వెదకసాగాడు. అదేరోజు రాత్రి సైకిళ్లను తల మీద పెట్టుకొని గంగానది ఈదే దుస్సాహసమూ చేశారు. అది చూసి అక్కడున్న జాలరులతో సహా అందరం కలిసి వాళ్లను ఆపాం.

సైకిల్‌ చైన్‌.. శనగపిండి గట్క
సైకిళ్లతో వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. అయిదారు కిలోమీటర్లు తొక్కగానే చైన్‌ పడిపోవడం, టైర్‌ పంక్చరవడం.. సైకిల్‌ రిపేర్‌ షాప్‌ కనపడే వరకు నడవడం వాటిని తోలుకుంటూ!  శనగపిండి, బార్లీపిండితో కలిపి చేసిన గట్కా తెచ్చుకున్నారు. 24 గంటలుంది అంతే. రెండోరోజుకల్లా ఖాళీ కడుపు. దార్లో అక్కడక్కడా కనిపించిన చిన్న షాపుల్లో బ్రెడ్, బటర్, జామ్‌తోపాటు  పళ్ల బండ్లు కనపడితే అరటిపళ్లు లాంటివి కొనిచ్చాం. దార్లో ఎక్కడా స్నానాలు చేయలేదు వాళ్లు.  పోలీసుల కంట పడతామోనన్న భయంతో. రాత్రిళ్లు అయితే దోమలు, పురుగుపుట్రతో నరకాన్నే చూశారు.

ట్రక్‌.. వేగం..
లక్నో చేరేటప్పటికి వాళ్లలో శక్తి సన్నగిల్లింది. నీరసపడిపోయారు. ఓ ట్రక్‌కు ఆపి, డ్రైవర్‌కు విషయం చెప్పాం. సైకిళ్లతో సహా అందరినీ ఎక్కించుకొని 30 కిలోమీటర్లు లిఫ్ట్‌ ఇచ్చాడు. తర్వాత మళ్లీ సైకిల్‌ ప్రయాణం. అదృష్టం బాగుండి మరో ట్రక్‌ డ్రైవర్‌ గోరఖ్‌పూర్‌ వరకు అంటే వంద కిలోమీటర్లు లిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ సహాయం వాళ్ల బడలికను దూరం చేసింది.. మిగతా జర్నీని ఈజీ చేసింది. ఇన్ని ఇబ్బందులతో మొత్తానికి బీహార్‌ బార్డర్‌లోకి ఎంటర్‌ అయ్యారు. అక్కడి నుంచి సహార్సా ఇంకా 350 కిలోమీటర్లు. ఆ చెక్‌ పోస్ట్‌ దగ్గర వీళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక బస్సులో వాళ్లను సహార్సా పొలిమేరలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.

బీహారు ప్రభుత్వం చేసిన మంచి పనేంటంటే వలసల గ్రామాల పొలిమేరల్లో ఐసోలేషన్‌ క్యాంపులను ఏర్పాటు చేసి.. ఏ ఊరి వాళ్లను ఆ ఊరి క్యాంపుల్లో పెట్టడం. ఘజియాబాద్‌ వలసకార్మికులను క్యాంప్‌లోకి  పంపించే ముందు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడనిచ్చారు కాసేపు భౌతిక దూరం పాటింపజేస్తూ. వాళ్లు క్వారంటైన్‌ లోకి వెళ్తుంటే ఒకరితో ఒకరం ప్రామిస్‌ చేసుకున్నాం ఫోన్‌లో టచ్‌లో ఉండాలి ఎప్పటికీ అని. మా టీమ్‌కు ఆ ఊళ్లో వాళ్లిచ్చిన ఆతిథ్యం, చూపించిన ఆప్యాయతను మాటల్లో చెప్పలేం. తిరిగి మేం వెళ్లిపోతుంటే కళ్లనిండా నీళ్లతో వీడ్కోలు పలికారు’ అంటూ ఆ విషయాలు, విశేషాలను పంచుకున్నారు వినోద్‌ కాప్రి.
 
మంచితనమే కనిపించింది..
ఇలా వాళ్ల ప్రయాణం ఏడు రోజులు, ఏడు రాత్రులు సాగి సుఖాంతమైంది. కాని దోవంతా ఎంత టెన్షన్‌ పడ్డామో. హై వే మీద దూసుకెళ్తున్న  ట్రక్కుల వేగం ధాటికి పక్కనే సైకిళ్ల మీద వీళ్లు షేక్‌ అయ్యేవారు. బ్యాలెన్స్‌ తప్పి ఎక్కడ పడిపోతారేమోనని భయమేసేది. వంద కిలోమీటర్ల వరకు లిఫ్ట్‌ దొరికినప్పుడు చూడాలి వాళ్ల సంతోషం. పట్టలేక ఏడ్చేశారు. లిఫ్ట్‌ ఇచ్చిన ట్రక్‌ డైవర్లదీ సాహసమే. పోలీసులు పట్టుకుంటే 20 వేల జరిమానాతోపాటు ట్రక్కూ సీజ్‌ అయ్యేది. నిజానికి ఆ దారెంట మాకందరూ మంచివాళ్లే తారసపడ్డారు. తోటివాళ్ల కష్టాన్ని అర్థంచేసుకొని తమకున్న దానిలోంచే ఇతరులకు పంచే పెద్ద మనసున్న వాళ్లు. సైకిల్‌ పంక్చర్‌ వేసిన వాళ్లు డబ్బులు తీసుకోలేదు. టీ కొట్టు అతను ఉచితంగా టీ ఇవ్వడమే కాక వాళ్ల కోసం సమోసాలు చేయించిచ్చాడు. ఈ ప్రయాణం ప్రపంచం పట్ల నా దృష్టి్టకోణాన్ని మరింత విశాలం చేసింది. నాలో సానుకూల దృక్పథాన్ని పెంచింది.

మరిన్ని వార్తలు