సన్నటి లావాటి సమస్య!

2 Jun, 2015 22:59 IST|Sakshi
సన్నటి లావాటి సమస్య!

థైరాయిడ్...
 
థైరాయిడ్ అనేది మన శరీరంలోని అత్యంత కీలకమైన గ్రంథుల్లో ఒకటి. రెండు తమ్మెలుగా ఉండే ఇది.. మెడ దగ్గర థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. శరీరం తక్షణం ఉపయోగించే శక్తిని, ప్రోటీన్ల తయారీని, శరీరాన్ని ప్రభావితం చేసే అనేక ఇతర హార్మోన్ల స్రావాలను ఇది పర్యవేక్షిస్తుంది. అందుకే దీని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా అది శరీరంలోని అనేక జీవక్రియలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ చేసే అనేక సంక్లిష్టమైన పనులను పరిశీలించి, తేడాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చికిత్సలను చూద్దాం.
 
శరీరంలోని అత్యంత కీలకమైన కార్యకలాపాలన్నింటినీ థైరాయిడ్ గ్రంథి తన ప్రధానమైన హార్మోన్ల ద్వారా చేస్తుంది. వీటిలో అత్యంత ప్రధానమైనవి ట్రైఐయడోథైరానిన్ (టీ3), థైరాక్సిన్ (కొన్నిసార్లు దీన్ని టెట్రాఐయడోథైరానిన్ (టీ4) అంటారు). ఈ హార్మోన్లు మన పెరుగుదలను, శరీరంలోని అనేక జీవక్రియలు జరగడాన్ని, వాటి వేగాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్ల తయారీ అంతటినీ మరో హార్మోన్ నియంత్రిస్తుంటుంది. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) అంటారు. ఈ హార్మోన్ల తేడాల వల్ల ఏర్పడే పరిస్థితులివి...

 హైపర్ థైరాయిడిజమ్
 ఈ కండిషన్‌లో థైరాయిడ్ నుంచి వెలువడే హార్మోన్ల పాళ్లు రక్తంలో ఎక్కువగా ఉంటాయి. దాంతో జీవక్రియల్లో తేడాలు వస్తాయి. హైపర్ థైరాయిడిజమ్‌కు ముఖ్యమైన కారణాలు...  థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే మన రోగనిరోధక వ్యవస్థ నుంచి యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పన్నం కావడం. దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు.  థైరాయిడ్ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో హార్మోన్లు స్రవించడం జరుగుతుంది. ఇలా ఈ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావడాన్ని దీన్ని థైరాయిడైటిస్ అంటారు.  థైరాయిడ్ హార్మోన్ స్రావాలను ఎక్కువ చేసే ఇతర మందులను అధిక మోతాదులో తీసుకోవడం.  కొన్ని నిరపాయకరమైన లేదా క్యాన్సరస్ గడ్డలు పుట్టి అవి థైరాయిడ్ స్రావాలను అధికంగా స్రవించేలా చేయడం.

లక్షణాలు: హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలివి...  బరువు తగ్గడం  ఆకలి పెరగడం  తెలియని ఉద్విగ్నత (యాంగ్జైటీ)తో పాటు అస్థిమితంగా ఉండటం  ఏమాత్రం వేడిని భరించలేకపోవడం  చెమటలు అధికంగా పట్టడం  తీవ్రమైన అలసట  తరచుగా కండరాలు పట్టేస్తుండటం  మహిళల్లో రుతుస్రావం క్రమం తప్పడం  మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉబ్బి ఎత్తుగా కనిపించడం  గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం  కళ్లు ఉబ్బి బయటకు పొడుచుకొచ్చినట్లుగా ఉండటం  నిద్రలో అంతరాయాలు  ఎప్పుడూ ఎక్కువగా దాహం వేస్తుండటం  చర్మం రంగు మారడంతో పాటు ఎప్పుడూ దురదలు ఉండటం  వికారం, వాంతులు  మన ప్రమేయం లేకుండానే శరీర కదలికలు సంభవిస్తుండటం  వణుకు  పురుషుల్లో రొమ్ములు పెరగడం  హైబీపీ  తలవెంట్రుకలు రాలిపోతుండటం.

 నిర్ధారణ: రోగిని డాక్టర్లు పరీక్షించి, లక్షణాలను అడిగి తెలుసుకుంటారు. దాంతోపాటు రక్తపరీక్షలో రక్తంలో టీఎస్‌హెచ్, టీ3, టీ4 పాళ్లను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ వల్ల కూడా దీన్ని తెలుసుకుంటారు. ‘థైరాయిడ్ అప్‌టేక్ స్కాన్’ అనే న్యూక్లియర్ ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తెలుసుకుంటారు. దీని వల్ల హైపర్ థైరాయిడిజమ్‌కు అసలు కారణం కూడా తెలుస్తుంది. ఐయోడిన్ థైరాయిడ్ స్కాన్ వల్ల గ్రంథి పూర్తిగా గానీ లేదా ఏవైనా బొడిపెల లాంటివి ఉంటే అవిగానీ కనిపిస్తాయి. ఇక ఒక్కోసారి ఎక్స్‌రే కూడా తీస్తారు.

 చికిత్స: థైరాయిడ్ గ్రంథి పనితీరు తీవ్రతను తగ్గించడమే చికిత్స ఉద్దేశం. దీనికోసం ప్రొపైల్‌థియోయురాసిల్, మెథిమజోల్, పొటాషియమ్ ఐయోడైడ్ వంటి మందులను వాడతారు. బీటాబ్లాకర్స్ అనే మందులతో పాటు అటెనలాల్ లేదా మెటాప్రొపాల్ వంటి మందులు ఉపయోగించి, థైరాయిడ్ అతిగా పనిచేయడాన్ని నియంత్రిస్తారు. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు, దడ, చెమటలు, ఉద్విగ్నత (యాంగ్జైటీ) తగ్గుతాయి. అయితే రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఉపయోగించడం అన్నది హైపర్ థైరాయిడిజమ్‌కు చేసే శాశ్వతమైన చికిత్స. ఇది అంతటా అందరూ సిఫార్సు చేసే చికిత్సా ప్రక్రియ కూడా.
 
హైపోథైరాయిడిజమ్:

 ఈ కండిషన్‌లో థైరాయిడ్ గ్రంథి స్రవించాల్సిన హార్మోన్లు తగ్గుతాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో హైపోథైరాయిడిజమ్ ఎక్కువ. కొద్దిపాటి సమస్య ఉంటే రోగి మామూలుగానే ఉంటారు. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే స్థూలకాయం, కీళ్లనొప్పులు, సంతానలేమి, గుండెజబ్బులు రావచ్చు. హైపోథైరాయిడిజమ్ ఎవరికైనా రావచ్చు. అయితే 50 ఏళ్లు దాటిన మహిళల్లో దీని రిస్క్ ఎక్కువ. హైపోథైరాయిడిజమ్‌కు కారణాలివి...  మన రోగనిరోధక వ్యవస్థలో కొన్ని యాంటీబాడీస్ పుట్టి... అవి థైరాయిడ్ గ్రంథిపై దాడి చేస్తాయి. ఇలా కొన్నేళ్ల పాటు ఈ దాడి కొనసాగడం వల్ల సాధారణంగా స్రవించాల్సిన దాని కంటే తక్కువ హార్మోన్లు స్రవిస్తుండటం జరగవచ్చు. తన సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తమకు వ్యతిరేకంగా పనిచేసే ఈ (ఆటోఇమ్యూన్) కండిషన్‌ను ‘హషిమోటోస్ థైరాయిడైటిస్’ అంటారు. ఇక కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను స్రవించడంలో పిట్యూటరీ గ్రంథి విఫలం కావడం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ వస్తుంది. సాధారణంగా పిట్యూటరీ గ్రంథికి కణితి వస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో టీ4, టీఎస్‌హెచ్... ఈ రెండు హార్మోన్లూ తగ్గుతాయి. కొందరు మహిళల్లో గర్భధారణ తర్వాత హైపోథైరాయిడిజమ్ కండిషన్ వస్తుంది. దీన్ని పోస్ట్‌పార్టమ్ హైపోథైరాయిడిజమ్ అంటారు. తమ సొంత థైరాయిడ్ గ్రంథే యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. దీనికి తోడు ఐయోడిన్ లోపం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఐయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి.

 లక్షణాలు : హైపోథైరాయిడిజమ్ వల్ల ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. కొందరిలో కొన్ని మాత్రమే కనిపించవచ్చు. అవి...  నీరసం, అలసట  చల్లదనాన్ని అస్సలు భరించలేకపోవడం  మలబద్దకం  స్థూలకాయం  తినడం తక్కువే అయినా బరువు పెరగడం  డిప్రెషన్ ఇవి ప్రధాన లక్షణాలు.

 వ్యాధి నిర్ధారణ: హైపోథైరాయిడిజమ్‌ను నిర్ధారణ చేయడానికి కొన్ని భౌతిక పరీక్షలతో పాటు రసాయనిక పరీక్షలూ అవసరం అవి...  మెదడు పనితీరు సరిగ్గా ఉందో లేదో చూడటం (అబ్‌నార్మల్ మెంటల్ ఫంక్షన్)  వెంట్రుకలు, చర్మం, గోళ్లలో మార్పులు  ముఖం, కాళ్లూ చేతుల్లో వాపు  గుండెవేగం మందగించడం  బీపీ తగ్గడం.

 ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగితే అది మనకు తెలియకపోవచ్చు. అందుకు కొన్ని లాబొరేటరీ పరీక్షలతో పాటు టీ4, టీ3 పరీక్షలు అవసరం. వాటితో పాటు చేయించాల్సిన ఇతర పరీక్షలు ఇవి...  కొలెస్ట్రాల్ పాళ్లు  లివర్ ఎంజైమ్ పరీక్ష  సీరమ్ ప్రోలాక్టిన్  బ్లడ్ గ్లూకోజ్  పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ కౌంట్).

 యాంటీబాడీ యాంటీథైరాయిడ్ పరీక్ష వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూన్ సమస్యను నిర్ధారణ చేయవచ్చు.
 చికిత్స: హైపోథైరాయిడిజమ్ కండిషన్‌లో థైరాయిడ్ గ్రంథి స్రవించని హార్మోన్ల లోటును  బయటి నుంచి అలాంటి రసాయానాల కంపోజిషన్‌ను ఇస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ కె.డి. మోదీ,
 సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
 నాంపల్లి, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు