గోళ్లకు వేళాయె..!

16 Oct, 2013 23:37 IST|Sakshi
గోళ్లకు వేళాయె..!

ఇల్లాలికి ఒక పని కాదు, ఒక్కరి పని కాదు,ఒక జన్మకు సరిపడా పని!
 ఇక తన గురించేం పట్టించుకుంటుంది?
 తల చిక్కు తీసుకుని, కళ్లకు కాటుక దిద్దుకోడానికే టైమ్ లేకపోతుంటే...
 వేళ్లూ, గోళ్లూ కూడానా!
 అయినా తప్పదండీ!
 ఎంత పనుంటే మాత్రం గోళ్లు గిల్లుకోవడం మానేస్తారా!
 ‘గిల్లుకోవడం’ అంటే...
 ఎక్కడో ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నట్లు...
 కటకట కటకట కొరికేసుకోవడం కాదు.
 శ్రద్ధగా, ఏకధ్యానంతో గోళ్లకు లాలపోసి ‘ముస్తాబు’ చెయ్యడం.
 ఎందుకంత కష్టం అంటారా!
 గోళ్లను చూసి ఎవరూ ఇల్లాలిని చూడరు కానీ, మిమ్మల్ని మీరు చూసుకుని
 ముచ్చటపడి, మురిసిపోడానికి...
 గోరంత అందమైనా మిగిలుండాలి కదా!

 
రోజులో ఎన్నో పనులు. వీటిలో 50 శాతానికి పైగా చేతులే చేస్తుంటాయి. అన్ని పనులను చేసే చేతులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా మహిళలు. ఇంటి పనుల్లో భాగంగా తుడవడం, కడగడం, రుద్దడం.. వీటి కోసం చర్మానికి హాని కలిగించే రకరకాల రసాయనాలను రోజూ నేరుగానే ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల చేతులపై చర్మమే కాదు, వేలి కొసల్లో ఉండే గోళ్లూ ఎంతగానో దెబ్బ తింటుంటాయి. పసుపురంగులో, పాలిపోయి, పలచగా, అక్కడక్కడా విరిగి పోయి, మురికిగా... ‘మమ్మల్ని కాస్త పట్టించుకోవూ’అన్నట్టు చూస్తుంటాయి. కాని ‘తీరిక’లేదు అనే నెపంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, అప్పు డప్పుడు వాటికి రంగు వేస్తూ ఉంటారు. ‘ఇది శుభ్రతలో అతి పెద్ద లోపం’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు అందానికే కాదు మన ఆరోగ్యాన్నీ ఎదుటివారికి తెలియజేస్తుంటాయి. పాలిష్‌తో గోళ్లను మభ్య పెట్టకుండా ఇంట్లోనే ‘నఖ’ సొగసుకు ఏమేం చేయవచ్చో తెలుసుకుందాం.
 
 20 నిమిషాలు చాలు:
 ముందుగా దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్‌ని అద్దుకొని అప్పటికే గోళ్లకు ఉన్న రంగును తొలగించాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వల్ల కంటికి కనిపించని క్రిములు కూడా తొలగి పోతాయి  
 
 వేళ్ల చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి , చల్లని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. (వీలైతే కొద్దిగా మైల్డ్ షాంపూ నీటిలో కలపచ్చు) వేడినీటి గిన్నెలో 5-8 నిమిషాలు గోళ్లు మునిగేలా వేళ్లను ఉంచాలి. తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. తర్వాత మెత్తటి పొడి టవల్‌తో తడి లేకుండా తుడవాలి  
 
 నెయిల్ కటర్‌తో మీడియమ్ లెంగ్త్‌లో గోళ్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్‌లో కట్‌చేసుకోవడం చాలా సులువు
 
  నెయిల్ ఫిల్లర్‌తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి  
 
 క్యుటికల్ ఆయిల్‌ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడచ్చు. వేలితో నూనె అద్దుకొని గోరు మీద, చుట్టూత క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్ డెరైక్షన్‌లో  మసాజ్ చేయాలి  
 
 గోరుచుట్టూ ఉన్న మృత చర్మకణాలు (క్యుటికల్స్) క్యుటికల్ పుషర్‌తో తొలగించాలి. (నెయిల్ కిట్‌లో లేదా షాపులో విడిగానూ క్యుటికల్ పుషర్ లభిస్తుంది) ఆరోగ్యకరమైన గోళ్లకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్‌లోనే బాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా చర్మానికి హాని కలగ కుండా క్యుటికల్స్‌ను శుభ్రపరచాలి. (ఇందుకోసం మరో 10 నిమిషాల సమయం పడుతుంది)  
 
 హ్యాండ్ లోషన్‌ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పొరపాటున గోళ్ల్ల మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి  
 
 క్లియర్ బేస్ కోట్‌ని ప్రతి గోరుకు వేయాలి  తర్వాత నచ్చిన నెయిల్‌పాలిష్‌ను బ్రష్‌తో తీసుకొని గోరు మధ్యన ఆ తర్వాత సైడ్స్ పాలిష్ వేసుకోవాలి.  
 
 టాప్ కోట్‌ని ప్రతి గోరుమీద వేస్తే నెయిల్ పాలిష్ ఎక్కువ సమయం ఉంటుంది.
 

ఇలాగే కాలి గోర్లకూ చేయాలి.
 
 గోళ్లు విరిగిపోతుంటే!
 వేలిపై గోరు కింది భాగం  గులాబీ రంగులో కనిపించాలి. అలా కాకుండా తెల్లగా,  నలుపులో కనిపించినా, పైన ముడతలు పడినట్టుగా ఉన్నా గోరు ఆరోగ్యం బాగోలేదని గుర్తించాలి. అలాగే గోళ్లు విరిగిపోతుండటం, పలచబడటం వంటివి కనిపిస్తున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోళ్లు బలంగా ఉండటానికి వైద్యుల సలహాతో పాటు ఆహార వ్యవహారాలలోనూ తగినంత జాగ్రత్త వహించాలి.
 
 గోళ్లు విరిగిపోతున్నాయి అని అదేపనిగా ఎక్కువసార్లు మెనిక్యూర్ చేయించకూడదు. కనీసం వారం రోజుల వ్యవధి ఇవ్వాలి. గోళ్లు విరిగిపోవడానికి క్యాల్షియం లోపం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి  
 
 గోళ్లను కొరకడం మానేయాలి. అందుకు కారణమైన మానసిక ఒత్తిడి, ఇతరత్రా ఆందోళన కలిగించే పనులు, సమస్య లను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి
 
 ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ (ఉతకడం, కడగడం, తుడవడం, ఇంటి శుభ్రత కు రసాయనాలను ఉపయోగించడం.. వంటివి) సమయంలో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించాలి. నీటిని గోర్లు, గోరు చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి  
 
 శరీరం హైడ్రేట్ కాకుండా ఉండటానికి రోజూ పది గ్లాసుల వరకు మంచినీరు తాగాలి
 
 రాత్రి పడుకునే ముందు గోరు, గోరు చివర్ల చర్మం మృదువుగా మారడానికి హ్యాండ్‌మసాజ్ క్రీమ్ లేదా నూనెతో మసాజ్ చేసుకోవాలి
 
 గోళ్లతో డబ్బా మూతలను తీయడానికి ఉపయోగించకూడదు  
 
 మూడు రోజులకు ఒకసారైనా పాత నెయిల్ పాలిష్‌ను తొలగించాలి
 
 గోళ్లలో ఫంగస్ ఏర్పడితే టీ-ట్రీ ఆయిల్‌ను రోజూ రెండు పూటలా మసాజ్‌కు వాడాలి. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఫంగస్ ఉంటే నీటి తడి ఎక్కువ సేపు లేకుండా జాగ్రత్త పడాలి.
 
 సమతుల ఆహారం:
 గోళ్లు బలంగా ఉండాలంటే రోజూ కప్పు గ్రీన్ టీ సేవించాలి
 
  బార్లీ, నట్స్, సోయా.. తీసుకునే ఆహారంలో చేర్చాలి  
 
 గోళ్లు పెలుసుగా మారుతున్నాయంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల అయ్యుంటుంది. అందుకని చేపలు, చేప నూనెలు, కుసుమ నూనెలు ఆహారంలో విరివిగా చేర్చాలి. గోళ్ల మీద తెల్లటి చుక్కలుగా ఏర్పడటానికి కారణం జింక్ లోపం అయ్యుంటుంది. అందుకే మాంసం, గుడ్లు, చేపలను ఆహారంలో చేర్చాలి. వీటి బదులుగా ఛీజ్, బీన్స్, నట్స్, గోధుమ ఊక వంటివి కూడా తీసుకోవచ్చు.
 
 మసాజ్ ముఖ్యం:
 గోళ్లు పొడిగా, పెళుసుబారినట్టు ఉంటే రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్ జెల్లీతో మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు చేతులకు కాటన్ గ్లౌజ్‌లను వాడచ్చు  


 ఇంటి పనుల్లో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించేవారు వాటిని శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీయవచ్చు
 
 నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి ఎసెటేట్ బేస్డ్ రిమూవర్స్ వాడటం మేలు.
 
 ఈ జాగ్రత్తలు పాటిస్తే గోళ్లు అందంగా కనిపిస్తాయి. వేలి కొసల్లో చిరునవ్వులు చిందిస్తాయి.
 
 స్పా, బ్యూటీ సెలూన్లలో గోళ్లను శుభ్రపరచడానికి, అందంగా మలచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్, క్లాసిక్, రేడియంట్ మెనిక్యూర్, పెడిక్యూర్ మొదలైనవి. స్పా పెడిక్యూర్‌లో ముందు వేడినీటిలో షాంపూ కలిపి, కాసేపు వేళ్లను ముంచి ఉంచుతారు. తర్వాత స్క్రబ్ చేసి, మసాజ్ క్రీమ్ వాడతారు. చేతులు, పాదాల రక్తప్రసరణ కోసం ఎక్కువ సేపు మసాజ్ చేస్తారు. అలాగే ప్యాక్ ప్రీమియమ్ ఉత్పత్తులను వాడతారు. ఇన్‌స్టంట్ మెనిక్యూర్, పెడిక్యూర్‌లను గోళ్లు పగుళ్లు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. మెనిక్యూర్, పెడిక్యూర్‌కి విడివిడిగా హ్యాండ్, ఫుట్ మసాజ్ క్రీమ్‌లను తప్పక వాడాలి.
 - అరవింద్, నేచురల్స్ బ్యూటీ స్పా, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు