సుమ.. తొలి మహిళా బస్‌ కండక్టర్

29 May, 2020 12:20 IST|Sakshi
కౌంటర్‌లో లెక్క అప్పగిస్తు్తన్న సుమ, కేరళలో తొలి మహిళా బస్‌ కండక్టర్‌ సుమ

తొలి మహిళా బస్‌ డ్రైవర్, తొలి మహిళా లోకో పైలట్, ఫలానా జిల్లాలో తొలి మహిళా కండక్టర్‌... ఇవన్నీ మనకు ఇప్పటికీ తాజాదనం నిండిన వార్తలే. కేరళలో ఇలాంటి తాజా వార్తగా ప్రచురితమై 28 ఏళ్లయింది. అప్పుడు తొలి మహిళా కండక్టర్‌గా ఉద్యోగంలో చేరిన సుమ ఈ నెలాఖరుకి రిటైర్‌ అవుతున్నారు.

అది 1992, జూలై నాలుగవ తేదీ. త్రివేండ్రంలో ఆర్‌టీసీ బస్‌స్టాప్‌ కెళ్లింది సుమ. తనకు ఉద్యోగం కొత్త, తాను ఉద్యోగాన్ని ఎంచుకున్న రంగం మహిళలకు కొత్త. తెలిసిన బస్‌స్టేషన్‌ కూడా ఆమెకి కొత్తగా కనిపిస్తోంది. తనలో అలజడి కారణంగా అలా అనిపిస్తుందేమో అనుకుంది. కానీ అక్కడ ప్రయాణికులు మాత్రమే కాకుండా పోలీసులు, విలేఖరులు, ఫొటోగ్రాఫర్‌లు కూడా వచ్చారు. ప్రాంగణం కోలాహలంగా ఉంది. మహిళ... కండక్టర్‌ ఉద్యోగంలో చేరడాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అధికారికంగా ప్రారంభించడానికి రాష్ట్ర రవాణా మంత్రి బాలకృష్ణ పిళ్లై వచ్చారు. మంత్రి స్వయంగా సుమ చేతిలో టికెట్‌ ర్యాక్‌ పెట్టి సెక్రటేరియట్‌ హాల్‌ వరకు టికెట్‌ తీసుకున్నారు. ఆ వార్తను స్థానిక, జాతీయ పత్రికలు కూడా రాశాయి. ‘‘ప్రతి ఉద్యోగంలోనూ సమస్యలుంటాయి. నువ్వు కనుక ఆ సమస్యలకు  భయపడి ఈ ఉద్యోగం మానేసి వెళ్లిపోతే తర్వాత తరం మహిళలు ఈ ఉద్యోగానికి రావడానికి ఇష్టపడరు. అదే జరిగితే మహిళలకు ఒక రంగంలో అవకాశాలు మూసుకుపోయినట్లే. ధైర్యంగా నిలబడి, నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ఈ రంగంలో మహిళలకు సరికొత్త దారులు వేసిన దానివి అవుతావు’’ అని అప్పుడు మంత్రి చెప్పిన మాటలను రిటైర్‌ అవుతున్న సందర్భంగా గుర్తు చేసుకున్నారు సుమ.

ఫస్ట్‌ ర్యాంకు
‘‘కేరళ రాష్ట్రప్రభుత్వం 1992లో మహిళలను కండక్టర్లుగా నియమించడానికి తొలి అడుగు వేసింది. రాతపరీక్షలో 300 మంది పాసయ్యారు. వారిలో నాది తొలి ర్యాంక్‌. ఇంటర్వ్యూలో పదిమందిమి సెలెక్ట్‌ అయ్యాం. మాకు త్రివేండ్రంలో స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రయాణికులెవ్వరూ నా పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. స్కూలు, కాలేజీలకెళ్లే అమ్మాయిల పట్ల అశ్లీలంగా వ్యవహరించే వారి విషయంలో నేను చాలా ఖండితంగా ఉండేదాన్ని. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి ఒకమ్మాయితో అసభ్యంగా వ్యవహరించాడు. బస్సును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్తున్నప్పుడు అతడు తాను రిటైర్‌ అయిన పోలీసు అధికారినని మమ్మల్ని బెదిరించాడు. ఇలాంటి విషయాల్లో నేను కోరలున్న సింహానికే భయపడను, కోరలూడిన తోడేలుకి భయపడతానా... అని అతడి మీద కేసు ఫైల్‌ చేయించాం. ఇన్నేళ్ల ఉద్యోగంలో మరిచిపోలేని మరో సంఘటన 1997లో బస్సు ప్రమాదం. అప్పుడు నేను గర్భిణిని. మా బస్సు మరుత్తమ్‌కుజి దగ్గర ప్రమాదానికి గురైంది. నాకు చిన్న గాయాలు తప్ప ప్రమాదమేమీ లేదు. గాయాలను తుడుచుకుని, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఆర్మీ ట్రక్కులోకి ఎక్కించి హాస్పిటల్‌కు పంపించడంలో సహాయం చేశాను. ఇవి మర్చిపోలేని సంఘటనలు’’ అన్నారు సుమ.

కండక్టర్‌ మెమొరీ
నా చిన్నప్పుడు స్కూల్లో టీచర్‌ చెప్పిన కండక్టర్స్‌ మెమొరీ అంటే ఏమిటో ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత తెలిసింది. ఒక అబ్బాయికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉండేది. పాఠాలను తరచూ మర్చిపోతుండేవాడు. అప్పుడు మా టీచర్‌ కండక్టర్‌ మెమొరీ ఉండాలని చెప్పారు. బస్సులో ప్రయాణికులందరి ముఖాలతోపాటు ఎవరు ఏ స్టాప్‌లో దిగుతారో గుర్తుపెట్టుకోవాలి. చిల్లర ఇచ్చేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కచ్చితంగా ఇవ్వగలగాలని అప్పుడామె వివరించారు. నాకు అవన్నీ ఆచరణలోకి వచ్చిన తర్వాత టీచర్‌ చెప్పిన మాటలో పరమార్థం తెలిసి వచ్చింది. –సుమ, తొలి మహిళా బస్‌ కండక్టర్, కేరళ

కొన్నేళ్లుగా డెస్క్‌ డ్యూటీలో ఉన్న సుమ గత ఏడాది తిరిగి బస్‌ డ్యూటీకి వచ్చారు. ‘‘బస్సులో డ్యూటీ చేస్తూ రిటైర్‌ కావాలనేది నా కోరిక. కోవిడ్‌ కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. నేను రిటైర్‌ అయ్యే లోపు బస్సులు తిరిగితే బావుణ్నని ఎదురు చూశాను. ఈ నెల 20వ తేదీన తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. డ్యూటీ చేస్తున్నాను’’ అని చెప్పారామె సంతోషంగా. – మంజీర

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా