ఆకళింపు చేసుకో... ఆ తరువాత కార్యాన్ని సాధించు!

18 Aug, 2013 23:33 IST|Sakshi
ఆకళింపు చేసుకో... ఆ తరువాత కార్యాన్ని సాధించు!

శ్రీకృష్ణుడు అర్జునునికి ఆప్తమిత్రుడు. భాగవతంలో విదురుడు, ఉద్ధవుడు మినహాయించి మరెవరికీ శ్రీకృష్ణుని భగవత్ తత్వం అవగాహన అయినట్లు మనకి అనిపించదు. అందరూ శ్రీకృష్ణుని చాలా తెలివైనవాడనుకున్నారు. పాండవులు, గోపికలు శ్రీకృష్ణతత్వాన్ని అన్ని కోణాల నుండి అర్థం చేసుకున్నారనుకోండి, కాని అందులో చాలామంది అర్జునుడు సహా శ్రీకృష్ణుడిని ఆ విధంగా చూడలేకపోయారు. తాను ఆద్యంతరహితుడనని శ్రీకృష్ణుడు వారికి చూపించుకుంటాడు.
 
‘‘అర్జునా! జ్ఞానచక్షువు లేకుండా నీవు దీనిని చూడలేవు. అందువలన ప్రస్తుతం నీకు ప్రత్యేకమైన దృష్టిని అనుగ్రహిస్తున్నాను. దీన్ని ఇంతవరకూ నేను ఎవరికీ ప్రసాదించలేదు. ఇది సత్సమయం’’ అంటూ పరమాత్మ మెరుపులాంటి చూపును ప్రసాదిస్తాడు. ఆ క్షణంలో అర్జునునికి ప్రపంచమంతా కృష్ణమయంగా గోచరిస్తుంది. సృష్టినంతటినీ, పర్వతాలు, నదులు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలతో సహా భగవంతునిలోకి లీనమవడాన్ని గమనిస్తాడు అర్జునుడు. అనంతకాలాన్ని, ఆద్యంత రహితాన్ని, ప్రతిదీ ప్రకటితం కావడాన్ని, లోపలికి అదృశ్యం అవ్వడాన్ని, అంతటా నిండిన దైవాన్ని చూస్తాడు.

తృటిలో విశ్వమంతా... జీవితమంతా... జ్ఞాపకాల తాలూకు ప్రతిబింబాలన్నీ... చలనచిత్రం వలె అర్జునునికి గోచరిస్తాయి. అతను భయభ్రాంతుడవుతాడు. ‘‘దేవా! నీ సహజ స్నేహ ముఖారవిందాన్ని, చూపుని, చిరునవ్వుతో కూడిన నా స్నేహితునివలె కనిపించు- చూడలేకున్నాను. ఇది భరించజాలను’’ అని వేడుకుంటాడు విశ్వరూప దర్శనం చేసిన అర్జునుడు. అనంతరం అర్జునునికి యోగాల గురించి, ప్రాపంచికసూత్రాల గురించి బోధిస్తాడు కృష్ణుడు. సన్యాసం గురించి, ఆ విధమైన వైరాగ్యం గురించి ఎరుక కల్పిస్తాడు. ఒక సంఘటన, ఒక అంశం కేవలం ఒక కదలిక అని ఉదహరిస్తాడు. ‘‘మీరు చెబుతున్నదంతా మాయవలె, సంతోషపూర్వకంగా ఉంది’’అంటాడు అర్జునుడు.

 ‘‘కానీ ఇది సులభం మాత్రం కాదు, మనస్సుని అదుపులో ఉంచటం కష్టతరమైనది. గాలిని అదుపులో పెట్టటం వంటిది. ఎవరైనా గాలిని అదుపులో పెట్టగలిగారా?’’ అని ప్రశ్నిస్తాడు పరమాత్మని. ‘‘నేను నీతో ఏకీభవిస్తున్నాను. ఇది కష్టమైనదే, కాని అసాధ్యమైనది కాదు- అభ్యాసం వలన, మోహరాహిత్యం వలన, మనసు కేంద్రీకరించటం వలన... నీవు జయించగలవు’’అంటూ ప్రతి ప్రక్రియను ఉపయోగిస్తాడు శ్రీకృష్ణుడు. చివరికి విశ్వరూపదర్శనం అర్జునుని మీద పని చేస్తుంది. ఆ ఘటనను మనస్సు గాఢంగా స్వీకరించడం వలన మాయలోకి వెళ్తుంది. మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. శాంతి మనలోనే ఉందని గ్రహిస్తాడు.

దార్శనికత ద్వారా మనసుషులు మార్పును పొందలేరు. బయటి నుంచి పూర్తిగా  తెలియజెప్పాలని కృష్ణపరమాత్మ భావించలేదు. దీనికి వేరొక ఆవశ్యకత ఉంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునికి ఆద్యంతరహితమైన కాలప్రణాళిక, తనకు ప్రియమైన వాటి జాబితా, భక్తిప్రపత్తి మాత్రమే గాక ఇతర విషయాలన్నీ ప్రతిపాదిస్తాడు. సృష్టి, యుక్తభోజనం గురించి వినిపిస్తాడు. ఆ ఘటనతో అర్జునునికి ప్రశాంతత లభిస్తుంది. సర్వం వదిలేస్తానంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘నేనిక ఏమీ చేయలేను. నీకు ఏది యుక్తమనిపిస్తే అది ఆలోచించు. నేను ప్రతిపాదించినవన్నీ మొదట ఆకళింపు చేసుకుని, తర్వాత కార్యశీలుడవు కమ్మంటాడు. ‘‘నా మనస్సు తేలికపడింది. నీవు చెప్పిందే ఆచరిస్తాను’’ అంటాడు అర్జునుడు. కృష్ణుడు ఈవిధంగా పద్దెనిమిది అధ్యాయాలు అర్జునుడిని ఈ స్థితిలోకి తీసుకువచ్చేటందుకుగాను ఉపదేశించాడు.    
 
 మీకు తెలుసా?
 లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందంటే...
 గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలన, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే  ఇండ్లు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు.
 

మరిన్ని వార్తలు