ఫిట్‌నెస్ : వయ్యారి వ్యాయామం

3 Aug, 2013 04:22 IST|Sakshi
ఫిట్‌నెస్ : వయ్యారి వ్యాయామం

తెరపై తళుక్కుమనాలంటే... చూసేవాళ్లు కళ్లార్పడం మర్చిపోవాలంటే... కష్టపడాలి. కసరత్తులు చేయాలి. టాలీవుడ్ స్క్రీన్‌ను మెరిపించే అందాలరాణులకు  ఈ విషయం బాగా తెలుసు. వీరిని తీర్చిదిద్దుతున్న ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్‌డెంబ్లాకు కూడా తెలుసు. ‘‘ఒక్కో హీరోయిన్‌ది ఒక్కో రకమైన ఫిజిక్. వారికి తగిన వ్యాయామాలు సూచించడం, ట్రైనప్ చేయడం నిజంగా నాకో చాలెంజ్’’ అంటున్న కిరణ్... హీరోయిన్ల వ్యాయామాల గురించి మరిన్ని విషయాలు ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...
 
 పుట్టుకతో వచ్చే కొన్నింటిని మనం మార్చలేం. అందులో బాడీఫ్రేమ్ ఒకటి. అనుష్కది బ్రాడ్ ఫ్రేమ్. బరువు పెరిగితే లుక్‌లో స్పష్టమైన తేడా వస్తుంది. మిర్చి సినిమాకి వచ్చిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని మరీ అనుష్క వర్కవుట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేశాం. ఆమెలో గొప్పతనం ఏమిటంటే... ఎంత షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా ఖాళీ దొరికితే చాలు వర్కవుట్స్‌కి సై అంటుంది. బ్యాక్ వర్కవుట్స్, బైసప్స్, షోల్డర్ వ్యాయామాలు... అన్నింటితో పాటు, స్వతహాగా యోగా టీచర్ కూడా కావడంతో తను స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు బాగా చేస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఆమె డైట్‌ప్లాన్‌లో ప్రధానమైంది. ఒక్కరోజు కూడా వృథా చేయని పనితీరు ఆమెది. ప్రస్తుతం తను దాదాపు 12 కిలోల బరువు తగ్గి చక్కని ఫిజిక్‌తో మెరిసిపోతోంది. దీనికి నా శిక్షణ అనేకన్నా తన అంకితభావం ప్రధాన కారణమని చెప్పవచ్చు.
 
 జుంబాతో ‘ఛార్మి’ంగ్...
 చాలా బబ్లీ గాళ్. సూపర్‌ఫాస్ట్. ఆమెది చాలా త్వరగా బరువు పెరిగే తత్వం. తనకి భిన్న రకాల వర్కవుట్స్ ఇష్టం. జుంబా, యోగా, సైక్లింగ్ ఇంకా అన్నీ చేస్తుంది. జుంబా (డ్యాన్సింగ్ ఎక్సర్‌సైజ్), ఏరోబిక్ వ్యాయామాలంటే బాగా ఇష్టం. తనకి భోజనప్రియత్వం ఎక్కువ. అన్నిరకాల రుచులూ ఇష్టం. అయితే చాలా కంట్రోల్ చేస్తుంది. అది అర్థం చేసుకుని వారంలో ఒకరోజు తన ఇష్టం వచ్చినట్టు తినవచ్చునని చెప్పి... మిగిలిన సమయంలో పూర్తి డైట్ మెయిన్‌టెయిన్ చేయించాను. ఏదైతేనేం తన శ్రమ ఫలించి ఇప్పడు  సన్నగా మారి శరీర బరువు 58 కి వచ్చింది. అయితే 2-3 నెలల్లో 53 కి చేరాలనుకుంటున్నాం. తప్పకుండా చేరుతుంది.  ఉదయం పూట 11-12గంటల సమయంలో వ్యాయామం చేయడం ఆమెకి బాగా ఇష్టం. అయితే సమయం అనుకూలించకపోతే... ఏ టైమ్‌లో కుదిరితే అప్పుడు చేస్తుంది. వ్యాయామం అనేది  దినచర్యలో భాగంగా మారిస్తే చార్మి ఎప్పటికీ స్లిమ్‌గా ఉండిపోగలదు.
 
 స్ట్రెంగ్త్... తమన్నా...
 చాలామంది అనుకుంటారు, మంచి ఫిజిక్ ఉంటే వర్కవుట్ అక్కర్లేదని. అలాంటివారికి తమన్నా ఒక ఎగ్జాంపుల్. చాలా పరిణతి కలిగిన అమ్మాయి. ఏ విషయంలోనూ ఎప్పుడూ వాదించదు. ఆమెకి మనం ఏం చెప్తున్నామో అది సరిగా అర్థం చేసుకుంటుంది. ఆమెకి వ్యాయామం ఒక అవసరం కాదు అలవాటు. తను చేయడమే కాకుండా అందర్నీ చేయమంటూ ప్రోత్సహిస్తుంది. తన పేరెంట్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. వర్కవుట్స్, డైట్ గురించి బాగా చర్చిస్తుంది. అందుకే ఈ విషయంలో నాలెడ్జ్ ఎక్కువ. ఆమెకి ఇప్పటికే మంచి ఫిజిక్ ఉంది.
 
 అయినా మనం సినిమాల కోసం కాదు, ఆరోగ్యం కోసం చేస్తున్నా అంటుంది. ఎక్సర్‌సైజ్ చేయకపోతే పనిచేసే సామర్థ్యం పోతుందంటుంది. డ్యాన్సింగ్, నటన వీటన్నింటికీ ఫిట్‌నెస్ అవసరం. ఆమెకి ఇది శక్తి సమకూర్చుకునే విషయం. వ్యక్తిగతంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆమెకి చాలా ఇష్టం. అమ్మాయిల వ్యాయామాభిరుచుల పరంగా చూస్తే ఇదో ఆశ్చర్యకరమైన విషయం. అలాగే తనకు స్ట్రెచింగ్ మరో నచ్చిన వ్యాయామం. కనీసం గంట, గంటన్నర పాటు సాధన చేస్తుంది. కార్డియో కూడా బాగా చేస్తుంది. క్రాస్‌ట్రైనర్ కూడా ఇష్టం. తమన్నాకి లెగ్‌టోనింగ్ వ్యాయామాలు కాస్త ఎక్కువ అవసరం.
 
 బాడీవెయిట్‌తో బ్యూటీ...
 ఎపుడూ ఆనందంగా నవ్వుతూ ఉండే అమ్మాయి. టామ్‌బాయ్ అని పిలుస్తుంటాం. ఆమెది క్రీడాకారుడి తరహా బాడీ. బాడీ వెయిట్ వర్కవుట్ బాగా ఇష్టం. పుషప్స్, జంపింగ్ జాక్స్, పులప్స్ వంటి అన్నిరకాల బాడీ వర్కవుట్స్  చేస్తుంది. ట్రైనర్ ఫిజిక్ బావుంటే నాది కూడా బాగున్నట్టే అంటుంది. నేను ఏ రకమైన వర్కవుట్స్ చేసినా తనూ అది ఇష్టపడుతుంది. ఈ పంజాబీ అమ్మాయికి అందరు పంజాబీల్లానే... పులావ్, దాల్ మఖానీ వంటివి చూస్తే నోరు ఆపుకోలేదు. అయితే తనకి  ఇంటి ఆహారం బాగా ఇష్టం. టోనింగ్ ఆమెకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పొత్తికడుపు, నడుం దగ్గర మరింత టోనింగ్ అవసరం.
 - ఎస్. సత్యబాబు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు