శిఖరాన చేనేత

24 Dec, 2018 01:39 IST|Sakshi

చేనేత గొప్పతనాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లేందుకు చీరలు, చేనేత వస్త్రాలు ధరించి ఆస్ట్రేలియాలోని కొసియోస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి వచ్చిన ఈ ఐదుగురు పర్వతారోహకులు.. చేనేత కార్మికుల దైనందిన జీవన సాహస యాత్రలో పోలిస్తే తమదసలు కష్టమే కాదని అంటున్నారు. 

ట్రెకింగ్, మౌంటెనీరింగ్‌.. సాహసక్రీడలు. మగవాళ్లు వాటిని హాబీగా మలుచుకుంటే హీరోలుగా అభివర్ణిస్తుంది లోకం. మహిళలు ట్రాక్‌సూట్‌ వేసుకుంటే ‘ఇదేం పోకడ’ అంటూ పెదవి విరుస్తుంది. అదీ పెళ్లయి, పిల్లలు పుట్టాక ఈ అభిరుచికి ప్రాక్టికల్‌ రూపమిస్తామంటే హవ్వ అంటూ బుగ్గలు నొక్కకుంటుంది. ఇవన్నీ ఎదుర్కొన్నారు వీళ్లు. లక్షల్లో డబ్బునూ ఖర్చుపెట్టుకున్నారు. ట్రాక్‌సూట్‌ కాదు.. చీరకుచ్చిళ్లను బొడ్లో దోపుకొని మరీ 7,310 అడుగుల ఎత్తున్న కొసియోస్కో పర్వతాన్ని అధిరోహించారు. సరదా కోసం కాదు. తెలుగు నేతకు చేయూతనివ్వడానికి! మన చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి! ‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ.. టాప్‌ ఆఫ్‌ మౌంట్‌ కొసియోస్కో’ థీమ్‌తో జరిగిన ఈ అధిరోహణలో రాజీ, లావణ్య, సృజన, హసిత, సమన్యు పాల్గొన్నారు. ఈ టీమ్‌లో అందరికన్నా చిన్నవాడు సమన్యు. ఏడేళ్లు. పిన్న వయసు పర్వతారోహకుడిగానూ (కిలిమంజారో) వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ఒకరికి ఒకరు ఎలా పరిచయం?
ఈ బృందానికి నాయకత్వం వహించిన రాజీ ప్రొఫెషనల్‌ మౌంటెనీర్‌. ఈమె చిన్ననాటి స్నేహితురాలే లావణ్య. ఉన్నత చదువులు, పెళ్లితో ఈ ఇద్దరి దారులు వేరయ్యారు. కూతురి కోసం తనూ పర్వతారోహకురాలిగా మారిన లావణ్య మౌంటెనీరింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నప్పటి ఫ్రెండ్‌  రాజీని కలుసుకుంది. జీవితంలోని మంచిచెడ్డలతోపాటు మౌంటెనీరింగ్‌ గురించీ మాట్లాడుకున్నారు. పెళ్లి, పిల్లలతో  ఒళ్లుచేసిన తాను మౌంటెనీ రింగ్‌ చేయగలనా అన్న లావణ్య సందేహాన్ని పటాపంచలు చేస్తూ ధైర్యాన్నిచ్చింది రాజీ. అంతకుముందే ఇతర పర్వతారోహణలో సృజనతో పరిచయం ఉంది రాజీకి. అలా వీళ్లంతా ఒక ఫ్యామిలీలా మౌంటెనీరింగ్‌ స్టార్ట్‌ చేశారు. ఆ టైమ్‌లోనే వీవర్స్‌ కష్టనష్టాల గురించి విన్నది రాజీ. వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకుంది. లావణ్య, సృజనలతో చెప్పింది.

అందరూ కలిసి సిద్దిపేట, నారాయణ్‌పేట, గద్వాల, పొచంపల్లి వెళ్లారు. గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. నేయడమూ నేర్చుకున్నారు. రాజీ అయితే ఓ డాక్యుమెంటరీ కూడా తీసింది. ఈ నాలుగు ప్రాంతాలకు ప్రాతినిధ్యంగా నలుగురు నాలుగు చీరలను తీసుకున్నారు. రాజీ, లావణ్య, సృజన చీరలు కట్టుకుంటే గద్వాల చీరను మ్యాక్సిలా హసితకు, పోచంపల్లి కుర్తాను సమన్యుకి కుట్టించారు. దేశం హద్దులు దాటి ప్రపంచ పర్వతాల మీద ఈ నేతను రెపరెపలాడించాలనుకుని ఆస్ట్రేలియాలోని కొసియోస్కొ పర్వతం అధిరోహించారు. మామూలుగా ట్రాక్‌ సూట్‌లో అయితే ఆరుగంటల్లో ఎక్కి దిగొచ్చు ఈ పర్వతాన్ని. చీరలో కాబట్టి వీళ్లకు పదిగంటలు పట్టింది. భవిష్యత్‌లోనూ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.

చీరలు కట్టుకుని పర్వతం ఎక్కిన ప్పుడు ఫారిన్‌ మౌంటెనీర్స్‌ వీళ్లను ఆసక్తిగా గమనించి, దగ్గరకు వచ్చి ఆ చీరల గురించి, ఫ్యాబ్రిక్‌ గురించి, అవి ఎక్కడ దొరుకుతాయో అడిగి మరీ తెలుసుకున్నారట. అలా తమ మోటో, పర్పస్‌ సర్వైవ్‌ అయింది అంటున్నారు రాజీ. ‘‘యాక్చువల్‌గా యూత్‌లో సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్, సెల్ఫ్‌ ఎస్టీమ్‌ను బిల్డప్‌ చేయడానికి మౌంటెనీరింగ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాం. దాంతోపాటు చేనేతనూ థీమ్‌గా తీసుకున్నాం. యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతోంది. ఆత్మహత్య దాకా వెళ్తోంది. ఆ టెండెన్సీని పోగొట్టి వాళ్లలో ధైర్యం నింపాలన్నదే మా లక్ష్యం. మౌంటెనీరింగ్‌ వల్ల.. మనకున్న సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి.

వీటిని మనం ఇంత పెద్దగా చూస్తున్నాం అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండే గుణం అలవడుతుంది. ముందసలు ‘వాట్‌ పీపుల్‌ విల్‌ సే’ అన్న థాట్‌కే చెక్‌ పెట్టే అటిట్యూడ్‌ అలవడుతుంది. దీనివల్ల లైఫ్‌లో ఎన్ని హర్డిల్స్‌ వచ్చినా గాభరాపడం. చాలెంజ్‌గాతీసుకుంటాం. స్పోర్టివ్‌గా ఉంటాం. ఇది మేం ఎక్స్‌పీరియెన్స్‌ అవుతున్నాం కూడా! మౌంటెనీ రింగ్‌లో విమెన్‌కు స్పెషల్‌ చాలెంజెస్‌ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ వాష్‌ రూమ్స్‌ ఉండవు. మెన్‌స్ట్రు వల్‌ సైకిల్‌ ఉంటుంది. ఇలాంటి ఆడ్‌ సిట్యువేషన్స్‌ అన్నిటినీ తట్టుకునే శక్తిని అలవాటు చేస్తాయి. షైని తగ్గించి కలివిడితనాన్ని పెంచుతాయి. మొత్తంగా స్ట్రాంగ్‌ అండ్‌ స్టబర్స్‌ పర్సనాలిటీ తయారవుతుంది’’ అంటారు రాజీ. 

మంచి షెఫ్‌ని అవుతా
రాజీ ఆంటీ వాళ్లు ట్రెడిషనల్‌ క్యాస్టూమ్స్‌ వేసుకొని కొసియోస్కో వెళ్దామని చెప్పినప్పుడు అబ్బా... ఎందుకు అనిపించింది. కాని వాళ్లతోపాటు వీవర్స్‌ దగ్గరకు వెళ్లి డే టు డే లైఫ్‌లో వాళ్లు ఫేస్‌ చేస్తున్న హర్డిల్స్‌ చూసినప్పుడు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. బేసిగ్గా నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. మౌంటెనీరింగ్‌  కంటే కూడా డ్యాన్స్, కుకింగ్‌ అంటే ఎక్కువ ఇష్టం. పెద్దయ్యాక మంచి షెఫ్‌ కావాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కొసియోస్కో దగ్గర రెస్టారెంట్‌ పెట్టాలనుంది. అక్కడ గైడ్‌తో మాట్లాడేసుకున్నా కూడా (నవ్వుతూ).
– హసిత

నాన్న డ్యాన్స్‌ చేశారు 
అక్క, అమ్మ వాళ్లతో ఫస్ట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వరకు వెళ్లా. తర్వాత రాజీ ఆంటీతో కిలిమంజారో ఎక్కాను. కిలిమంజారో ఎక్కిన అందరికన్నా యంగెస్ట్‌ కిడ్‌ నేనే అని తర్వాత తెలిసింది నాకు. స్కూల్లో నా ఫ్రెండ్స్‌ అంతా హ్యాపీగా ఫీలయ్యారు – పేపర్లో నీ పేరు వస్తుందిరా అని. టీచర్స్‌ క్లాప్స్‌ కొట్టించారు. నాన్నేమో ఎయిర్‌పోర్ట్‌లోనే డ్యాన్స్‌ చేసేశాడు. తాతయ్యేమో ఫైవ్‌ థౌజెండ్‌ పెట్టి సైకిల్‌ కొనిచ్చారు. కొసియోస్కో ఎక్కేప్పుడు కూడా చాలా ఎంజాయ్‌ చేశా.  పెద్దయ్యాక కూడా మౌంటెనీరింగ్‌ కంటిన్యూ చేస్తా.
– సమన్యూ

నమ్మినదాని మీద ఎఫర్ట్స్‌ పెట్టాలి
నేను ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్‌ని.అరుణిమ సిన్హా (కృత్రిమ కాలుతో ఎవరెస్ట్‌ ఎక్కిన పర్వతారోహకురాలు)  ఇన్‌స్పిరేషన్‌తో మౌంటెనీర్‌నయ్యా. పేరెంట్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు.  హ్యాండ్‌లూమ్స్‌ ప్రమోషన్‌ కోసం చీరలతో మౌంటెనీరింగ్‌ చేద్దామన్న రాజీ థాట్‌ నచ్చడంతో ఆస్ట్రేలియా కొసియోస్కో ప్లాన్‌ చేసుకున్నాం. సక్సెస్‌ అయ్యాం. మా ఈ టూర్‌ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో రాత్రికిరాత్రే మార్పు రాకపోవచ్చు. కాని వాళ్ల కళను, కష్టాన్ని ప్రపంచానికి చాటామన్న సంతృప్తి మిగిలింది.  మౌంటెనీరింగ్‌. ఇంజనీరింగ్‌ చదివి  జాబ్‌ చేయకుండా కొండలు గుట్టలు పట్టుకు తిరుగు తోందని తెలిసినవాళ్లు చాలా కామెంట్సే చేస్తుంటారు. పెళ్లి చేయకుండా ఏంటీ ఇదంతా అని మా పేరెంట్స్‌ మీదా ప్రెజర్‌ ఉంటోంది. విని నవ్వుకోవడమే. లిజన్‌ టు యువర్‌ సెల్ఫ్‌ డోంట్‌ లిజన్‌ టు సొసైటీ.. మౌంటెనీరింగ్‌ నేర్పిన లెసన్, పెరిగిన సెల్ప్‌ కాన్ఫిడెన్స్‌ ఇది. 
– సృజన

మా పాప వల్లే..!
నేను, మావారు ఇద్దరం బిజినెస్‌ ఫీల్డ్‌లోనే ఉన్నాం. నిజానికి మౌంటెనీరింగ్‌ వంటివన్నీ నా కప్‌ ఆఫ్‌ టీ కాదు. మా అమ్మాయి (హసిత)కి తోడుగా మౌంటెనీరింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. మౌంటెనీరింగ్‌ కోసం ట్రైనింగ్‌ తీసుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌కి  మాతో పాటు మా బాబునూ (సమన్యు) తీసుకెళ్లేదాన్ని.  వాడూ ఇంట్రెస్ట్‌ చూపడంతో  ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేశారు.  అట్లా మావారు తప్పించి మా ఫ్యామిలీ అంతా మౌంటెనీరింగ్‌ స్టార్ట్‌ చేశాం (నవ్వుతూ). మా ఫస్ట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌. తర్వాత కిలిమంజారో ఎక్కాం. మా పాప వల్ల వచ్చి ఇలా కంటిన్యూ అవుతున్నా.  దీనివల్ల కనిపించే ప్రాఫిట్‌ ఏమీ ఉండదు. పైనుంచి ఖర్చు. కాబట్టి చూసేవాళ్లకు ఇదంతా పిచ్చిగానే అనిపిస్తోంది. కాని మౌంటెనీరింగ్‌ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్‌ వేరు. దేన్నయినా ఎదర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఫిట్‌నెస్‌ పెరిగింది. మొన్న ట్రిప్‌లోనే ఎయిట్‌ కేజెస్‌  తగ్గా.
– లావణ్య

వీవర్స్‌ ముందు మనమెంత?
మా తమ్ముడు భరత్‌ మౌంటెనీర్‌. నాకు  అక్రోఫోబియా (ఫియర్‌ ఫర్‌ హైట్స్‌). ఒకసారి తమ్ముడితో కలిసి మౌంటెనీరింగ్‌కు వెళ్లా. హైట్స్‌ æ భయం పోయి అప్పటి నుంచి నాకూ మౌంటెనీరింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ కలిగింది.అంతకుముందు  కార్పొరేట్‌ ఫీల్డ్‌లో వర్క్‌ చేసేదాన్ని.  ఫైవ్‌ ఇయర్స్‌ కిందట మౌంటెనీర్‌గా జర్నీ  స్టార్ట్‌ చేశా.  ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్‌గా   ఉండాలని అలాగే పెంచారు మా నాన్న.  మా సొంతూరు కర్నూలు. ఎక్స్‌పోజర్‌ ఉండాలని నన్ను హైదరాబాద్‌లో, హాస్టల్లో ఉంచి చదివించారు నాన్న. లోకజ్ఞానం వచ్చేవరకే ఆయన నన్ను హాస్టల్లో దింపడం, హాలిడేస్‌లో తీసుకెళ్లడం చేశారు. తర్వాత నుంచి నన్నే రమ్మనేవారు. అలా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్‌గా ఉండడం అలవాటు చేశారు. కాబట్టి నా మౌంటెనీరింగ్‌ పట్లా అభ్యంతరమేమీ లేదు వాళ్లకు. అత్తింట్లో కూడా అబ్జెక్షన్స్‌ లేవు. మావారు ఎంకరేజ్‌ చేశారు. నేను బయటిదేశాలకు వెళితే బాబునూ చూసుకుంటారు. చుట్టాలు, బయటి వాళ్ల నుంచే కామెంట్స్‌ తప్ప ఇంట్లో వాళ్లందరూ ఫుల్‌ సపోర్టే. 
– రాజీ 

మరిన్ని వార్తలు