పుట్టగొడుగులతో పూల బాట!

12 Dec, 2017 05:24 IST|Sakshi
పుట్టగొడుగుల సాగు

రోజూ ఆదాయాన్ని అందించే పుట్టగొడుగుల సాగు

ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగానికి స్వస్తిచెప్పి 20 ఏళ్లుగా గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ

గ్రామీణ యువత వ్యవసాయానికి దూరం కాకుండా ఉండాలంటే అనుదినం ఆదాయాన్నందించే పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వటం ఉత్తమమని తలచాడు తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. తాను ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రచారం చేయటం సరికాదని గ్రహించి.. ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు! పుట్టగొడుగుల సాగే తన జీవనాధారం చేసుకుని ఇరవయ్యేళ్లుగా ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

వ్యవసాయానికి దూరమవుతున్న గ్రామీణ యువతకు నిరంతరం ఆదాయాన్ని అందించే జీవనోపాధి చూపాలన్న తపన సుందరమూర్తిని ఉద్యోగంలో నిలవనివ్వలేదు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని గూడపాక్కం గ్రామానికి చెందిన ఆయన ఎమ్యే పీహెచ్‌డీ పూర్తిచేసి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, సర్వశిక్ష అభియాన్‌ సమన్వయకర్తగా పనిచేశారు. 22 ఏళ్ల క్రితం ఒక రోజు క్లాసులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి లేదని గ్రహించారు.

తక్కువ ఖర్చుతో నిరంతర ఆదాయాన్ని పొందేలా వ్యవసాయం చేసే మార్గాలను గ్రామీణ యువతకు తెలియజెప్పాలని తలపెట్టాడు. తాను చీకూ చింతా లేని ఉద్యోగం చేసుకుంటూ ఎదుటి వారికి వ్యవసాయం గురించి చెప్పటం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో ఉద్యోగాన్ని కూడా వదిలెయ్యాలన్న ఆలోచన వచ్చింది. భార్య మీనాక్షికి చెప్పటంలో ‘పిల్లలు లేరు. ఆర్థిక భద్రత ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తానంటే ఎలా’ అని ఆమె ప్రశ్నించారు.

చివరికి ఆమెను ఒప్పించి.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే సాయంత్రం సమయంలో పుట్టగొడుగుల సాగుపై అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించారు. పట్టణవాసులు పుట్టగొడుగుల వాడకంపై ఆసక్తి కనపరుస్తున్నందున ఈ రంగాన్ని ఎంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చి1997లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని సుందరమూర్తి వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొంది రూ. 70 వేలతో రెండు ప్రత్యేక షెడ్‌లను ఏర్పాటు చేసుకుని.. అనుభవజ్ఞుల సాయంతో పుట్టగొడుగుల సాగులో మెళకువలను నేర్చుకున్నారు. ఎక్కువ డిమాండ్‌ వుండే పాలపుట్టగొడుగు, చిప్పి పుట్టగొడుగుల సాగు చేయడంతో పాటు విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయించారు. మరోవైపు యువతకు ఉచితంగానే శిక్షణ ఇచ్చారు.

చిప్పి రకం పుట్టగొడుగులు రుచి ఎక్కువగా వుంటుంది. మసాల పెద్దమొత్తంలో వేసినా వాటిని పీల్చుకునే శక్తి ఎక్కువ. మృదువుగానూ ఉంటుంది. ఈ రకమైన పుట్టగొడుగుల సాగు కోసం ప్రత్యేకంగా మరో  షెడ్‌ను ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తుండడంతో, తమ పుట్టగొడుగులను కొనడానికి  ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్డర్‌లను తీసుకుని డోర్‌డెలివరీ కూడా ఇస్తుండటంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. భార్య మీనాక్షి తోడ్పాటుతో ప్రస్తుతం సుందరమూర్తి నెలకు 600 కేజీల నుండి 4 వేల కేజీల వరకు పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతుండటం విశేషం. 
 
యువతకు శిక్షణ ఇవ్వడంలోనే సంతృప్తి!
ముళ్ళ బాటను దాటితేనే పూల బాట వస్తుంది. సవాళ్ళను ఎదుర్కోకుండానే సక్సెస్‌ ఎలా అవుతాం అని ప్రశ్నించుకున్నా. కష్టమో నష్టమో వ్యవసాయం చేయాలనుకుని ఉద్యోగం వదిలేశాక.. మళ్ళీ వెనుకడుగు వేయలేదు. మొదట్లో కొంత భయపడ్డా తరువాత కుదురుకున్నా. ప్రతి నెలా వందలాది మంది రైతులకు, యువకులకు ఇరవయ్యేళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. పుట్టగొడుగుల సాగు చేయడం కన్నా వేలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తున్నది.
– సుందరమూర్తి, గూడపాక్కం, తిరువళ్లూరు,
తమిళనాడు   sundar1967@gmail.com
(వివరాలకు – రాజపాల్యం ప్రభు, 9655880425)
– కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు, తమిళనాడు


                                     సంచితో వుంచిన పుట్టగొడుగులవిత్తనాలు, పుట్టగొడుగు

మరిన్ని వార్తలు