సేంద్రియ సంగీత సేద్యం

29 Mar, 2019 01:12 IST|Sakshi

స్వయం విత్తనం

రెండే రెండు ఎకరాల వ్యవసాయ భూమి. ఆ చారెడు నేలలోనే రెండు వందల రకాల స్థానిక కూరగాయలు పండించారు.ఒక్కో చెట్టు నుంచి 24 కేజీల దిగుబడి వచ్చేలా ఏపుగా పెంచారు.పద్దెనిమిది సంవత్సరాలుగా విత్తనాలను స్వయంగా సమకూర్చుకుంటున్నారు.సేంద్రియ వ్యవసాయం మీదే దృష్టి కేంద్రీకరించారు కర్ణాటక రాష్ట్రానికిచెందిన సంగీత అనే మహిళ.వ్యవసాయ రంగంలో ఆమె సాధించిన విజయం గురించి...

 సంగీత తండ్రి పరమానంద శర్మ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిలిటరీ డైరీ ఫారమ్‌లో పనిచేసేవారు. వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. తను దాచుకున్న డబ్బులు, కుటుంబ సహకారంతో బెంగళూరు నగర శివార్లలో కొద్దిపాటి భూమి కొన్నారు. రాళ్లు, తుప్పలు, పాములతో నిండి బీడులా ఉన్న ఆ భూమిని తన స్వయంకృషితో సుక్షేత్రమైన మాగాణంలా మార్చుకున్నారు. వ్యవసాయంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కుమార్తె సంగీత. అదే భూమిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అగ్రో – ఇకాలజీ నాలెడ్జ్‌ ఫార్మ్‌ ప్రారంభించింది. స్థానికంగా పండే వంకాయల నుంచి సుమారు రెండు వందల రకాలు పండించారు సంగీత. పచ్చి మిర్చి, పొద్దు తిరుగుడు, దానిమ్మ, వెలక్కాయలు, గోధుమ, చిరుధాన్యాలు పండించడమే కాకుండా, పద్దెనిమిది సంవత్సరాలుగా స్వయంగా విత్తనాలు సేకరిస్తున్నారు.సంగీత నాయకత్వంలో చాలామంది రైతులు ఇందులో పనిచేస్తున్నారు.

ఇక్కడ స్థానికంగా పండే వంకాయలను ఒకే చెట్టు నుంచి 24 కేజీల దిగుబడి వచ్చేలా కృషి చేశారు. తండ్రి ప్రారంభించిన ‘అన్నదానం’ సంస్థ నుంచి ఇప్పటికి మిలియన్‌ ప్యాకెట్ల కంటే ఎక్కువ వెరైటీ విత్తనాలను ఉచితంగా రైతులకు అందించారు. ‘‘నేను పొలాల మధ్య పుట్టి పెరిగాను, టాంగా మీద స్కూల్‌కి వెళ్లాను. అందువల్ల చిన్నతనం నుంచే ప్రకృతికి చేరువగా పెరిగాను. మా నాన్నగారు పొలం పండిస్తూ, 80 ఆవులతో డైరీ ఫారమ్‌ నడిపారు. నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. సీతాకోకచిలుకలు, గొంగళి పురుగు గూళ్లు, చిన్నవిత్తనం నుంచి మహావృక్షం రావడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది’ అంటారు సంగీత. అది 2001. అప్పుడే వారి కుటుంబం రీ లొకేట్‌ అయింది. ఓ రోజున అవొకాడో చెట్టు కింద తండ్రి, చెల్లెలితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ‘మనం తినే ఆహారాన్ని రసాయనాలతో ఎందుకు తయారు చేస్తారు, క్యాలీఫ్లవర్‌ ఎందుకు అంత తెల్లగా ఉంటుంది, ద్రాక్షలమీద తెల్లటి పొర ఎందుకు ఉంటుంది.

మన రైతులు రసాయన ఎరువులను ఎందుకు వాడుతున్నారు’ అని అడిగేది. అలా వారి సంభాషణలో ఒకసారి సంగీత చెల్లి అనిత, ఇటువంటి విషయాల గురించి విస్తృతంగా పరిశోధన చేయమని సంగీతను ప్రోత్సహించింది. అలా తన ప్రయాణం వ్యవసాయం వైపుకు మళ్లిందంటారు సంగీత.ఈ తపన ఆమెను దేశమంతా పర్యటించేలా చేసింది. గ్రామగ్రామాన అడుగు పెట్టి, రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. భగవంతుడు ఇచ్చిన ఆశ్చర్యకరమైన, అద్భుతమైన వరం. నేటికీ హైబ్రీడ్‌ కోసం విత్తన కార్పొరేషన్‌ మీద ఆధారపడుతున్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి అధికంగా డబ్బులు ఖర్చు చేయవలసి వస్తోంది. అందువల్ల అన్నదానం ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాల కోసం సీడ్‌ బ్యాంక్‌ను నడుపుతోంది. 200 రకాల విత్తనాలను రెండు ఎకరాలలో వేసి పండించేలా కృషి చేశారు. 

కేరళ వరదలు...
‘అన్నదానం’ సంస్థలో ఉన్న ఐదు లక్షలకు పైగా విత్తనాల ప్యాకెట్లను కేరళ వరదలతో పొలాలు నీట మునిగిపోయి, నష్టపోయిన అక్కడి రైతులకు అందచేశారు. ఆ తరవాత కేరళకు చెందిన 14 మంది రైతులు స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకునేలా శిక్షణ పొందారు.

కనీస ధర్మం
దేశంలో 45 కోట్ల మంది రైతులు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలని, సేంద్రియ వ్యవసాయం చే యడమే వారికి మనం చెప్పుకునే కృతజ్ఞత. సహజంగా పండించే పంట వల్ల, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వైద్య ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అంటారు సంగీత. పురుగు మందులు, రసాయనాల బెడద ఉండని వీరి పంటపొలాలు రకరకాల పక్షులను, జంతువులను ఆకర్షిస్తూ జీవవైవిధ్యానికి తోడ్పడుతున్నాయి.
– జయంతి

ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో మొత్తం మూడు లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారికి కావలసిన ఆహారం ఏ విధంగా పండించుకోవాలి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. రాతి ఉప్పు దగ్గర నుంచి దేనినీ వీరు కొనుగోలు చేయట్లేదు. అన్నీ స్వయంగా పండించుకుంటున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు, వందల రకాల కూరగాయలతో పాటు, పండ్లు, మూలికలకు కావలసిన పదార్థాలను సైతం పండిస్తున్నారు. భూమిని దున్నడంతో పాటు, పేడ సహజ ఎరువులతో కంపోస్టు తయారుచేసి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీటికి సోలార్‌ వాటర్‌ హీటర్లు, బయో గ్యాస్‌ ప్లాంట్‌ సహాయంతో సొంతంగా వంట చేసుకుంటున్నారు. బిందు సేద్యం చేస్తూ, నీరు వృథా కాకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆగ్రో ఇకాలజీ అనేది వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నదే. మన సంప్రదాయ పద్ధతులను తిరిగి పాటిస్తున్నారు ఈ సంస్థ ద్వారా సంగీత. స్థానిక పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా