మడతేసుకునే బ్యాటరీలు వస్తున్నాయి...

3 Feb, 2018 00:27 IST|Sakshi
బ్యాటరీ

మడత పెట్టేయగల టెలివిజన్లను ఈ నెలలోనే చూశాం. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌ పీసీలు ఇదే దారి పట్టనున్నాయి. ఎందుకంటే కొలంబియా ఇంజనీరింగ్‌కు చెందిన యువాన్‌ యాంగ్‌ అనే శాస్త్రవేత్త ఎటు కావాలంటే అటు వంచగలిగే లిథియం అయాన్‌ బ్యాటరీలను సిద్ధం చేశారు. మనిషి వెన్నెముక నిర్మాణం స్ఫూర్తిగా తయారైన ఈ కొత్త బ్యాటరీలు తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగలవని యాంగ్‌ అంటున్నారు. వెన్నెముకలోని కీళ్ల మాదిరిగా అవసరాన్ని బట్టి సామర్థ్యం పెంచుకోవచ్చు కూడా అని యాంగ్‌ తెలిపారు.

సంప్రదాయ బ్యాటరీల్లో వాడే ఆనోడ్, సెపరేటర్, క్యాథోడ్‌/సెపరేటర్లను పొడవైన పట్టీల్లా చేయడం... పొడవైన ఆధారంపై వీటిని వెన్నెముక కీళ్లమాదిరిగా ఏర్పాటుచేయడం ఈ కొత్త బ్యాటరీ ప్రత్యేకతలు. ఈ నిర్మాణం కారణంగా బ్యాటరీలను అడ్డంగా ఒంపేసేందుకు వీలేర్పడింది. విద్యుత్తును నిల్వ చేసుకునే భాగాలు విడివిడిగా ఉండటం వల్ల సామర్థ్యం పెరిగింది. వోల్టేజీ హెచ్చుతగ్గులను తట్టుకోవడమే కాకుండా పలుమార్లు చార్జింగ్, డిస్‌చార్జింగ్‌ చేసినా సామర్థ్యం తగ్గలేదని యాంగ్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు