మీ ఆహారమే...మీకు శిరోజరక్ష

12 Dec, 2016 15:03 IST|Sakshi
మీ ఆహారమే...మీకు శిరోజరక్ష

మీరు జుట్టు ఊడిపోతోందంటూ బాధపడే వారి జాబితాలో ఉన్నారా? అయితే ఇది తప్పక చదవండి. మీకు చాలా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.

మీకు తెలుసా? మనం రోజూ దాదాపు నూరు వెంట్రుకల వరకు కోల్పోతుంటాం. ఇది చాలా నార్మలే. అయితే అదే పనిగా జుట్టు ఊడిపోవడం ఎక్కడికి దారితీస్తుందోనని, తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. వాళ్ల ఆందోళన తీరాలంటే చేయాల్సిందేమిటంటే...

జుట్టుకు అవసరమైన మూడు అంశాలు: జింక్, ఐరన్, విటమిన్-సి... ఈ మూడు పోషకాలు జుట్టు పాలిట మూడు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు. అందుకే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

జింక్ కోసం: జుట్టుకు అవసరమైన జింక్ కోసం... ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్‌తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. జింక్‌కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే. ఇక దానితో పాటు సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో జింక్ పాళ్లు ఎక్కువ. దాంతోపాటు పుచ్చకాయ తింటూ వాటి గింజలను ఊసేయకండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే.

ఐరన్ కోసం: మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో అయితే కాలేయం, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే   ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీ ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

విటమిన్-సి కోసం: మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి  పండ్లన్నింటిలోనూ విటమిన్-సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం ఒకింత తక్కువే.

ఇవన్నీ తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండుసార్లు తలస్నానం చేస్తూ ఉన్నా, జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత జుట్టు రాలే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటిదేదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ స్వాభావికంగానే ఈ సమస్య లేకుండా చూసుకోవాలంటే చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని గుర్తుంచుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్‌లు, ట్రైకాలజిస్ట్‌ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది.

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్
- డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్

మరిన్ని వార్తలు