ఫుడ్‌ ఏటీఎం

15 Nov, 2019 03:40 IST|Sakshi

గుప్పెడు మెతుకులు

రైతు కష్టపడి పండించిన పంటను మనం ఇంటికి తెచ్చుకుని వండుకుని తింటున్నాం. వండుకున్నది మిగిలిపోతే పడేస్తున్నాం. రైతు పడిన కష్టం మనకు తెలియదు. అందుకే ఆహారం విలువ కూడా తెలియట్లేదు. విందు వినోదాలలోనైతే టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతుంటుంది. ఈ వృథాను అరికట్టేందుకు కొన్ని సేవా సంస్థలు మిగిలిన పదార్థాలను సేకరించి పేదలకు అందజేస్తుంటాయి. తాజాగా ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ‘తృప్తి’ పేరున ఒక ఏటీఎంను నెలకొల్పారు. పేదలకు ఉచితంగా తినడానికి ఇంత ముద్ద అందజేయడం కోసమే ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సంబల్‌పూర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ముందుగా తమ దగ్గరకు వచ్చిన ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉందో లేదో పరీక్షించిన తరువాత మాత్రమే ఏటీఎంలో భద్రపరుస్తామని స్వచ్ఛ సంస్థ సభ్యులలో ఒకరైన దిలీప్‌ పాండా చెబుతున్నారు. అది కూడా కేవలం ప్యాక్డ్‌ శాకాహారం మాత్రమే విరాళంగా అందజేయాలట. పేదవారికి, అనాథలకు ఉచితంగా ఆహారం అందజేయడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది. పేరుకు ఏటీఎం అయినా.. ఇందుకు కార్డులేమీ అవసరం లేదు. ఆకలి ఉంటే చాలు. 700 లీటర్ల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్‌లో ఈ ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. సంబల్‌ పూర్‌ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ ఆసుపత్రి దగ్గర ఇది కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు