అన్నపూర్ణమ్మ

8 Apr, 2020 07:15 IST|Sakshi

ఏప్రిల్‌ ఒకటో తేదీ, చెన్నైలో ఉన్న ఆర్తికి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిందెవరో తెలియదు. తన కాంటాక్ట్స్‌లో ఉన్న నంబరు కాదు. ట్రూ కాలర్‌ చూపిస్తున్న పేరు కూడా తనకు తెలిసినది కాదు. అయినా ఆ ఫోన్‌ కాల్‌ ఆన్సర్‌ చేసిందామె. ‘అవసరం లేకపోతే ఎవరైనా ఎందుకు ఫోన్‌ చేస్తారు? తెలియని వారి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ అయినా సరే... వారు తెలియని కారణంగా ఫోన్‌ తీయకపోవడమేంటి’ అనే ఆమె తత్వమే ఆ ఫోన్‌ కాల్‌ను కూడా ఆన్సర్‌ చేసేలా చేసింది. ఆమె ఫోన్‌ ఆన్సర్‌ బటన్‌ తాకిందో లేదో... ‘హలో’ అనే లోపే ఆవేదన నిండిన ఒక గొంతు ఆక్రోశమంతా వెళ్లగక్కింది. ‘‘అన్నం తిని మూడు రోజులైంది. మీరు వెంటనే ఏదైనా చేయండి’’ అది అర్థింపో, వేడికోలో కూడా అర్థం కావడం లేదు ఆర్తికి. అంతకంటే మరేదో ఉందా గొంతులో. ‘అమ్మా! నాకు ఆకలవుతోంది. అన్నం పెట్టు. ఇంతసేపు అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్, త్వరగా పెట్టు’ అంటూ పిల్లవాడు తల్లి కొంగును గుంజుతుంటాడు. మరేమీ పాలుపోక వెంటనే అన్నం కలిపి పెట్టేంతగా ప్రభావితం చేస్తుంది పిల్లల హఠం.

ఫోన్‌లో వినిపిస్తున్న వ్యక్తి మాటలు కూడా అలాగే ఉన్నాయి. సొంత తల్లిని అడుగుతున్నట్లే హక్కులాంటిదేదో ధ్వనిస్తుందా గొంతులో. ఎవరో తెలియదు, ఆకలితో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. అతడు ఎక్కడున్నాడో తెలుసుకుంది ఆర్తి. అతడు మాట్లాడుతున్నది హోసూర్‌ నుంచి. అతడు హోసూరుకు వచ్చింది జార్ఖండ్‌ నుంచి. జార్ఖండ్‌ నుంచి హోసూరుకు వచ్చిన వలస కూలీ అతడు. కోవిడ్‌ కోరల్లో చిక్కుకున్న ఒక అభాగ్య జీవి. పని లేదని మానుకోదు ఆకలి. తన టైమ్‌కి తాను దాడి చేసి తీరుతుంది. పట్టెడన్నం పెట్టి ఆ దాడికి అడ్డుకట్ట వేయమంటోందా ఫోన్‌. చెన్నై నుంచి హోసూరుకు మూడు వందల కిలోమీటర్లు. ఐదు గంటల ప్రయాణం. ఆర్తి వెంటనే హోసూరులో తనకు తెలిసిన వారికి సమాచారం ఇచ్చి జార్ఖండ్‌ వ్యక్తికి నిత్యావసర సరుకులు అందే ఏర్పాటు చేసింది. ‘ఆ వ్యక్తి తనకే ఎందుకు ఫోన్‌ చేశాడు? తన నంబర్‌ ఎలా తెలిసింది’ అని కొన్ని క్షణాల పాటు ఆలోచించింది ఆర్తి. ఆ తర్వాత మర్చిపోయింది.

రెండో రోజు కూడా
ఏప్రిల్‌ రెండో తేదీ కూడా మళ్లీ ఫోన్‌. ఈసారి జార్ఖండ్‌ వ్యక్తి కాదు, మరొకరు. ఈసారి వచ్చిన ఫోన్‌ కాల్‌ ఒకరి ఆకలి గురించి కాదు. ఏకంగా నూటా తొంబయ్‌ ఎనిమిది మంది ఆకలి. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి భవన నిర్మాణరంగంలో దినసరి కూలీలుగా పని చేస్తున్న వాళ్ల నుంచి. లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే కాంట్రాక్టర్‌లు పనులు మానేసి తమ కార్లలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. కార్మికులు మాత్రం తాత్కాలిక గుడారాల్లో మిగిలిపోయారు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. అన్నం పెట్టే వాళ్ల కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఆర్తికి వచ్చిన రెండో ఫోన్‌ అదే. ఆ తర్వాత మంగుళూరు నుంచి అలాంటిదే మరో ఫోన్‌. ఐదు రోజుల్లోనే ఆమెకు పదికి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. రెండు వందల పదిహేడు మంది ఆకలి పిలుపులవి. అన్నం పెట్టమనే వేదనలవి. ఆమె స్వయంగా కొందరికి, సోషల్‌ మీడియా ద్వారా మరికొందరికి సహాయం చేసింది. 

అంకె మారింది
అంతమంది అన్నం పెట్టమని తనను అడగడంలోని ఆంతర్యం ఆర్తికి వారిని స్వయంగా కలిసినప్పుడు తెలిసింది. తమిళనాడు ప్రభుత్వం కోవిడ్‌ లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి, పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు సహాయం చేయడానికి ఒక హెల్ప్‌లైన్‌ నంబరు ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫోన్‌ నంబరులో పొరపాటున ఒక అంకె మారిపోయింది. ఆ అంకె మారగా వచ్చిన నంబరు ఆర్తి మధుసూదన్‌ది. అందుకే ‘అమ్మా! ఆకలి’ అంటూ ఆమెకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ప్రభుత్వం పొరపాటుగా నంబరు తప్పుగా విడుదల చేయడం కొత్తేమీ కాదు. కానీ అలా వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు స్పందించి అడిగిన వారి ఆకలి తీర్చడమే కొత్త. అన్నం పెట్టే అన్నపూర్ణ వంటి మనసున్న ఆర్తికే అలాంటి ఫోన్‌లు రావడం ఓ విచిత్రం.  ఆర్తి మధుసూదన్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రతి డెవలప్‌మెంట్‌నీ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. సమాచారం సంబంధిత అధికారులకు చేరింది. ఆరవ తేదీ నుంచి ఆమెకు ‘అకలమ్మా’ అనే ఫోన్‌లు రావడం లేదు. ‘‘బహుశా ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబరును సరి చేసి ఉండవచ్చు’’ అంటోంది ఆర్తి.
– మంజీర
 

మరిన్ని వార్తలు