నక్కలు ఆహారాన్ని నమలవా?

4 Jan, 2015 00:20 IST|Sakshi
నక్కలు ఆహారాన్ని నమలవా?

► మగ నక్కను డాగ్ లేక రేనార్డ్ అని, ఆడ నక్కను విక్సెన్ అని అంటారు. వీటి నివాసాన్ని డెన్ లేక ఎర్త్ అంటారు!

►నక్కపిల్లల్ని కిట్స్ అంటారు. ఇవి జన్మించిన రెండు వారాల తర్వాతే కళ్లు తెరుస్తాయి. రెండు వారాల వరకూ వాటికి చెవులు కూడా వినిపించవు. అందుకే అంతవరకూ అవి బొరియల్లోంచి బయటకు రావు!

► నక్కలకు పగలు కంటే రాత్రిపూట కళ్లు చాలా బాగా కనిపిస్తాయి. అందుకే ఎక్కువగా రాత్రిళ్లే వేటాడుతుంటాయి!

►ఇవి ఆహారాన్ని నమలవు. పళ్లతో కొరికి అమాంతం మింగేస్తాయి. పైగా ఇవి అదీ ఇదీ అని కాదు... ఏది తిన్నా బతికేస్తాయి. అవి ఎప్పుడూ తినే ఆహారం దొరక్కపోయినా, మన ఇంటికి తీసుకొచ్చి బ్రెడ్డూ జామూ పెట్టినా కూడా సరిపెట్టేసుకుంటాయి!

►మగ నక్కలు ఆడనక్కలను చాలా ప్రేమగా చూసుకుంటాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్న సమయంలో చాలా సేవలు చేస్తాయి.

ఆహార వేటకు వెళ్లనివ్వవు. అవే స్వయంగా వెళ్లి తీసుకొస్తాయి. పిల్లల పెంపకంలో కూడా పాలు పంచుకుంటాయి. దగ్గరుండి పిల్లలకు వేటాడటం నేర్పుతాయి!

►   తీరిక వేళల్లో ఇవి ఆటలాడుతుంటాయి. రెండు మూడు నక్కలు కలిసి పరుగులు తీస్తూ, గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి!

►  నక్కలు ఒక్కోసారి చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటాయి. తమకు ఆహారం దొరకని పక్షంలో... వేరొకరి ఆహారాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటాయి. దానికోసం పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చేస్తుంటాయి!

►   ఇవి ఒక్కో వయసులో ఒక్కో రకంగా అరుస్తుంటాయి. అంటే వయసు పెరిగే కొద్దీ వాటి అరుపులో మార్పు వస్తుంటుంది. సందర్భాన్ని కూడా ఇవి రకరకాలుగా అరుస్తుంటాయి. ఆ అరుపును బట్టి మిగతావి అది ఏం చెబుతుందో అర్థం చేసుకుంటాయి!

►   ఇవి అఖండమైన తెలివి తేటలు గలవి. ఆహారం కోసం రకరకాల ఎత్తులు వేయగలవు. అవి వేసే ఎత్తులకు తిరుగే లేదు. అందుకే నక్కజిత్తులు అని పేరు వచ్చింది.
 
 

మరిన్ని వార్తలు