అమెరికాలో ఆహార వృథా  ఇంతింత కాదు!

20 Apr, 2018 00:53 IST|Sakshi

అన్నం పరబ్రహ్మ స్వరూపమనే భావన మనది. కానీ అమెరికాలో పరిస్థితి మాత్రం చాలా భిన్నమని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. వెర్మోంట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 2007 – 2014 మధ్య కాలంలో అమెరికా మొత్తం మీద రోజూ 1.5 లక్షల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన చూస్తే అమెరికాలోని ప్రతి వ్యక్తి రోజూ అర కిలో వరకూ వృథా చేస్తున్నారన్నమాట. ఇంత భారీ మొత్తంలో ఆహారం పండించాలంటే కనీసం మూడు కోట్ల ఎకరాల భూమి అవసరమవుతుందని, 420 లక్షల కోట్ల లీటర్ల సాగునీరు ఉపయోగించాల్సి ఉంటుందని లెక్కకట్టింది. ప్ల్లస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం అమెరికన్లు వృథా చేసే ఆహారంతో 32 కోట్ల మంది కడుపు నింపవచ్చు.

ఆరోగ్యం కోసం రకరకాల పండ్లు, కాయగూరలు తినే నెపంతోనూ వృథా పెరుగుతోందని చెబుతున్నారు. సూపర్‌ మార్కెట్లలో కాయగూరలు, పండ్లన్నీ ఒకే సైజు, రంగులో ఉండేలా చేసేందుకు కొంచెం అటుఇటుగా ఉండే వాటిని చెత్తబుట్టలోకి చేర్చేస్తున్నారని, ఈ విషయంలో ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరముందంటున్నారు. నాణ్యమైన ఆహారం కోసం జరుగుతున్న వృథాను అంచనా వేసేందుకు వెర్మోంట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అమెరికా వ్యవసాయ శాఖ ‘వాట్‌ వీ ఈట్‌ ఇన్‌ అమెరికా’ పేరుతో అధ్యయనం చేపట్టింది. 2015లో సేకరించిన వివరాల ఆధారంగా ఆహార వృథాపై మదింపు చేసినట్లు అంచనా.  

మరిన్ని వార్తలు