కాబోయే తల్లి కోసమే!

18 Jun, 2017 23:50 IST|Sakshi
కాబోయే తల్లి కోసమే!

‘‘మీ గదిలో చక్కటి బేబీ ఫొటోలు, గొప్ప వ్యక్తుల ఫొటోలు తగిలించరా’’ అని తల్లి కొడుకుకి పురమాయించడం... ‘‘ఎవరి ముఖమో చూస్తే అలాంటి పిల్లలు పుడతారా అమ్మా? మన మొహాలెలా ఉంటే అలాగే పుడతారు కానీ’’ కొడుకు తుంచేయడం, ఆ మాటతో కోడలి మనసు చివుక్కుమనడం... దాదాపుగా జరిగేవే.

పైకి అలా అన్నప్పటికీ... సాయంత్రానికి నాలుగైదు ఫొటోలు పిల్లలవి, మరో నాలుగైదు దేశనాయకుల ఫొటోలు... ఎంపిక చేతకాక ఇతరత్రా ఏవో కొన్ని ఫొటోలు వచ్చి ఇంట్లో అన్ని గదుల గోడలకూ వేళ్లాడతాయి. ‘నేషనల్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యోగ(సిసిఆర్‌వై)’ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ నెల 21వ తేదీన యోగాడే సందర్భంగా విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి అనేక సంగతులను ఉదహరించింది.

గర్భిణిగా ఉన్నప్పుడు కోపం, ఆవేశం, వ్యామోహం, దురాశ, దుర్గుణ సాంగత్యాలకు దూరంగా ఉండాలని చెప్పింది. అలాగే చక్కటి కథలు చదవడం, మంచి వ్యక్తులతో కలివిడిగా ఉండడం, గొప్ప వ్యక్తుల జీవితాలను చదవడం, ఆధ్యాత్మిక చింతన, మంచిని తలుస్తూ ఉండే సానుకూల దృక్పథం, అందమైన ఫొటోలను చూడడం అలవాటుగా ఉండాలని కూడా చెప్పింది సిసిఆర్‌వై. దీంతోపాటు మాంసాహారాన్ని మినహాయిస్తే మంచిదని కూడా సూచించింది.

‘మనం ఏది తలిస్తే అదే ప్రాప్తిస్తుంది’ మంచి తలిస్తే మంచి చెడు తలిస్తే చెడు... అనేది ఒక్కమాటలో చెప్పే సూక్తి. కడుపులో బిడ్డ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయనడంలో సందేహం అక్కర్లేదు. కానీ ఆహారం విషయానికి వస్తే... గర్భిణిగా ఉన్నప్పుడు... దేహం దేనిని కోరుతుంటే నాలుక వాటినే స్వీకరిస్తుందనేది కూడా అధ్యయన పూర్వకంగా నిరూపితమైంది.

అలాగే కడుపులో బిడ్డ దేనిని స్వీకరించదలుచుకుంటే తల్లి కడుపు దానినే ఇముడ్చుకుంటుందనేది కూడా అంగీకరించాల్సిన అధ్యయనమే. మాంసాహారంలో మాత్రమే ఎక్కువ పోషకాలుంటాయనే అపోహతో గర్భిణి చేత బలవంతంగా తినిపించే ప్రయత్నం వద్దు. ఆమెకు తినాలనిపించినప్పుడు తగిన మోతాదులో తినడం మంచిదే. ఎందుకంటే ఒక రుచిని తినాలనే కోరిక కలిగినప్పుడు, దానిని బలవంతంగా అణచుకోవడం అంత మంచిది కాదు.

>
మరిన్ని వార్తలు