శాంతి కోసం...స్త్రీల కోసం...

27 Feb, 2014 22:06 IST|Sakshi
శాంతి కోసం...స్త్రీల కోసం...

అన్నం పెట్టే కొడుకు అందనంత దూరం వెళ్లిపోతే  నిస్సహాయంగా మిగిలిపోయిన తల్లులు వాళ్లు. బతుకంతా తోడుంటాడనుకున్న భర్త అర్ధంతరంగా తనువు చాలిస్తే చావలేక బతుకుతున్న భార్యలు వాళ్లు! ఒక పక్క ఉన్మాదం... మరోపక్క అది మిగిల్చిన విషాదం... బీనాలక్ష్మి వచ్చేవరకూ ఇవే తెలుసు వారికి. ఆమె వచ్చాక నవ్వడం తెలిసింది. నవ్వుతూ బతకడం తెలిసింది. జీవించడానికి ఆధారం దొరికింది. జీవితానికి ఓ కొత్త అర్థం ఏర్పడింది! ఇది బీనా సాధించిన విజయం! నిస్సహాయ మహిళలకు మంచి మనసుతో ఆమె చూపిన ప్రగతిపథం!
 
అది 2004... డిసెంబర్. ఇంఫాల్‌లోని వాగ్బాయ్ గ్రామం. రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణం దగ్గర నిలబడి, కొందరితో మాట్లాడుతోంది బీనాలక్ష్మి నేప్రమ్. అంతలో తుపాకీ పేలిన చప్పుడు. ఉలిక్కిపడింది బీనా. చప్పుడు వచ్చినవైపు తలతిప్పి చూసింది. ఓ వ్యక్తి నేలకూలిపోతూ కనిపించాడు. అతడిని కాల్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ్నుంచి వెళ్లిపోతున్నారు. ఓ నిండు ప్రాణం తీశామన్న ఆలోచన  కానీ, అపరాధభావం కానీ లేదు వారిలో! చుట్టూ చూసింది బీనా. కొందరు ఆ శవాన్ని చూస్తూ వెళ్లిపోతుంటే, ఇంకొందరు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడ్డారు.

ఒక స్త్రీ మాత్రం మృతదేహం మీద పడి రోదిస్తోంది. ‘ఒంటరిగా నేనెలా బతకాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంతకంటే నీతోపాటు నేనూ పోతే బాగుండేది కదా’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోన్న ఆమెను చూసి, బీనా కదిలిపోయింది. అప్పుడే నిశ్చయించుకుంది... తనరాష్ట్రంలో ఏ మహిళా జీవించలేక మరణించడం మేలు అనుకోకుండా చెయ్యాలని! నిజానికి తుపాకీ మోతలు, హత్యలు కొత్తేమీ కాదు బీనాకి. అప్పటికే చాలా కాలంగా హింసకు వ్యతిరేకంగా పోరాడుతోందామె. చిన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే హింస అవగతమయ్యింది బీనాకి.

ఎప్పుడూ ఏవో గొడవలు, కాల్చివేతలు,144 సెక్షన్లు! దానికితోడు పై చదువుల కోసం బీనా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ లో చేరేందుకు సిద్ధపడుతోన్న సమయంలో... ఇంఫాల్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఎంతోమంది చనిపోయారు... బీనా మేనకోడలితో సహా! విచలిత అయ్యింది బీనా. దుఃఖాన్ని దిగమింగుకుని ఢిల్లీ వెళ్లిపోయింది. కానీ మనసంతా మణిపూర్ మీదే. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో హింస పెచ్చుమీరి పోయింది. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసేస్తున్నారు. అమా యకులెందరో చనిపోతున్నారు.

ఆయుధాలు సులభంగా దొరకడమే అందుకు కారణమని అర్థమైంది బీనాకి. అందుకే కొందరు స్నేహితులతో కలిసి1997లో ‘కంట్రోల్ ఆర్మ్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ని స్థాపించి, ఆయుధాల అక్రమ వినియోగాన్ని నిర్మూలించేందుకు నడుం కట్టింది. పత్రికల్లో రచనలు చేసింది. హింసకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వాగ్బాయ్‌కి వెళ్లినప్పుడు పై సంఘటన  చూసింది. మృతుడి భార్య రెబికా వ్యధ, బీనా ఆలోచనలను మరోవైపు మళ్లించింది. అంతవరకూ శాంతికోసం పోరాడిన ఆమె, తమవారి మరణంతో ఆధా రాన్ని కోల్పోయిన మహిళల కోసమూ ఏదైనా చేయాలనుకుంది. ‘మణిపూర్ ఉమెన్ గన్ సర్వైవర్స్ నెట్‌వర్క్’ను ప్రారంభించింది.
 
మహిళలకు మిత్రురాలిగా...

మొదటగా... భర్త మరణంతో ఆధారాన్ని కోల్పోయిన రెబికాకి 4,500 రూపాయలతో ఓ కుట్టుమిషను కొనిచ్చింది బీనా. అలాంటివాళ్లు ఇంకా చాలామంది ఉంటారని ఆమెకి తెలుసు. అసలు తమవాళ్లు ఎందుకు చనిపోయారో, ఎవరు చంపారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఎందరో తల్లులు, భార్యలు ఉన్నారు. ఆధారాన్ని కోల్పోవడంతో ఎలా జీవించాలో తెలియక, పిల్లలకు కడుపునిండా తిండి కూడా పెట్టుకోలేక కుమిలిపోతున్నారు. వాళ్లందరికీ తన నెట్‌వర్‌‌క ద్వారా జీవనాధారం కల్పిస్తోంది బీనా.
 
మణిపూర్‌లో ఇప్పుడు హింస తగ్గిపోలేదు. ప్రాణాలు పోవడం ఆగిపోనూ లేదు. కానీ ఇంతకుముందులా తమవారిని కోల్పోయిన మహిళలెవరూ బతుకులను భారంగా వెళ్లదీయడం లేదు. శోకం నుంచి బయటికొచ్చి సొంతగా బతకడం నేర్చుకుంటున్నారు. బిడ్డల భవిష్యత్తుకు బాటలు పరచుకుంటున్నారు. బీనా తన నెట్‌వర్క్ ద్వారా అందించే  సాయంతో చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆర్థిక స్వావలంబనతో పాటు మానసిక స్థైర్యాన్నీ మూటగట్టుకుంటున్నారు. అందుకే వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు... ‘తుపాకులు మా జీవితాల్లో విషాదాన్ని కుమ్మరిస్తే... బీనాలక్ష్మి రూపంలో వచ్చిన సంతోషం ఆ విషాదాన్ని పారద్రోలింది’ అని!
 
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో... 1974, అక్టోబర్ 19న జన్మించింది బీనా. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాలని తపన పడుతోంది. ఆ తపనకు ఫలితంగా... ‘ఇండియన్ రియల్ హీరోస్ అవార్డ్’, ‘షాన్ మెక్‌బ్రైడ్ పీస్ ప్రైజ్’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు బీనాని వరించాయి!
 

మరిన్ని వార్తలు