ఆర్జించు.. సముపార్జించు...

10 Feb, 2014 00:28 IST|Sakshi
ఆర్జించు.. సముపార్జించు...

ఆర్థిక మాంద్య పరిస్థితులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో విదేశీ విద్య.. భారతీయ విద్యార్థికి భారంగా మారుతోంది. కాబట్టి విదేశాల్లో అందుబాటులో ఉన్న పార్ట్‌టైమ్ జాబ్స్.. ఆయా యూనివర్సిటీలు వారానికి ఎన్నిగంటలు జాబ్ చేసుకునే వెసులుబాటు ఇస్తాయి? తదితర అంశాల గురించి తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కొచ్చు.
 
అమెరికా:  ఎఫ్-1 వీసాతో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు కోర్సు మొదటి ఏడాదిలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉండదు. సంబంధిత అధికారి ప్రత్యేక అనుమతి ఇస్తేనే జాబ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్.. కోర్సు మొదటి ఏడాది పూర్తయ్యాక ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వారానికి 20 గంటలపాటు ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో వారానికి 40 గంటల వరకూ ఆన్ క్యాంపస్ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
 
బ్రిటన్: బ్రిటన్‌లో బ్యాచిలర్ కోర్సులు, అంతకంటే ఉన్నతస్థాయి కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులు.. కాలేజీ జరుగుతున్నప్పుడు వారానికి 20 గంటల వరకు జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. సెలవుల్లో అయితే ఫుల్‌టైమ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ కంటే కింది స్థాయి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు వారానికి 10 గంటలు ఉద్యోగం చేసుకునే వీలుంది.
 
సింగపూర్: చదువు కోసం వచ్చిన విద్యార్థులకు కోర్సు తరగతులు జరుగుతున్నప్పుడు, సెలవుల్లో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఫారిన్ మ్యాన్‌పవర్ ప్రత్యేకంగా వర్క్‌పాస్ ఎగ్జమ్షన్ ఇస్తే పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. కొన్ని స్కూల్స్‌లో మాత్రం 14 ఏళ్ల వయసు దాటిన వారికి వర్క్‌పాస్ ఎగ్జమ్షన్ అవసరం ఉండదు. ఈ స్కూల్స్‌లో సెలవుల్లో ఉద్యోగం చేసుకోవచ్చు.
 
ఆస్ట్రేలియా:  విదేశీ విద్యార్థులకు వర్క్‌పర్మిట్ విషయంలో వెసులుబాటు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడి యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు 15 రోజులకు 40 గంటలపాటు జాబ్ చేసుకోవచ్చు. అదే సెలవుల్లో అయితే ఎన్నిగంటలైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారికి ఉన్న మరో వెసులుబాటు ఏమంటే.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు సంబంధించి ఇన్ని గంటలే పని చేయాలనే నియంత్రణ ఏమీ లేదు.
 
కెనడా:  పబ్లిక్ యూనివర్సిటీలు, కమ్యూనిటీ కాలేజీలు, ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్‌లో చేరిన విద్యార్థులు ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండానే తమ క్యాంపస్‌లలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. కోర్సులో చేరిన ఇన్‌స్టిట్యూట్ కోసం, ఆ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో ఏర్పాటైన ప్రైవేట్ బిజినెస్‌లో విదేశీ విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్ క్యాంపస్ వర్క్‌పర్మిట్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ విద్యార్థులు రెగ్యులర్ అకడెమిక్ సెషన్ సమయంలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. వేసవి, శీతాకాల సెలవులప్పుడు ఎన్నిగంటలైనా జాబ్ చేసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు