లంగ్స్‌లో ఏదో బయటిపదార్థం ఇరుక్కుంది...

2 Dec, 2019 02:35 IST|Sakshi

పల్మునాలజి కౌన్సెలింగ్స్‌

మా ఫ్రెండ్‌ కూతురికి తొమ్మిదేళ్లు. ఏడాది నుంచి తరచూ దగ్గు, నిమోనియాతో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాం. కొన్నాళ్లు మందులు వాడినా ఫలితం లేకపోయేసరికి సిటీలో పల్మునాలజిస్ట్‌కు చూపించాం. ఆయన పరీక్షలన్నీ చేసి, ఊపిరితిత్తుల్లో ఏదో బయటివస్తువు (ఫారిన్‌బాడీ) ఉన్నట్లు నిర్ధారణ చేశారు. చాలా ఆలస్యం జరిగినందువల్ల వీలైనంత త్వరగా బ్రాంకోస్కోపీ ద్వారా దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలనీ, కుదరకపోతే సర్జరీతోనే తొలగించాల్సి వస్తుందని తెలిపారు. దయచేసి బ్రాంకోస్కోపీ అంటే ఏమిటో వివరంగా తెలియజేయగలరు.
 
చాలా మందికి భోజనం చేస్తుండగా పొరబాటున శ్వాసనాళంలోకి లేదా ఊపిరితిత్తుల్లోకి ఆహారపదార్థాల వంటి ఫారిన్‌బాడీస్‌ చేరుతుంటాయి. చూడ్డానికి ఇది చిన్న సమస్యగా అనిపించినా, చివరకు ఆ పరిణామమే ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఎంతోమందికి జరుగుతుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తుంటారు.  ఆటల్లో భాగంగా పిన్నీసులు, బలపాల వంటి వాటిని మింగేస్తూ ఉంటారు. అవి కాస్తా శ్వాసనాళాల్లో ఇరుక్కుంటాయి. ఇవన్నీ అప్పటికప్పుడు తీవ్రమైన ఇబ్బంది కలిగించకపోయినా, దీర్ఘకాలంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు కనిపించే లక్షణాలు కూడా సాధారణ దగ్గును పోలి ఉండటంతో చికిత్స కూడా పక్కదారి పడుతుంటుంది. అయితే ఈ సమస్యను కచ్చితంగా కనిపెట్టగలిగే పరీక్ష ఒక్కటే. అదే బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ సహాయంతో ఊపిరితిత్తులకు గాలి చేరవేసే శ్వాసనాళాలను, అందులోని గాలి గొట్టాలను స్పష్టంగా పరీక్షించవచ్చు.

ఈ భాగాల్లో ఇరుక్కుపోయినా  ఆహారపదార్థాటలను లేదా ఇతర వస్తువులను కనిపెట్టి, వెంటనే బయటికి తీసుకువచ్చేందుకు సహాజం చేసే టూ ఇన్‌ వన్‌ ప్రక్రియ బ్రాంకోస్కోపీ. అంటే దీని వల్ల ఇటు పరీక్ష, అటు చికిత్స రెండూ జరుగుతాయన్నమాట. దీనితో చేసే ఈ చికిత్సను రిజిడ్‌  బ్రాంకోస్కోపిక్‌ ఫారిన్‌ బాడీ రిమూవల్‌ అంటారు. ఊపిరితిత్తుల్లో ఇలా ఇరుక్కునే వాటిలో ఆహారపదార్థాలకు సంబంధించి... పల్లీలు, కూరగాయలు, మాంసం ముక్కల వంటి ఆర్గానిక్స్‌ అనీ, లోహపు ముక్కలు, పిన్నీసులు, చెక్కముక్కలు, బలపాల వంటి వాటిని నాన్‌ ఆర్గానిక్‌ ఫారిన్‌బాడీస్‌ అని అంటారు. ఆర్గానిక్‌ రకమైన పదార్థాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. ఇవి సాధారణ వాతావరణంలోలాగే శ్వాసనాళాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా కుళ్లిపోతాయి. వాటి సైజు పెరుగుతుంది. వాటిన నుంచి రసాయనాలు విడుదలై కెమికల్‌ న్యుమొనైటిస్‌ అనే తీవ్రమైన సమస్య మొదలవుతుంది. అదే నాన్‌ ఆర్గానిక్‌ ఫారిన్‌బాడీస్‌ ఇలా కుళ్లిపోవు. కానీ చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ ఊపిరితిత్తుల్లో కొంతభాగానికి గాలి చేరక నిమోనియా సమస్య వస్తుంది.

అయితే వీటిని ఎక్స్‌రేలో కనిపెట్టవచ్చు. కానీ ఆర్గానిక్‌ పదార్థాలు ఎక్స్‌–రేలో కనిపించవు. కానీ ఆ పదార్థం పక్కనున్న ఊపిరితిత్తుల్లోని కొంతభాగం ఎక్స్‌రేలో నల్లగా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ భాగాన్ని బ్రాంకోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. బ్రాంకోస్కోపీ రెండు రకాలు. వయసు, ఇరుక్కున్న పదార్థం సైజులను బట్టి మత్తు ఇచ్చి లేదా మత్తు ఇవ్వకుండా చేస్తారు. మత్తు ఇచ్చి చేసేది రిజిడ్‌ బ్రాంకోస్కోపీ. మత్తు ఇవ్వకుండా చేసే ఎండోస్కోప్‌ పద్ధతిని ఫెక్సిబుల్‌ బ్రాంకోస్కోపిగా చెబుతారు.బ్రాంకోస్కోపీకి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. దగ్గు, నిమోనియా పదే పదే తిరగబెడుతున్నా లేదా మందులకు లొంగక ఇబ్బంది పెడుతున్నా ఆలస్యం చేకుండా వైద్యులను కలవాలి. క్యాన్సర్‌ గడ్డను సైతం ఈ ప్రక్రియతో తొలగించవచ్చు. మీ ఫ్రెండ్‌ కూతురి సమస్యకు ఇంటర్వెన్షనల్‌ పల్మునాలజీ చికిత్స ఎంతగానో సహాయపడుతుంది. చాలావరకు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. వీలైనంత త్వరగా బ్రాంకోస్కోపీ చికిత్స అందించండి. ఇది చాలా సురక్షితం. ఎలాంటి సైడ్‌ఎఫెక్టులు కూడా ఉండవు.
డా. వై. గోపీకృష్ణ, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మునాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్,

మరిన్ని వార్తలు