ఇదిగో ‘సిరి’ లోకం!

5 Feb, 2019 06:11 IST|Sakshi

ఆరోగ్యం కోసం ఆహారం.. ఆహారం కోసం వ్యవసాయం.. వ్యవసాయం కోసం అడవి! ఇదీ అటవీ వ్యవసాయానికి మూలసూత్రం. రైతు తమకున్న వ్యవసాయ భూమిలో విధిగా (కనీసం 20%) కొద్ది భాగాన్నయినా అటవీ జాతి చెట్ల పెంపకానికి కేటాయించాలని అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలి సూచిస్తున్నారు. పొలం అంతా ఒకే పంట వేయడం అనర్థదాయకం.. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలను ఒకే పొలంలో పక్కపక్కనే కలిపి సాగు చేయాలి.. జీవవైవిధ్యంతోనే సాగుకు జవజీవాలు చేకూరతాయని, చీడపీడల బెడద కూడా తగ్గిపోతుందన్నది సారాంశం. అటవీ కృషిపై డా. ఖాదర్‌ వలితో ఇటీవలి సంభాషణ నుంచి కొన్ని విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..

ప్రకృతిలో ఏ జీవీ, ఏ వ్యవస్థా ఒంటరిగా మన జాలదు, పరస్పరాధారితంగానే విరాజిల్లుతుంటాయి. ప్రకృతితో, అడవితో వ్యవసాయానికి అంతటి విడదాయరాని అనుబంధం ఉందని అంటారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్‌ ఖాదర్‌ వలి. ఇందుకోసం ‘అటవీ వ్యవసాయ’ (కాడు కృషి) పద్ధతికి ఆయన రూపకల్పన చేశారు. మైసూరుకు సమీపంలోని కిబిని డ్యాం దగ్గరలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో తాను అనుసరిస్తూ రైతులకూ శిక్షణ ఇస్తున్నారు (అటవీ వ్యవసాయంపై డా. ఖాదర్‌ వలి అభిప్రాయాలతో కూడిన కథనం ‘సిరిధాన్యాలే నిజమైన ఆహార పంటలు’ శీర్షికన 2017 సెప్టెంబర్‌ 19న, ‘మిక్సీ–సిరిధాన్యాల మిల్లు’ కథనం 2017 డిసెంబర్‌ 26న ‘సాగుబడి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే). మూడున్నర ఎకరాల్లో అడవిని పెంచుతూ, పక్కనే మిగతా భూమిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రం విశేషాలను పరిశీలిద్దాం.

వర్షపు నీటి సంరక్షణకు కందకాలు  
వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడానికి పొలంలో కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఇంకింపజేసుకోవడం తెలివైన పని. డా. ఖాదర్‌ వలి క్షేత్రం కొండ ప్రాంతం కావడంతో (30%) ఏటవాలుగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోవడంతోపాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవడం కోసం ప్రతి వంద మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వారు.  కందకాలలో 10 మీటర్లకు ఒక చోట కట్ట వేశారు. కందకంలో పండ్ల చెట్లు నాటారు. గట్ల మీద 400 మునగ చెట్లు వేశారు.

సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోకి పరిసర పొలాల నుంచి రసాయనిక అవశేషాలతో కూడిన వర్షపు నీరు రాకుండా చూసుకోవడం అవసరం. బయటి నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చే వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి సరిహద్దు చుట్టూ అడుగు లోతు, అడుగు వెడల్పున కందకం తవ్వారు. సరిహద్దులో అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. రసాయనిక అవశేషాలకు విరుగుడుగా ఆ గుంతల్లో ‘అటవీ చైతన్య ద్రావణం’ పోసి, వాన నీటిని భూమిలోకి ఇంకింపజేస్తారు. అక్కడి సాధారణ వార్షిక వర్షపాతం 800 ఎం.ఎం.–1000 ఎం.ఎం. మధ్య ఉంటుంది. తొలి పంట వర్షాధారంగానే సాగు చేస్తారు. భూమిలోకి ఇంకింపజేసిన నీటిలో మూడింట రెండొంతుల వరకు.. స్ప్రింక్లర్లతో రెండో పంటకు వాడుతున్నారు.

సిరిధాన్యాల సాగు ఎలా?
కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలను డా. ఖాదర్‌ వలి సిరిధాన్యాలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ముఖ్య ఆహారంగా తింటూ ఉంటే కొద్దికాలంలో జబ్బులను తగ్గించుకోవడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల వినియోగం బాగా పెరిగినందున రైతులు సైతం వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ సిరిధాన్యాల సాగుపై డా. ఖాదర్‌ వలి సూచనలేమిటో చూద్దాం.

మిశ్రమ సాగే మేలు
ప్రతి రైతు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో అడవిని పెంచాలి. మిగతా 80% భూమిలో పంటలు పండించుకోవాలి. సిరిధాన్యాలను ఏక పంట (మోనో క్రాప్‌)గా కాకుండా పప్పుధాన్యాలు (అపరాలు), నూనెగింజలతో కలిపి పండించడం ఉత్తమం. సాగుకు ఎంపిక చేసుకున్న పొలంలో 60% విస్తీర్ణంలో కొర్రలు లేదా సామలు లేదా అరికెలు లేదా అండుకొర్రలు లేదా ఊదలు, 30% విస్తీర్ణంలో కంది/ పెసర/ వేరుశనగ/ శనగ/ మినుము వంటి పప్పుధాన్యాలు, 10% విస్తీర్ణంలో నువ్వులు లేదా కుసుమలు లేదా వేరుశనగ వంటి నూనె నూనెగింజలు పక్కపక్కనే సాగు చేయాలి. పప్పుధాన్యం పంట పక్కన ఉన్న పంటలకు వాతావరణం నుంచి గ్రహించిన నత్రజనిని అందిస్తుంది. ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు విస్తీర్ణాన్ని ఒక గ్రిడ్‌గా భావించి మిశ్రమ పంటలను ఈ నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ప్రతి గ్రిడ్‌లో ఈ మూడు రకాల పంటలను పక్కపక్కనే ఉండాలన్న మాట. ఎంత విస్తారమైన పొలంలోనైనా అలాగే గ్రిడ్‌లుగా విభజించుకొని సాగు చేయాలి. అప్పుడు ప్రతి గ్రిడ్‌లోనూ అన్ని రకాల పంటలూ సాగవుతూ ఉంటాయి. గ్రిడ్‌లో గత పంట కాలంలో వేసిన చోట వచ్చే పంట కాలంలో ఇతర పంటలు వేసేలా పంటల మార్పిడి పాటించాలి.  ఉదా.. 20 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాల్లో అడవిని పెంచాలి. 16 ఎకరాల్లో రెండు ఎకరాలకో గ్రిడ్‌గా విభజించి పంటలు పండించాలి. కొన్ని గ్రిడ్‌లలో సిరిధాన్యాలు ప్రధాన పంటైతే, మరికొన్ని గ్రిడ్లలో కూరగాయలు కూడా ప్రధాన పంటలుగా వేసుకోవచ్చు.
 

టర్పిన్లతో చీడపీడలకు విరుగుడు
సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కలిపి సాగు చేయడం ద్వారా చీడపీడల నుంచి తమను తాము రక్షించుకునే శక్తి పంటలకు కలుగుతుంది. ఏ మొక్కలైనా ఆకుల ద్వారా వైవిధ్య భరితమైన వాసనలను గాలిలోకి వదులుతూ ఉంటాయి. ఈ వాసనలను టర్పిన్స్‌ అంటారు. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే వాసనలు మనుషుల ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. కొన్నిటిని గ్రహించలేవు. మనుషులు గ్రహించలేని వాసనలను కూడా పిల్లులు, కుక్కలు, పందులు, పక్షులు గ్రహించగలుగుతాయి. ఈ వాసనలు పంటలపై చీడపీడలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అండుకొర్ర మొక్కల వాసనలను గ్రహించడం ద్వారా వేరుశనగ మొక్కలు అంతర్గతంగా చీడపీడలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. అందువల్లనే, కనీసం 3 నుంచి 5 రకాల పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఒకే పంటను వేయడం సమస్యలను ఆహ్వానించడమేనని, పాశ్చాత్య ఆలోచనా ధోరణితో వస్తున్న సమస్య ఇదేనని డా. ఖాదర్‌ అన్నారు.

అండుకొర్రలు వర్సెస్‌ అడవి పందులు
అండుకొర్ర పంట మొక్కలు విడుదల చేసే వాసనలు (టర్పిన్లు) అడవి పందులకు సుతరాము గిట్టదు. పొలానికి చుట్టూతా 4 వరుసలుగా అండుకొర్రలను సాగు చేస్తే ఆ పొలం వైపు అడవి పందులు రాకుండా దూరంగా ఉంటాయి.

∙డా. ఖాదర్‌ పొలంలో మిశ్రమ పంటల సాగు

వరి, సిరిధాన్యాల సాగుకు కావాల్సిన నీరెంత?
సిరిధాన్యాలుగా మనం పిలుచుకుంటున్న కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలను నాలుగు వర్షాలు పడితే చాలు.. అంతగా సారం లేని మెట్ట భూముల్లో కూడా పండించుకోవచ్చు. వరి ధాన్యం, చెరకు వంటి పంటలు పండించడానికి సాగు నీరు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. కిలో వరి బియ్యం పండించానికి 9,000 లీటర్ల నీరు, కిలో సిరిధాన్యాల (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదల)ను సాగు చేయడానికి 300 లీటర్ల నీరు చాలు. అంటే, కిలో వరి బియ్యంతో ఐదుగురికి ఒకసారి భోజనం పెట్టవచ్చు. 30 కిలోల సిరిధాన్యాలతో 240 మందికి ఒకసారి భోజనం పెట్టవచ్చు (పట్టిక చూడండి). నీటి వనరులు నానాటికీ క్షీణిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ఆహార పంటలుగా సిరిధాన్యాలను సాగు చేసుకోవడమే అన్ని విధాలా ఉత్తమ మార్గమని మనందరం గ్రహించాలని డా. ఖాదర్‌ చెబుతున్నారు.

 

అటవీ చైతన్య ద్రావణంతో జవజీవాలు
నిస్సారమైన భూములను సైతం మూడు నెలల్లో సారవంతం చేయడానికి భూసార వర్థిని అయిన ‘అటవీ చైతన్య’ ద్రావణం ఉపయోగపడుతుందని డా. ఖాదర్‌ అంటున్నారు. ఇది ఎరువు కాదు. భూమిలో సూక్ష్మజీవ రాశిని ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే తోడు (మైక్రోబియల్‌ కల్చర్‌) మాత్రమే.

అటవీ చైతన్య ద్రావణం తయారు చేసే పద్ధతి: 20 లీటర్ల కుండలో 10 లీటర్ల నీరు పోసి, లీటరు అటవీ చైతన్యం కలిపి, పావు కిలో సిరిధాన్యాల పిండి, పావు కిలో పప్పుల పిండి, 50 గ్రాముల తాటి బెల్లం కలపాలి. దీన్ని రోజూ కలియదిప్పాలి. వారం రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. 21 రోజుల వరకు వాడుకోవచ్చు.

ఏమిటి ప్రయోజనం?
ఆమ్ల, క్షార గుణాలు సమసిపోయి భూమి సాధారణ స్థితికి చేరుకొని జవజీవాలను సంతరించుకోవడానికి అటవీ చైతన్య ద్రావణం దోహదం చేస్తుంది. లీటరు అటవీ చైతన్య ద్రావణానికి 20 లీటర్ల నీరు కలిపి నేలపై పిచికారీ చేయాలి. సాయంత్రం 5–6 గంటల మధ్య భూమిపై అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే మూడు–ఆరు నెలల్లో ఆ భూమి సాగుకు యోగ్యంగా జీవవంతం అవుతుందని డా. ఖాదర్‌ చెబుతారు. మొదటి నెలలో.. వారానికి 2 సార్లు, రెండో నెలలో.. వారానికోసారి, మూడో నెలలో.. 10 రోజులకోసారి, నాలుగో నెల నుంచి 15 రోజులకోసారి అటవీ చైతన్య ద్రావణం పిచికారీ చేస్తూ ఉంటే భూసారం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తాం కాబట్టి ఉదయం కల్లా నేల పీల్చుకొని నేల జవజీవాలను పొందుతుంది. ఆచ్ఛాదన వేయాల్సిన అవసరం లేదు. ఎండలు మండిపోయే మే నెలలో తప్ప ఏడాది పొడవునా దీన్ని పిచికారీ చేసుకోవచ్చని డా. ఖాదర్‌ తెలిపారు.

అటవీ ప్రసాదం
అటవి వ్యవసాయానికి మూలాధారమని డా. ఖాదర్‌ వలి చెబుతున్నారు. అందుకే పొలంలో 20% శాతంలో అటవీ జాతి చెట్లను పెంచాలని, ఆ చెట్లు రాల్చే ఆకులను పోగు చేసి, వేసవిలో పొలంలో చల్లి, ఆ ఆకులపై ‘అటవీ చైతన్య’ ద్రావణం పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. భూమి లోతుల నుంచి పోషకాలను గ్రహించే చెట్లు రాల్చిన ఆకులే ‘అటవీ ప్రసాదం’ వంటివని, భూమికి పోషకాహారమని అంటారు.

అటవీ సహితం
చీడపీడల బెడద నుంచి పంటల రక్షణకు ‘అటవీ సహితం’ ద్రావణాన్ని డా. ఖాదర్‌ వలి వాడుతున్నారు. వివిధ రకాల ఔ«షధ మొక్కల ఆకులతో దీన్ని తయారు చేస్తారు. పాలు కారే మొక్కల ఆకులు 2 రకాలు (జిల్లేడు, మర్రి, పలవర బొప్పాయి వంటివి), 2 చేదు రకాలు (వేప, కానుగ వంటివి), ఆకర్షణీయంగా ఉండే చెట్ల పూలు, ఆకులు (మందార, తంగేడు వంటివి) ఇవన్నీ 6 కేజీలు తీసుకొని.. దంచాలి. దీన్ని కుండలో వేసి లీటరు దేశీ ఆవు మూత్రం, 10 లీటర్ల నీరు కలిపి.. వారం మురగబెట్టాలి. తర్వాత వడకట్టుకొని లీటరుకు 20 లీటర్ల నీరు కలిపి పంటలపై పిచికారీ చేయాలి.  


అటవీ చైతన్య ద్రావణం


ఔషధ మొక్కలు

ఒకే పంట సాగు చేయడం మూర్ఖత్వం!
పొలం అంతా ఒకే రకం పంటను పండించడం మూర్ఖత్వం. మోనోకల్చర్‌ నుంచి బయటకు రావాలి. మిశ్రమ పంటలు సాగు చేయాలి. అటవీ కృషి పద్ధతుల్లో 30 రకాల పంటలు పండించమని సూచిస్తున్నాం. కనీసం 5 రకాలైనా పొలంలో పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. సిరిధాన్య పంటలకు కూడా కొన్ని చోట్ల కత్తెర పురుగు సోకడానికి కారణం ఒకే పంటను సాగు చేయడమే. పొలంలోని విస్తీర్ణంలో 60% ఏక దళ పంటలు, 30% పప్పుధాన్యాలు, 10% నూనె గింజల పంటలు సాగు చేయాలి. సిరిధాన్య పంటలు, నువ్వులు, గోంగూర, వేరుశనగ వంటి పంటలను కలిపి పండించాలి. కత్తెర పురుగు నివారణకు సీతాఫలం ఆకులు, గింజల ద్రావణం చక్కగా పనిచేస్తుంది. ఒకే పంట పండిస్తూ ఉంటే ఒక పురుగు పోయినా మరొకటి వస్తుంది. మిశ్రమ పంటలే శ్రేయస్కరం.


– డాక్టర్‌ ఖాదర్‌ వలి, అటవీ కృషి నిపుణులు

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా