క్లింటన్స్‌ ఫుడ్‌!

12 Apr, 2017 23:08 IST|Sakshi
క్లింటన్స్‌ ఫుడ్‌!

వేగన్‌ డైట్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ చిన్న కుర్రాడిలా అనిపిస్తుంటాడు. ఇటీవల తన ఆరోగ్య రహస్యం గుట్టు విప్పారాయన. డీన్‌ ఆర్నిష్,  కాల్డ్‌వెల్‌ ఎస్సెల్‌స్టిన్‌.. వీళ్లు క్లింటన్‌ ఆహార సలహాదార్లు. బిల్‌ క్లింటన్‌ను ఒక విలేకరి ప్రశ్నిస్తూ ‘మీరు శాకాహారా?’ అని అడిగారు. దానికి బదులిస్తూ క్లింటన్‌ అన్న మాటలు ఆసక్తికరం. ‘శాకాహారం పేరిట కొందరు బటర్, చీజ్‌ వంటివి తీసుకుంటూ ఉంటారు. నేను ఆ పాల ఉత్పాదనలూ తీసుకోను. మాంసం ఎలాగూ తినను. ఇక చేపలు సైతం తినడం లేదు. నా ఆహారంలో నూనె దాదాపు లేనట్టే లెక్క. ఇలా పాల ఉత్పాదనలూ తీసుకోనంతగా శాకాహార నియమాలు పాటిస్తున్నాను. ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా నన్ను నేను బాధపెట్టుకుంటున్నానని కూడా అనుకోవడం లేదు. అయితే గతంలో కంటే ఇప్పుడు మరింత ఆరోగ్యంగా ఉన్నాను, అంతేకాదు... అప్పటి కంటే నాలో ఇప్పుడే ఎక్కువ శక్తి ఉన్నట్లుగా అనిపిస్తోంది’ అంటారు క్లింటన్‌.

గతంలో బిల్‌ క్లింటన్‌ ఫాస్ట్‌ఫుడ్‌నూ, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారు. 2004లో ఆయనకు హార్ట్‌ బైపాస్‌ అయ్యింది. ఆర్నెల్ల తర్వాత మళ్లీ మరో ప్రొసీజర్‌ కూడా అవసరమైంది. 2010లో తన బైపాస్‌ విఫలమైందని తెలుసుకున్నారు క్లింటన్‌. అప్పుడు ఆయన డాక్టర్‌ ఎసెల్‌స్టిన్‌ పుస్తకమైన ‘ప్రివెంట్‌ అండ్‌ రివర్స్‌ హార్ట్‌ డిసీజ్‌’ అనే పుస్తకంపై ఆధారపడ్డారు. డాక్టర్‌ ఎసెల్‌స్టిన్‌ సూచించిన ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు10 కిలోగ్రాములు బరువు తగ్గారు. ఇప్పుడు ఆయన తాను ఆహారం కోసం కేవలం మొక్కల నుంచి ఉత్పాదనలపై ఆధారపడుతున్న తీరుతెన్నులను సీఎన్‌ఎన్‌ ప్రతినిధి వూల్ఫ్‌ బ్లిట్జెర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను తీసుకునే ఆహారాన్ని ప్లాంట్‌ బేస్‌డ్‌ డైట్‌గా పేర్కొన్నారు బిల్‌ క్లింటన్‌. ఈ తరహా శుద్ధ శాకాహారాన్ని వేగన్‌ డైట్‌ అంటారు.

ఇతరులకూ అంతే ఆరోగ్యం
అమెరికాలోని క్లీ్లవ్‌ల్యాండ్‌ క్లినిక్‌లో దాదాపు 35 ఏళ్లకు పైగా సర్జన్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు కాల్డెవెల్‌ ఎస్సెల్‌స్టిన్‌. తాను సూచించిన ఆహారం తీసుకుంటే  అసలు గుండెజబ్బులే రావంటున్నారు కాల్డ్‌వెల్‌ ఎస్సెల్‌స్టిన్‌. దీనికి ఉదాహరణగా షరోన్‌ కింట్జ్‌ కేస్‌ను ఉటంకిస్తారు. అమెరికాలోని గుండెజబ్బు రోగుల్లో ఆమె ఒకరు.  ఆమెకు గుండెజబ్బు వచ్చింది. హార్ట్‌ వెస్సెల్స్‌ బ్లాక్‌ అయ్యాయి. గుండె ఆపరేషన్‌ చేయించకపోతే ఆర్నెల్లలో ఏదైనా అనర్థం జరగవచ్చు. ఆమె చనిపోవచ్చు కూడా.

అయితే ఆమె ఆపరేషన్‌ వద్దన్నారు. కేవలం ఎస్సెల్‌స్టిన్‌ పేర్కొన్న ఆహారం మాత్రమే తీసుకుంటూ గుండెజబ్బులకు ఆహారాన్నే మందుగా ఉపయోగించాలని నిర్ణయించారు. తన ఆహారంలో మాంసాహారం మాత్రమే కాదు... చీజ్, బట్టర్‌ కూడా మానేశారు. అధిక కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడామె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. బరువు తగ్గారు. గుండెజబ్బు తాలూకు లక్షణాలేమీ లేవు సరికదా అది ఉన్న దాఖలా కూడా కనిపించనంత హాయిగా ఉన్నానంటారామె.

ఎస్సెల్‌స్టీన్‌ పేర్కొన్న తీసుకోకూడని ఆహారాలివే...
మాంసం, పౌల్ట్రీ ఉత్పాదనలు, చేపలు, గుడ్లు. ∙పాల ఉత్పాదనలైన బటర్, చీజ్, క్రీమ్, ఐస్‌ క్రీమ్, పెరుగు, పాలు, స్కిమ్డ్‌ పాలు.

నూనెలు : అన్ని రకాల నూనెలతో పాటు ఆరోగ్యకరమని భావించే ఆలివ్, కనోలా నూనెలు కూడా. ∙రిఫైన్డ్‌ ధాన్యాలు : వరి, పాస్తా, బ్రెడ్, బేక్‌డ్‌ ఫుడ్‌. ∙నట్స్‌ : వాల్‌నట్స్‌ మినహా అన్ని రకాల నట్స్‌

తీసుకోవాల్సిన ఆహారాలు :
ఆకుకూరలు : అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవచ్చంటారు. ∙లెగ్యూమ్స్‌: బీన్స్‌ వంటి అన్నిరకాల కాయ ధాన్యాలు.

→పొట్టు తీయని అన్ని రకాల ధాన్యాలు తీసుకోవచ్చని పేర్కొంటారు. అయితే ఒకవేళ బ్రెడ్‌ తీసుకునేవారు కేవలం పొట్టు తీయని ధాన్యం నుంచి తయారైన బ్రెడ్‌ను మాత్రమే తీసుకోవాలంటారు.

→పండ్లు అన్ని రకాల పండ్లనూ తీసుకోవచ్చని చెబుతారు. ఒకవేళ పండ్ల రసం తీసుకుంటే తాజాపండ్లరసాన్ని మాత్రమే తీసుకోవాలని, అందులో చక్కెర మాత్రం వేసుకోకూడదని చెబుతారు.

ద్రవాహారాలు: నీళ్లు, ఓట్‌మిల్స్, నో–ఫ్యాట్‌ సోయా మిల్క్‌ తీసుకోవచ్చు. కాఫీ, టీ చాలా పరిమితంగా తీసుకోవచ్చు.
ఇలా ఆహారాన్నే ఒక ఔషధంగా ఉపయోగిస్తే గుండెజబ్బులే దరిచేరవంటారు కాల్డ్‌వెల్‌ ఎస్సెల్‌స్టిన్‌.

మరిన్ని వార్తలు