మోసగాళ్లకు మోసగాడు - ఒక జ్ఞాపకం

28 Aug, 2016 23:48 IST|Sakshi
మోసగాళ్లకు మోసగాడు - ఒక జ్ఞాపకం

హ్యూమర్ ఫ్లస్
 
మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చి 45 ఏళ్లయింది. కాలం ఒక పెద్ద మోసగత్తె. అది మనల్ని మాయచేసి అన్నీ లాగేస్తుంది. ముఖ్యంగా మన పసితనాన్ని. ఆ సినిమా చూసినపుడు నా వయసు ఏడేళ్లు. ఇంట్లో తెలియకుండా దొంగగా చూసిన మొదటి సినిమా అది. నా కంటే పెద్దవాళ్ల గ్రూప్ (వాళ్ల వయసు 13) రహస్యంగా ప్లాన్ చేసి మ్యాట్నీకి వెళ్లాలనుకుంది. ప్లాన్ నాకు లీకయ్యింది. నన్ను తీసుకెళ్లకపోతే అందరిళ్లలో చెప్పేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాను. చచ్చినట్టు తీసుకెళ్లారు.

రాయదుర్గంలో కె.బి. ప్యాలెస్ అనే థియేటర్ వుండేది. (ఇంకా వుంది) బాక్సులు తుప్పుపట్టి, రీళ్లు అనేకసార్లు కటింగైన తరవాత ఈ థియేటర్‌కి సినిమాలు వచ్చేవి. కొత్త సినిమా వచ్చిన రోజు ఒంటెద్దు బండిపై బ్యాండ్ మేళంతో వూరేగించేవారు. మోసగాళ్లకు మోసగాడు ఊరేగింపు చూసి ఆవేశపడి మా సీనియర్స్ థియేటర్‌కి చేరుకున్నారు. వాళ్ల వెంట నేను కూడా పరుగులు తీశాను. బుకింగ్ దగ్గర జనం ఒకరిమీద ఇంకొకరు ఎక్కి తొక్కుకుంటున్నారు. నేల క్లాస్‌కి లిమిట్ ఉండేది కాదు. ఎంతమందినైనా లోనికి తోసేసేవాళ్లు. లోపలున్నవాళ్లు ఒకరిలో ఒకరు ఇరుక్కుని, ఇక స్థలం లేక కుయ్యోమని సోడా కొట్టినట్టు అరిచేవాళ్లు. హాహాకారాలు వినిపించిన తరువాత టికెట్లు ఆపేవాళ్లు. మా దొంగల బ్యాచ్‌కి టికెట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియకపోతే ఒక బ్లాక్ మార్కెట్‌వాడు వచ్చాడు. నలభై పైసల టికెట్‌ని నలభై ఐదు పైసలకి అమ్మాడు. ఐదు పైసలకి బ్లాక్ టికెట్లు అమ్మే అమాయకుల్ని చూడ్డం అదే మొదలు, ఆఖరు కూడా.
 గర్వంగా థియేటర్‌లోనికెళితే బీడీల కంపు, చీకటి. న్యూస్‌రీల్ వేస్తున్నారు. నెహ్రూ ప్రధానిగా వున్నప్పటి న్యూస్‌ని, ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు చూపించేవాళ్లు. ఆరోజుల్లో వార్తలు అంత వేగంగా అందించేవాళ్లు. ఒకరి చెయ్యి ఇంకొకరు పట్టుకుని తడుముకుంటూ అనేకమంది కాళ్లు తొక్కుతూ మనుషుల భుజాలపై వెళ్లాం. నేను వెళ్లి ఎవడి ఒళ్లోనో కూచున్నాను.

కుక్క చెవుల్లాగా సాగిపోయిన పాత రీళ్లు కాబట్టి, కాసేపు సరళరేఖలు వక్రరేఖలు తెరపై కనిపించి సినిమా మొదలైంది. కృష్ణ గుర్రంపై రాగానే కేకలు, ఈలలు. బుకింగ్ క్లర్క్ రెండు చేతులతో ఇంకా టికెట్లు ఇస్తున్నందువల్ల నల్లటి పరదా తొలగించుకుని గుంపులు గుంపులుగా జనం వస్తూ ఎవడో ఒకడి మీద కూచుంటున్నారు. కొంతమంది స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూడా కూచున్నారు. ప్రతి నటుడు ఆకాశమంత ఎత్తు కనిపిస్తాడు వాళ్లకి.

కృష్ణ వచ్చి గన్‌ని లోడ్ కూడా చేయకుండా వరసపెట్టి కాలుస్తూ వుంటే ఆనందంతో అక్కడికక్కడే అభిమానయ్యాను. ఆ తరువాత అన్ని సినిమాల్లో కృష్ణ ఒకేరకంగా నటిస్తాడని తెలుసుకుని వీరాభిమానినయ్యాను. అప్పట్లో ఇంటర్వెల్ లేదు. ఎన్నిసార్లు సినిమా కట్ అయితే అన్ని ఇంటర్వెళ్లు. రష్ ఎక్కువుంటే సోడాలు, మురుకులు అయ్యేవాళ్లకి పండగ. ఆ జనంలో సుడిగాలి పర్యటన చేసేవాళ్లు. సోడాలు కుయ్యిమని మోగేవి. మురుకులు రాళ్లకంటే గట్టిగా వుండేవి. థియేటరంతా కటకటమని సౌండొచ్చేది.

కృష్ణని చూసిన ఆనందంతో గుర్రంలాగా పరిగెత్తుతూ ఇంటికెళ్లాను. గాడిదని కొట్టినట్టు కొట్టారు. అందరి ఇళ్లలోనూ బడితపూజ జరిగిందని తెలిసింది.  మోసగాళ్లకు మోసగాడిని తరువాత నేను చాలాసార్లు చూశాను. ఇది అనేక ఇంగ్లిష్ సినిమాలకి అనుకరణ అని తెలిసిన తరువాత కూడా చూశాను. ఇంకా బాగా నచ్చింది. నిజంగా హాలివుడ్ స్థాయిలోనే వుంటుందిది.  సినిమాలో ఆడిపాడి డ్యాన్స్ చేసిన జ్యోతిలక్ష్మి ఈమధ్యే పోయింది. నాగభూషణం ఎపుడో పోయాడు. గుమ్మడి, త్యాగరాజు, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి ఇంకా చాలామంది జీవించిలేరు. కానీ వాళ్ల పాత్రలు ఎప్పటికీ బతికే వుంటాయి. అతి తెలివితో ప్రవర్తించేవాళ్లని చూసినపుడు నాగభూషణం గుర్తుకొస్తాడు. తాగుబోతు వాగుడు వాగే సాక్షి రంగారావు ప్రతి వైన్‌షాపు దగ్గర కనిపిస్తాడు. ఇండియన్ కౌబాయ్ కృష్ణకి ఈరోజు 70 ఏళ్లు దాటొచ్చు. కానీ మాలాంటి అభిమానుల గుండెల్లో ఆయనెప్పుడూ జేమ్స్‌బాండే!
 - జి.ఆర్. మహర్షి
 
 

>
మరిన్ని వార్తలు