నిరుపేదల కోసం ఉచిత న్యాయసలహా

6 Jan, 2015 23:42 IST|Sakshi
నిరుపేదల కోసం ఉచిత న్యాయసలహా

భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డా, అత్తగారింటి లో వేధింపులు ఎదురవుతున్నా, తన కాపురాన్ని, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధారణంగా భార్యే ఎలాగోలా సర్దుకుపోవాలని చూస్తుంది. అయితే ఆ వివాదాలు చినికి చినికి గాలివానగా మారినప్పుడు, భర్త లేదా అత్తమామల నుంచి వేధింపులు అంతకంతకూ పెరిగిపోతూన్నప్పుడు న్యాయసలహా కావాలనుకుంటుంది. అయితే కోర్టుకు వెళ్లడం సాధారణ గృహిణికి అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. లాయర్ ఫీజే బోలెడంత. ఇతరత్రాఖర్చులు ఎలానూ తప్పవు. వాటిని భరించే స్తోమత లేక తనలో తాను కుమిలి పోతూ, నిర్వేదానికి, నిస్పృహకు లోనవుతుంది. ఇలాంటి వారి ఇబ్బందులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత న్యాయసలహాను అందించేందుకు న్యాయసలహా సదన్‌లను ఏర్పాటు చేశాయి. ఒక్క మహిళలే కాదు... వికలాంగులు, ఎస్.సి, ఎస్.సీలు, నిరుపేదలు (లక్షరూపాయల వార్షిక ఆదాయానికి మించని వారు) తమ సమస్యలను లీగల్ సర్వీస్ అథారిటీకి తెలిపి, వారి నుంచి ఉచిత సలహా పొందవచ్చు.

ఇంతకూ సమస్యలను తెలిపేదెలాగంటారా... మీ సమస్యను రాతపూర్వకంగా/ఫోన్ ద్వారా/ నేరుగా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శికి తెలియజేయవచ్చు. దీనికి అడ్వకేట్‌తో అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 207 లీగల్ సర్వీస్ అథారిటీలు పని చేస్తున్నాయి. సామాన్యులు ఈ సేవలను ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సహకారంతో వినియోగదారుల సంక్షేమ సంఘం పని చేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోని న్యాయ సలహా కేంద్రాలు పని చేస్తాయి.
 రాష్ర్టస్థాయి న్యాయసలహా కేంద్రం ఫోన్ నంబర్లు...
 రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి: 04023446700
 హైకోర్టు న్యాయసేవాధికార సంఘ కార్యదర్శి: 04023446704
 రాష్ర్ట న్యాయసేవాధికార సంస్థ పాలనాధికారి: 04023446703.
 పై నంబర్లను సంప్రదించడం ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.
 అయితే ఉచితం కదా అని ప్రతి చిన్న విషయానికీ  పదే పదే ఫోన్ చేసి అధికారుల సహనాన్ని పరీక్షించటం మాత్రం భావ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
 
 

మరిన్ని వార్తలు