అర్ధరాత్రి స్వేచ్ఛా గీతం...

13 Aug, 2015 23:11 IST|Sakshi
అర్ధరాత్రి స్వేచ్ఛా గీతం...

ఈవెంట్
 
పట్టపగలు రోడ్డు మీదకు వెళితేనే జీవితాన్ని చీకటిపాలు చేసేందుకు కాచుక్కూచున్న మృగాలెన్నో ఉన్న పరిస్థితిలో ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించగలిగితేనే స్వాతంత్య్రం వచ్చినట్టన్న మహాత్ముడి మాటలు నిజమయేది ఎప్పుడు? ‘‘ఆఫీస్ టైమింగ్స్ మరీ అర్ధరాత్రి దాకా అట. ఎలా వస్తావో ఆ సమయంలో ఒక్కదానివే...’’ ‘‘పర్లేదమ్మా ఏంకాదులే. ఆఫీస్ క్యాబ్ ఉంటుంది’’ ‘‘ఏమో... ఆ టివీలో రోజూ వార్తలు చూస్తుంటే భయమేస్తోంది. శుభ్రంగా పొద్దుటి పూట ఉద్యోగం చూసుకో అంటే వినవు’’ కూతురెంత ధైర్యం చెబుతున్నా... కన్నపేగు వణుకుతూనే ఉంది...

  ఇల్లు చేరేవరకూ క్షణమొకయుగం. ఎటువైపు నుంచి ఏ మృగం మీద పడుతుందో తెలీదు... రాత్రిపూట  రోడ్డెక్కితే నలుగురూ ఉన్నారా లేరా అని  కళ్లు వెతుకుతాయి. నిశ్శబ్దం, నిశీధిని చూస్తే కాళ్లు వణుకుతాయి. ఎందుకీ దుస్థితి? ఎప్పుడు మారుతుందీ పరిస్థితి?
 ‘‘అర్ధరాత్రి సమయంలో కూడా ధైర్యంగా సంచరించగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆడవారికి ఇవ్వాలి’’ అంటున్నారు ఫ్రీడమ్ వాక్ పేరుతో ఇండిపెండెన్స్ వచ్చిన అర్ధరాత్రి వేళ వెలుగు నడకకు శ్రీకారం చుట్టనున్న ఈవెంట్ నిర్వాహకులు ఆర్య. వియ్ సపోర్ట్ షి పేరుతో  కార్పొరేట్ మహిళలకు, పోలీసులకు మధ్య వారధిగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని వేల లాంతర్లను నిశీధిలోకి పంపి ఆ వెలుగులో నిర్భీతిగా నడిచే ‘ఫ్రీడమ్‌వాక్’ నమూనాను ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమంలో 3వేల మందికిపైగా మహిళలు పాల్గొననున్నారంటున్నారు. ఆర్య అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగే హక్కు తమకుందని తెలియజెప్పడమే వీరి ఉద్దేశమని వివరించారు. తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా ఏ మహిళైనా సాయం పొందవచ్చునని ఆర్య చెప్పారు.

తమ సేవలు రోజంతా అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే 1800 మంది వాలంటీర్లుగా నమోదు చేసుకున్నార ంటున్న మహతి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు విక్కీ గోకవరపు, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ తరపున ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు కూడా పాల్గొంటారన్నారు.

ఈవెంట్: ఫ్రీడమ్ వాక్; సమయం: ఆగస్టు 14 (తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం) రాత్రి 12గంటల తర్వాత
 వేదిక: హైటెక్ సిటీ చౌరాస్తా నుంచి హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ వరకూ... (3 కిలోమీటర్లు), హైదరాబాద్
 - ఎస్.సత్యబాబు
 
 

మరిన్ని వార్తలు