స్వేచ్ఛాడే

29 May, 2016 23:12 IST|Sakshi
స్వేచ్ఛాడే

శోభాడేని స్వేచ్ఛాడే అనడానికి రెండు కారణాలు. ఒకటి: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నెలల్లో ఆమె జన్మించారు. రెండు: రచయిత్రి, కాలమిస్టు కనుక ఆమె ఊహల్లో కావలసినంత స్వేచ్ఛ. అయితే ఈ రెండూ పైపై కారణాలు మాత్రమే. లోతైన కారణం ఏమిటంటే... స్వేచ్ఛ ఆమె జీవన విధానం. ఇంట్లో, బయటి ఇరుకులో ఆమె ఎప్పుడూ ఫిట్ కాలేదు. ఒళ్లు విరుచుకున్నట్లుగా... ఆలోచనలు పరుచుకోడానికి స్పేస్ ఉన్నచోటే ఆమె కుదురుగా ఉన్నారు. శోభాడేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాకుమారి కేట్ మిడిల్టన్ ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు.. ‘చీర కట్టుకోడానికి తగిన ఒంపులు ఆ పిల్లకు లేవు’ అని శోభాడే బహిరంగంగా అనడం భారతీయులందరినీ నివ్వెరపరిచింది. నిజానికి శోభాడే మాట్లాడింది కేట్‌కి లేని వాటి గురించి కాదు. చీరకు ఉండవలసిన వాటి గురించి! శోభ.. చీరల డిజైనింగ్‌లో కూడాస్పెషలిస్టు మరి. తనకు తెలిసిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేని స్వేచ్ఛాప్రియత్వమే ఈ డెబ్బై ఏళ్ల సౌందర్యరాశి వ్యక్తిత్వాన్ని నిత్యం శోభాయమానం చేస్తోంది. 

 

సోఫిస్టికేటెడ్, స్లెండర్, స్మార్ట్, షార్ప్, ష్రూడ్!
ఇవన్నీ ‘ఎస్’తో మొదలయ్యే మాటలు. శోభాడేని నిర్వచించే మాటలు కూడా! శోభాడే పేరూ ‘ఎస్’తోనే మొదలౌతుంది. ఆమె రాసిన పుస్తకాల్లో దాదాపుగా అన్నీ ‘ఎస్’తో స్టార్ట్ అయినవే.. సిస్టర్స్, స్టారీ నైట్స్, సల్ట్రీ డేస్, సెకండ్ థాట్స్, సెలెక్టివ్ మెమరీ, సర్వైవింగ్ మెన్.. ఇలా. శోభాడే నవనాగరికురాలు (సోఫిస్టికేటెడ్). ఆమెవి నాజూకైన భావాలు (స్లెండర్). వివేకవంతురాలు (స్మార్ట్). చురుకైన మనిషి (షార్ప్). నేర్పరి (ష్రూడ్).

 
ఏంటీ ‘ఎస్’? సెంటిమెంటా? ‘ఎస్’లో ఏదైనా పవర్ ఉందా? శోభాడేని చాలామంది అడిగారు. పవర్ ‘ఎస్’లో లేదు. ‘నో’లో ఉంది. ‘నో’ చెప్పడంలో ఉంది.. అన్నట్లు నవ్వేస్తారు శోభాడే. జీవితంలో ప్రతి విషయాన్నీ ఆమె తేలిగ్గానే తీసుకున్నారు. విత్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఏదైనా.. తొలగించుకోవడంలో లేదు.. తగిలించుకోవడంలో ఉంది అని నమ్ముతారు శోభ!

 

తలచినదే జరగాలి!
సంప్రదాయం కుటుంబంలో సంకెళ్లు తెంచుకోలేనివిగా ఉంటాయి. అసలు తెంచుకోవాలన్న ఊహే రానివ్వని విధంగా ఉంటాయి. మహారాష్ట్ర సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని ఈ ఆడపిల్ల ఊహనూ రానిచ్చింది, వాటిని తెంపుకునీ బయటికి రానూ వచ్చింది! సాధారణంగా.. వద్దన్న పని చెయ్యొద్దు అన్నప్పుడు పెద్దవాళ్ల భ్రుకుటి ముడివడుతుంది. కానీ.. చెయ్యాలనుకున్న పనిని చెయ్యొద్దు అన్నప్పుడు శోభాడే భ్రుకుటి ముడివేస్తుంది! ఆమె జీవితమంతా ఇదే ధోరణి.

 

నాన్న చెప్పినా వినలేదు
శోభాడే సెయింట్ జేవియర్స్ కాలేజీ స్టూడెంట్. అంతవరకు బాగుంది. మోడలింగ్ చేస్తానంటే మాత్రం తండ్రి ఒప్పుకోలేదు. ‘మా అమ్మాయి న్యాయ మంత్రిత్వశాఖలో ప్రభుత్వ కార్యదర్శి లేదా పెద్ద అధికారి’ అని చెప్పుకోవడం ఆయనకు గర్వం. అప్పటికే ఆయన రెండు మూడు గర్వాలను తలపై కిరీటంలా ధరించి ఉన్నారు. కొడుకు ఇంజినీర్. ఒక కూతురు ఆఫ్తాల్మిక్ సర్జన్. ఇంకో కూతురు ‘లా’ గ్రాడ్యుయేట్. వీళ్లందరి వరుసలోనే చిన్న కూతురు శోభను ఐ.ఎ.ఎస్.కు పంపించాలనుకున్నారు. కానీ శోభ పెదవి విరిచింది. ఊహు.. ఈ మాటను ఇలా చెప్పకూడదు. తండ్రి ముందు పెదవి విరిచేంత ధైర్యం చేసింది!

 

‘వావ్’ అంటూ వచ్చి అడిగారు
శోభ శరీర నిర్మాణం పెళుసుగా ఉంటుంది. ఈ మాట సరిగా అర్థం కాకపోతే ‘నాజూకు’గా అనుకోవచ్చు. మోడలింగ్ చూపు ఇలాగే ఉంటుంది. ఇక ఆ దృఢమైన దవడ కండరాలు, ఆమె ఆత్మవిశ్వాసం కూడా మోడలింగ్‌కు అవసరమైన సౌందర్య సాధనాలే. అయితే శోభకు తనలో ఇంతుందని తెలీదు!


తండ్రీకూతుళ్లు ఓ రోజు తాజ్ లాంజ్‌లో కూర్చొని ఉన్నారు. ఏ అతిథి కోసమో ఎదురుచూస్తున్నారు. అటుగా వెళుతున్న వారెవరో శోభను చూశారు! ‘వావ్’ అనుకున్నారు. అలా చాలామంది శోభను చూసి వావ్ అనుకోవడం మామూలే కానీ, ఇక్కడ వావ్ అనుకున్నది, వీళ్ల దగ్గరికొచ్చి శోభను పరిచయం చేసుకున్నది మోడలింగ్ ఫీల్డ్ వాళ్లు. ఆ తర్వాత శోభ ఖటావ్ శారీస్, తాజ్ టీ, పాండ్స్, బాంబే డయింగ్.. అన్నీ టాప్ బ్రాండ్స్.. వాటికి మోడల్ అయ్యారు. ఆరేళ్లు తన 22 వ యేట వరకు శోభ మోడలింగ్‌కి శోభ తెచ్చారు. మరి బాలీవుడ్ శోభకు ఎట్రాక్ట్ కాలేదా? అయింది. కానీ శోభే బాలీవుడ్‌కి ఎట్రాక్ట్ కాలేదు! ఏంటీ అమ్మాయి? ఏం లేదు. మృదుభాషి. ఆమె ఆలోచనలు మాత్రమే నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి. వాటి ధ్వని అక్షరాల్లో వినిపిస్తుంది. అంతే తప్ప అస్తమానం మానవలోకంలో తిరుగాడుతుండే స్త్రీ కాదు శోభాడే. సత్యజిత్‌రాయ్, ఇంకా ఒకరిద్దరు బెంగాలీ దర్శకులు.. సినిమాల్లోకి వస్తారా అని శోభను అడిగారు. శోభ రాలేననలేదు. చేయలేనన్నారు.

 

క్రీడలు.. క్రియేటివిటీ
శోభ అథ్లెట్ కూడా అని చెబితే సడెన్‌గా ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయినట్లు ఉంటుంది. శోభ కూడా ఇలాగే ఆటల్నుంచి డైవర్ట్ అయ్యారు. చదువుకునే రోజుల్లో ఆమె రాష్ట్ర స్థాయి అథ్లెట్. ఇక బాస్కెట్ బాల్‌లో అయితే ఆమె రికార్డ్ హోల్డర్.  కానీ అటువైపే వెళ్లలేదు. మోడలింగ్ చేస్తూనే మాస్ కమ్యూనికేషన్స్‌లోకి వచ్చేశారు. భవాన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ‘క్రియేటివ్ యూనిట్’లో కాపీ రైటర్‌గా చేశారు. అదొక యాడ్ ఏజెన్సీ. స్టార్‌డస్ట్, సొసైటీ, సెలబ్రిటీ పత్రికలకు ఎడిటర్‌గా చేయడం శోభ జర్నలిజం కెరీర్‌లోని శిఖరాగ్ర దశ. మూడూ ఒకే దేహంలా ఉండే ఈ పత్రికలకు మూడు వేర్వేరు ఆత్మలను ఇచ్చి, కొత్త తరం జర్నలిస్టులను తయారు చేశారు శోభా డే.

 

రాయలేదు! చెక్కారు!!
మరి ఇన్నిన్ని పుస్తకాలు ఎలా రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? మొదటిది: తపన. అది ఆమెను నిలవనివ్వలేదు. అందుకు రాశారు. రెండోది: తపన. దానికి టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాశారు. మూడోది: తపన. దాని పని అది చేసుకుపోయింది. పుస్తకాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చేశాయి. జీవితంలోని ప్రతిక్షణం ఆమెకొక ప్రేరణ. ‘సోషలైట్ ఈవినింగ్స్’ లో శోభాడే ముంబై మహా నగరపు సంపన్న జీవితాల్లోని ఏకాంతపు విషాదాన్ని, విఫల వివాహాలను, పరస్పర్శలోని ఓదార్పును కోరుకునే దేహాలను, ఆత్మలను... శిల్పాల నీడల్లా చెక్కారు.

 

న్యూ యాంగిల్
సామాజిక పరిణామాల్లో కొత్త కోణాలను చూస్తారు, వ్యాఖ్యానిస్తారు శోభాడే. దేశంలో ముందు వరుసలో ఉన్న కాలమిస్టు ఆమె. రోజుకి కనీసం 1500 పదాలైనా రాయగల శక్తిమంతురాలు. ఒక్కోరోజు రాయడానికి ఏమీ ఉండదు. అయినా సరే ఏమీ రాయకుండా ఉండలేదు.

 

సంతృప్తి... పశ్చాత్తాపం
ఏ కళతోనూ, ఏ కలలోనూ సంతృప్తి చెందని మనిషి శోభాడే. ఆవులకు మాత్రమే సంతృప్తి ఉంటుందని ఆమె అభిప్రాయం. ఆవు అయినా ఎలా సంతృప్తి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శోభాడే మాటల్లో వినడమే బాగుంటుంది. ‘‘కొంచెం దాణా, కుడితి, నీడ, పక్కనే తన లేగదూడలు ఉంటే చాలు ఆవు సంతృప్తి చెందుతుంది’ అంటారు శోభ. మరి జీవితంలోని పశ్చాత్తాపాలు? అవి లేకుండా జీవితం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్న.

 

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్
శోభాడే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. కాలేజ్ బయట, కాలేజ్ లోపల. అలా గడిచాయి ఆ రోజులు. ఇప్పుడీ జనరేషన్ మీద ఏమిటి ఆమె అభిప్రాయం? అసలు మనకో అభిప్రాయం ఎందుకు ఉండాలి అనేది శోభ క్వొశ్చన్. ఎందుకంటే ఆమె కొన్ని పుస్తకాల్లో రాశారు.. ఇప్పటి అమ్మాయిలు మరీ గడుసుగా తయారయ్యారని. అయ్యారని రాశాను కానీ, అవకూడదని రాయలేదుగా అని శోభ! అమె చిన్న కూతురు డీజే అవుదామని అనుకుంది. ఆ మాటే అమ్మతో చెప్పింది. వద్దన్నారు శోభ.. తన స్వభావానికి భిన్నంగా. నేను చేసేది చేసేదే అన్నట్లు డీజే దారిలోకి వెళ్లింది చిన్నమ్మాయి. ఆ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మాయిలకు అంటారు శోభ. దీన్ని మనం ద్వంద్వ వైఖరి అనుకోనవసరం లేదు. ద్వైదీభావం అనుకోవాలి.  

 

శోభాడే మనోగతం

మగవాళ్లలో నచ్చనివి?
నోటి దుర్వాసన, చుండ్రు
ఆదర్శ పురుషుడు అంటే?
ఆదర్శ పురుషులంటూ ఎవరూ ఉండరు. సూపర్‌మేన్, రావణ్ కాంబినేషన్ నచ్చుతుంది నాకు. కానీ ఈ కాంబినేషన్‌తో మనకు మగాళ్లెవరూ కనిపించరు.
మీ చర్మం నిగారింపు రహస్యం ఏమిటి?
జీన్స్ బట్టి వచ్చింది. ప్లస్ మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్...
రచయిత్రి కాకపోయుంటే...
ఆర్కిటెక్ట్ ని అయుండేదాన్ని. చక్కటి ఆకాశ హర్మ్యాలను కట్టి ఉండేదాన్ని.
మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుడతారా? మీరు ఇప్పుడు ఉన్నట్లే..
ఈ ప్రశ్న మీరు ఏ మిస్ ఇండియాకో వెయ్యవలసింది (నవ్వుతూ)
మీ సోషల్ స్టేటస్‌ని మీ భర్త దిలీప్ డే ఎంజాయ్ చేస్తారా?
ఏం ప్రశ్న అండీ ఇది! ఏకాలంలో ఉన్నారు?
మీకు ఇంకా ఏమేం ఇష్టం?
సినిమాలు... సినిమాలు. చాలా చూస్తాను. అలాగే ప్రయాణాలు నాకు ఇష్టం.
తెల్లారేసరికల్లా మిలియన్ డాలర్లు (సుమారు 7 కోట్ల రూపాయలు) మీ ముంగిట్లోకి వచ్చిపడితే..
అవన్నీ ఖర్చయిపోయేంత వరకు దక్షిణమెరికాలో పర్యటిస్తాను.
మీకు చాలా భాషలు తెలుసంటారు?
చాలా కాదు. కొన్ని. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్.. కొద్దిగా ఫ్రెంచి.
అభిమాన రచయిత
విక్రమ్ సేథ్, స్కాట్ ఫిట్టెగరాల్డ్
నచ్చిన సినిమాలు
చాలా. ‘పాకీజా’ వాటిల్లో ఒకటి.
ఎవరంటే ప్రేమ?
జీవించడం, ప్రేమించడం.

మరిన్ని వార్తలు