స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ విశాల శకం

26 Oct, 2019 01:41 IST|Sakshi

దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకోవాలన్న కాంక్షతో.. తల్లిగా, భార్యగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉద్యమ పథంలో ఉరకలెత్తిన ధీశాలి... రూపాకుల విశాలాక్షి. సమరశీల మహిళగా మహాత్ముని పిలుపుతో ప్రత్యక్ష పోరాటంలో సైతం ఆమె భాగస్వామిగా మారారు. దేశంలో ఎక్కడ ఉద్యమం జరిగినా ముందు వరుసలో నిలబడ్డారు.

లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను లెక్క చెయ్యకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రమే లక్ష్యంగా తెల్లదొరల్ని ఎదిరించారు. దేశం కోసం అహర్నిశలూ శ్రమించి, కడవరకు సేవా దృక్పథంతో  జీవనం సాగించిన ఈ యోధురాలు గురువారం నాడు మాతృభూమి ఒడిలో శాశ్వతంగా ఒదిగిపోయారు. ఆమె మరణంతో విశాఖలో ఒక స్వాతంత్య్ర శకం ముగిసినట్లయింది.

విశాఖపట్నం మహారాణి పేటకు చెందిన శిష్టా› దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతుల ఎనిమిది మంది సంతానంలో నాలుగో సంతానంగా విశాలాక్షి. 1926 ఏప్రిల్‌ 6వ తేదీన జన్మించారు. తండ్రి స్వాతంత్య్ర పోరాటంలో విశాఖ నుంచి కీలక పాత్ర పోషించేవారు. ఆయనను చూస్తూ పెరిగిన విశాలాక్షి.. తన తొమ్మిదవ ఏట.. తండ్రితో కలిసి ఉద్యమంలోకి తొలి అడుగు వేశారు. బాల్యంలోనే ఆమెకు స్వాతంత్య్ర సమర యోధుడైన రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్మణ్యంతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకు గాంధీజీ విశాఖలో పర్యటించిన సందర్భంలో విశాలాక్షి ఆ సభకు హాజరై.. మహాత్ముని మాటలతో సమర స్ఫూర్తి పొందారు.

తొలిసారి జైలుకి!
ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న విశాలాక్షిని రాజమండ్రి జైలుకి తరలించారు. జైలుకు వెళ్లడం అదే మొదటిసారి కావడంతో కాస్త భయం వేసినా.. దేశ భక్తి ముందు ఆ భయం బలాదూర్‌ అయిపోయిందని తమతో ఎప్పుడూ అంటుండేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. అదే సమయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద విశాలాక్షి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. తన సంగీత పరిజ్ఞానాన్ని సైతం స్వాతంత్య్ర పోరాటానికే ఆమె వినియోగించారు.

విశాలాక్షి సంగీత సారథ్యంలో కొందరు గ్రామాల్లోకి వెళ్లి పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో ఒకరోజు బ్రిటిష్‌ వాళ్ల చేతికి విశాలాక్షి దొరికిపోయారు. బళ్లారి జైల్లో బ్రిటిష్‌ పోలీసులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత వినికిడి కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ విశాలాక్షి వెనకడుగు వెయ్యలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమం, ఖాదీ ఉద్యమం.. ఇలా ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

ఇసుక తిన్నెలపై సమాలోచనలు
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, మదరాసు, గుజరాత్‌.. ఇలా ఏ ప్రాంతంలో గాంధీజీ ఉద్యమానికి పిలుపునిచ్చినా.. అక్కడికి వెళ్లిపోయేవారు విశాలాక్షి. ఈ ప్రాంత సమర యోధులైన క్రొవ్విడి లింగరాజు, బులుసు కామేశ్వరరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, మొదలైన ప్రముఖులతో కలిసి చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉదయమంతా ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో తిరిగి.. ప్రజల్ని చైతన్య పరిచేవారు. సాయంత్రం మహారాణి పేటలో తమ ఇంటికి సమీపంలో ఉన్న సముద్రపు ఇసుకతిన్నెలపై కూర్చొని భావి ఉద్యమం కోసం సమాలోచనలు జరుపుతూ వ్యూహరచన చేసేవారు.

బ్రిటిష్‌ సైన్యం కంటబడకుండా భోజనాలు
విశాలాక్షి మామగారైన రామకృష్ణయ్యతో పాటు మరికొందరిపై బ్రిటిష్‌ అధికారులు కనిపిస్తే కాల్చివెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో సహా మరికొందరు పోరాట వీరులు తమ ఇంటి సమీపంలో ఉన్న మరొకరి ఇంట్లో తలదాచుకున్నారు. వారికి ప్రతిరోజూ బ్రిటిష్‌ సైన్యం కంటపడకుండా విశాలాక్షి భోజనాలు స్వయంగా తీసుకెళ్లేవారు. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటన వెలువడినప్పుడు ఆ  విషయం తెలుసుకున్న విశాలాక్షి.. ఆనందంతో ఆ వీధి ప్రజలందరినీ నిద్రలేపేశారు. మాతృభూమి బానిస సంకెళ్లు తెంచుకున్న ఈ రోజు మనకు పండుగ రోజంటూ సంబరాలు చేసుకున్నారు. ఇంట్లో స్వీట్లు ఏవీ లేకపోవడంతో డబ్బాలో ఉన్న పంచదారని అందరి నోట్లో పోసి తీపి చేశారు. బాణాసంచా కాల్చి ఆ రోజంతా విశాలాక్షి ఆనందంగా గడిపారు.

అగ్రవర్ణాలు వెలి వేసినా..!
అగ్రవర్ణానికి చెందిన విశాలాక్షి చేపట్టిన ఆలయ ప్రవేశ హరిజనోద్ధరణ ఉద్యమం.. ఆ వర్గానికి మింగుడు పడలేదు. దీంతో.. అగ్రవర్ణాలంతా కలిసి.. విశాలాక్షి కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఏ శుభ కార్యానికి కూడా పిలవడం మానేశారు. అయినప్పటికీ.. విశాలాక్షి బాధపడకుండా.. హరిజనవాడల్లో వారి బాగోగుల కోసం కృషిచేశారు. వారితోనే సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

స్వాతంత్య్ర సమరంలో ఉద్ధృతంగా పాల్గొన్న సమరయోధులలో అతికొద్ది మందికి  కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రాన్ని అందించేది. ఆ మహద్భాగ్యం విశాలాక్షి కి దక్కింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి తామ్రపత్రాన్ని అందుకున్నారు. విశాలాక్షి ఓ వైపు స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటూనే.. ఇంకోవైపు పేదలకు సహాయం చేస్తుండేవారు. 2002లో భర్త మరణించాక ఆయన పేరిట మరికొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టారు.

అమ్మ అడుగు జాడల్లో
విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.  ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవికుమార్‌ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్టా› శ్రీలక్ష్మీ అంతర్జాతీయ వెటరన్‌ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు. మరో కుమార్తె కూడా మైథిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్టా›్ల సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు.

విశాలాక్షి ప్రతి ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. విశాలాక్షి మరణంతో ఒక శకం అంతరించినట్లయింది. స్వాతంత్య్ర సముపార్జన కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి.. భావితరాలకు అందమైన భవిష్యత్తు ఫలాలు అందించేందుకు తమ శక్తిని ధారబోసిన సమరయోధులు చరిత్రలో ఒకరొకరుగా మమేకమైపోతున్నారు. వారిలో విశాఖ జిల్లాలో విశాలాక్షి చివరి వారు.  
– కరుకోల గోపీకిశోర్‌ రాజా, సాక్షి, విశాఖపట్నం

హరిజనులకు ఆలయ ప్రవేశం
హరిజనోద్ధరణ ఉద్యమం మొదలైన రోజుల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపిన అతి కొద్ది మందిలో విశాలాక్షి ఒకరు. అప్పట్లో హరిజనులకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ఏపీ హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుమల తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆ నేపథ్యంలో ఆమెను అరెస్ట్‌ చేసి బళ్లారి జైలులో పెట్టారు. అయినా వెరవక విశాలాక్షి ఉద్యమాన్ని కొనసాగించడంతో.. హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమంగా మారింది.  మొదట తిరుమల ఆలయం, ఆ తర్వాత అన్ని ఆలయాల్లోకీ హరిజనులకు ప్రవేశం కల్పించారు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు