వారంలో రెండుసార్లు ఓకే..

20 Oct, 2019 08:45 IST|Sakshi

లండన్‌ : నిత్యం మందు జోలికి పోకుండా వారాంతంలోనే మద్యం అధిక మోతాదులో తీసుకోవడం కంటే వారంలో ఎక్కువ సార్లు మద్యం సేవించడమే ప్రమాదకరమని పరిశోధకులు స్పష్టం చేశారు. గతంలో​ నిత్యం మితంగా మద్యం సేవించడం మేలని పలు అథ్యయనాలు వెల్లడైన సంగతి తెలిసిందే. గత సర్వేలకు భిన్నంగా వారంలో ఒకసారి పూటుగా తాగడంతో పోలిస్తే వారంలో పలుసార్లు మద్యం సేవించేవారిలో స్ర్టోక్‌కు దారితీసే గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే ముప్పు అధికమని తాజా పరిశోధన తేల్చింది. వారానికి రెండు సార్లు మద్యం సేవించే వారితో పోలిస్తే ప్రతి రోజూ తాగే వారికి ఈ  ముప్పు 40 శాతం  అధికమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. మొత్తంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో పోలిస్తే తరచూ ఎక్కువ సార్లు మద్యం సేవించడం అసాధారణంగా గుండె కొట్టుకునే పరిస్థితికి దారితీస్తుందని తమ అథ్యయంలో తేలిందని కొరియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోంగ్‌ చి చెప్పారు.

2009 నుంచి దాదాపు కోటి మందిపై ఈ అథ్యయనాన్ని చేపట్టగా వారంలో ఎక్కువసార్లు మద్యం సేవించడం గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే రిస్క్‌ను పెంచిందని వెల్లడైంది. ఒక్కో సెషన్‌లో అధిక మోతాదులో మద్యం సేవించడానికి ఈ రిస్క్‌తో ఎలాంటి లింక్‌ లేదని పరిశోధకులు తేల్చారు. వారంలో రెండు సార్లు మద్యం సేవించేవారిలో ఈ ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అసలు తాగనివారు, వారంలో ఒకసారి మద్యం సేవించేవారితో పోల్చినా రెండుసార్లు తాగేవారిలో ఈ ముప్పు స్వల్పంగా ఉండటం గమనార్హం. వారానికి ఆరు సార్లు మద్యం సేవించే వారిలో ఈ ముప్పు 30 శాతం, రోజూ తాగేవారిలో 40 శాతం అధిక ముప్పు నమోదైంది.

>
మరిన్ని వార్తలు