కొత్తగా పీచు గోధుమ!

15 Dec, 2017 00:08 IST|Sakshi

మనం సాధారణంగా వాడే వరి, గోధుమల్లో పీచు తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్‌ఐఆర్‌ఓ శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన కొత్త వంగడాన్ని సృష్టించారు. ఇది సాధారణ గోధుమ కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ పీచుపదార్థం కలిగి ఉంటుంది. ఫ్రెంచ్‌ కంపెనీ లిమాగ్రెయిన్‌ క్రాలేస్‌ ఇన్‌గ్రేడియంట్స్‌తో కలిసి 2006లో పరిశోధనలు చేపట్టిన సీఎస్‌ఐఆర్‌ఓ ఈ మధ్యే విజయవంతంగా పూర్తయింది. గోధుమలోని రెండు ఎంజైమ్‌ల మోతాదు తగ్గిస్తే అమైలోజ్‌ అనే పాలీశాకరైడ్‌ ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతుల ద్వారా దీన్ని సాధించారు.

మొదట్లో అమైలోజ్‌ మోతాదు 25 నుంచి 30 శాతం మాత్రమే పెరిగినా, తరువాతి పంటల్లో మాత్రం ఇది రికార్డు స్థాయిలో 85 శాతం ఎక్కువైంది. ఫలితంగా గోధుమలోని ఒక రకమైన పీచు పదార్థం 20 శాతానికి చేరుకుంది. సాధారణ గోధుమలో ఇది ఒక శాతం మాత్రమే ఉంటుంది. ఈ కొత్త గోధుమ వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మే స్టేట్‌ మిల్లింగ్‌ కంపెనీ సాగుకు సిద్ధం చేసింది. ఇడాహో, ఒరెగాన్, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లోనూ, ఆస్ట్రేలియాలోనూ దీన్ని సాగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు