శుక్రకణం నాణ్యతా ఆరోగ్యానికి సూచనే!

2 Feb, 2015 23:31 IST|Sakshi
శుక్రకణం నాణ్యతా ఆరోగ్యానికి సూచనే!

శుక్రకణం నాణ్యత కూడా ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్యానికి మంచి సూచన అంటున్నారు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. శుక్రకణం ఎంత నాణ్యంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఉందనడానికి ఒక తార్కాణమని పేర్కొనవచ్చు అంటున్నారు. ముప్ఫయి ఏళ్లు మొదలుకొని యాభై ఏళ్ల వయసు గల దాదాపు పదివేల మందిపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైందని చెబుతున్నారా అధ్యయనవేత్తలు. వీర్యపరీక్ష నిర్వహించినప్పుడు దాని పరిమాణం, చిక్కదనం, అందులోని శుక్రకణాల కదలికల్లో చురుకుదనం వంటి అనేక అంశాలను పరిఘణనలోకి తీసుకుని పరిశీలించి చూశారు.  వంధ్యత్వంతో బాధపడుతూ వచ్చిన కొందరికి నిర్వహించిన వీర్యపరీక్షల్లో వారి శుక్రకణాల్లో కదలికలేకపోవడం అనే ఒకే ఒక సమస్య కాకుండా... పైకి కనిపించని మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు.

ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ), పెరిఫెరల్ వాస్కులార్, సెరిబ్రోవాస్కులార్ వంటి వ్యాధులు, గుండెజబ్బులతో పాటు చర్మవ్యాధులు ఉండవచ్చునని తెలుసుకున్నారు. అంటే లోపల ఏవైనా తెలియని వ్యాధులు ఉన్నవారిలో శుక్రకణాల నాణ్యతలోనూ తేడాలు కనిపిస్తాయనీ, దీన్ని బట్టి ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్యానికీ, అతడి శుక్రకణాల ఆరోగ్యానికీ సంబంధం ఉందని పేర్కొంటున్నారీ అధ్యయనవేత్తలు.
 

మరిన్ని వార్తలు