స్త్రీలోక సంచారం

13 Nov, 2018 00:32 IST|Sakshi

‘స్నేహితులుగా మీకు తగినవారు’ అని సూచించే ‘ఫ్రెండ్‌ సజెషన్స్‌’లో టీనేజ్‌ అమ్మాయిలకు మధ్యవయస్కులైన పురుషులను ఫేస్‌బుక్‌ సజెస్ట్‌ చేస్తోందని ‘బ్రిటన్‌లోని నేషనల్‌ సొసైటీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు చిల్డ్రన్‌’ సంస్థ ఆరోపించింది. టీనేజ్‌ బాలికలకు స్నేహితులుగా ఫేస్‌బుక్‌ సూచిస్తున్న మధ్యవయసు పురుషులలో కొందరు ఛాతీపై ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా కనిపించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఫేస్‌బుక్‌ తక్షణం తన బాధ్యతారాహిత్యాన్ని సరిచేసుకోవాలని సూచించింది.  బ్రిటన్‌ మొత్తానికి ర్యాడ్‌ఫోర్డ్‌ దంపతులది పెద్ద కుటుంబం. గత మంగళవారం అది మరింత పెద్ద కుటుంబం అయింది. పన్నెండు నిముషాల పురిటి నొప్పుల అనంతరం తమ 21వ బిడ్డ బోనీ రేయ్‌ని ప్రసవించింది ఆ మాతృమూర్తి స్యూ ర్యాడ్‌ఫోర్డ్‌. దీంతో ఆ కుటుంబంలోని సంఖ్య భార్యాభర్తలిద్దరితో కలిపి 23కు చేరుకుంది. ‘‘ఇక చాలనుకుంటున్నాం. బోనీతో మా కుటుంబం సంపూర్ణం అయింది’’ అని   స్యూ, ఆమె భర్త నోయల్‌ ర్యాడ్‌ఫోర్డ్‌ చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు.

స్యూ తన జీవితకాలంలో ఇప్పటి వరకు 800 మాసాలు గర్భిణిగా ఉన్నారు! మొదటి సంతానానికీ ఇప్పుడు పుట్టిన బిడ్డకు మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది. స్యూ తన ఏడేళ్ల వయసులో నోయల్‌కి పరిచయం అయింది. పద్నాలుగేళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 43. మొదటైతే ముగ్గురు పిల్లలే చాలని అనుకున్నారు స్యూ, నోయల్‌. ఆయనైతే తొమ్మిదో బిడ్డ పుట్టాక వేసక్టమీ కూడా చేయించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఎందుకో ఆయన మనసు మళ్లీ బిడ్డల మీదకు మళ్లింది. వేసక్టమీని రివర్స్‌ చేయించుకున్నాడు. మోర్‌కాంబిలోని లాంకషైర్‌ ప్రాంతంలో బేకరీ దుకాణం నడుపుతున్న ర్యాడ్‌ఫోర్డ్‌ల ఇల్లు ప్రస్తుతం సందడి సందడిగా ఉంది. అప్పుడే పుట్టిన తమ చిట్టి చెల్లాయిని ఆడించేందుకు మిగతా పిల్లలందరూ పోటీ పడుతున్నారు. అయితే ఆ సంతోషాన్ని కళ్లారా చూస్తున్న స్యూ.. గర్భిణిగా మాతృత్వపు మధురిమల్ని ఇక అనుభూతి చెందలేను కదా అని కొద్దిపాటి బాధతో ఉన్నారు. చెప్పలేం. వీళ్ల çసంతాన ప్రియత్వాన్ని చూస్తుంటే తమ నిర్ణయానికి కట్టుబడేలా కనిపించడం లేదు. ఇంకో సంగతి. వీళ్లకు ముగ్గురు మనవలు కూడా ఉన్నారు. రెండో సంతానం అయిన సోఫీకి పుట్టినవాళ్లు ఆ పిల్లలు.  

మరిన్ని వార్తలు