క్లాస్‌మేట్స్‌.. స్నేహ హస్తాలు

20 Feb, 2020 10:55 IST|Sakshi
స్కూలు ఆవరణలో లక్ష్మిస్‌ నాయక్‌ను ‘నడిపిస్తున్న’ స్నేహితులు

లక్ష్మిస్‌ నాయక్‌ పదహారేళ్ల కుర్రాడు. బెంగళూరు, రాజాజీ నగర్‌లోని ఈస్ట్‌–వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లోపదవ తరగతి చదువుతున్నాడు.ఆ స్కూల్లో టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లక్ష్మిస్‌ నాయక్‌ మాత్రంఆ స్కూల్‌కి ప్రత్యేకం.

ఎందుకు ప్రత్యేకం అంటే... పదేళ్లుగా ఒక అందమైన దృశ్యానికి ఆ స్కూల్‌ ప్రత్యక్షసాక్షిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతోపాటే మనసును తాకే ఆ దృశ్యం కూడా కనుమరుగు కాబోతోంది. ఒక స్నేహబృందం చెల్లాచెదురు అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. ‘‘టెన్త్‌ పూర్తయిన తర్వాత పిల్లలు ఎవరికి ఇష్టమైన కోర్సుల్లో వాళ్లు చేరతారు. లక్ష్మిస్‌ నాయక్‌ స్నేహబృందంలోని కుర్రాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్‌లో చేరిపోతారు’’ అంటూ.. ఆ స్కూలుకే ప్రత్యేకమైన లక్ష్మిస్‌ నాయక్‌ గురించి స్కూల్‌ టీచర్‌ గ్రేస్‌ సీతారామన్‌ తెలిపారు.

అంతా టెన్త్‌కి వచ్చేశారు
లక్ష్మిస్‌ నాయక్‌ను ఇప్పటివరకు స్నేహితుల హస్తాలే నడిపించాయి. నాయక్‌ ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. తనకై తాను నడవలేడు. మొదట్లో వాళ్ల అమ్మానాన్న రోజూ స్కూల్లో దించేవాళ్లు. ఆ తర్వాత నాయక్‌ స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. అందరూ చిన్న పిల్లలే. కానీ అందరిదీ పెద్ద మనసు. ఏడెనిమిది మంది పిల్లలు రోజూ నాయక్‌ను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళ్తారు. వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టి స్కూలు ఆవరణంతా తిప్పుతారు. చేతులతో ఎత్తి పై అంతస్థులోని క్లాస్‌ రూమ్‌కు తీసుకెళ్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు వాళ్లంతా పదవ తరగతికి వచ్చారు. పరీక్షలైపోగానే విడిపోక తప్పదని ఆవేదన చెందుతున్నారు.

పై అంతస్తులోని తరగతి గది నుంచి లక్ష్మిస్‌ నాయక్‌ను కిందికి తీసుకొస్తున్న స్నేహితుడు
వాడిని వదిలేసి వెళ్లలేం
ఓ రోజు ఓ టీచర్‌ ఆ పిల్లల్ని ‘‘రోజూ ఇలా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం కష్టంగా అనిపించడం లేదా’’ అని అడిగారు. అప్పుడు ఆ కుర్రాళ్లు చెప్పిన మాట ‘‘అందరం షేర్‌ చేసుకుంటాం. కాబట్టి బరువు అని కానీ, కష్టం అని కానీ అనిపించదు. వాడిని తీసుకెళ్లకుండా మేము ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా వాడే గుర్తుకు వస్తుంటాడు’’ అన్నాడు ఆ స్నేహబృందంలోని సిద్ధార్థ. మరో స్టూడెంట్‌ మయూర్‌ అయితే... ‘‘మేము వాడిని మోసుకు పోవడమే కనిపిస్తుంది. వాడు మాకు ఎన్ని సబ్జెక్టుల్లో సహాయం చేస్తాడో తెలుసా? క్లాస్‌లో మాకు అర్థం కాని సందేహాలను వాడు చక్కగా క్లియర్‌ చేస్తాడు. నాయక్‌ కామర్స్‌ చదవాలనుకుంటున్నాడు. నేను ఏదైనా డిప్లమో కోర్సులకు వెళ్లాలనుకుంటున్నాను. వేరే వేరే కాలేజీలకు వెళ్లక తప్పదు’’ అని ఆవేదన చెందాడు.

‘నాకూ దిగులేస్తోంది’
‘‘నాయక్‌ ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ అని బయటి వాళ్లు అనుకోవాల్సిందే తప్ప మాకు అలా అనిపించదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మా అందరితోపాటు నాయక్‌ కూడా ఉంటాడు’’ అన్నారు కుర్రాళ్లందరూ ముక్తకంఠంతో. నాయక్‌ మాత్రం ‘‘ఇప్పటి వరకు నన్ను చేతుల్లో పెట్టుకుని చూసుకున్న నా స్నేహితులకు దూరం కావాల్సి వస్తోంది. ఒకరి సహాయం లేకుండా కృత్రిమ సాధనాల సహాయంతో నడవడానికి నేను సిద్ధమే. కానీ పదవ తరగతి పరీక్షల తర్వాత ఎదురయ్యే ఒంటరితనం ఇప్పటి నుంచే గుర్తుకొస్తోంది’’ అని దిగులుగా అంటున్నాడు.– మంజీర

మరిన్ని వార్తలు