స్నేహం, శత్రుత్వం రెండూ అవసరం

30 Nov, 2017 23:27 IST|Sakshi

చెట్టు నీడ

సూత్రం నం.1 : ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు. సూత్రం నం. 2 : పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి.. మన అవసరాలకు ఉపయోగపడవు. చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్రం ఒకటే.. ‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’. చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం. చాణక్యుని ‘అర్థశాస్త్రం’లో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రంథం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. అర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్‌ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది.

బడ్డెట్‌ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది. బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన వాడు చాణక్యుడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం కూడా అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు. ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా అంతర్లయగా మంచికే లయబద్ధుడై ఉన్నాడు చాణక్యుడు.

మరిన్ని వార్తలు