స్నేహానికి 200 గంటలు

17 Apr, 2018 00:09 IST|Sakshi

అవునా!

నమ్మకమనే విత్తనం లేకుండా, ఇష్టం, స్నేహం, ప్రేమ వంటి ఏ బంధమూ మొలకెత్తదు. అన్ని బంధాల్లోకీ తియ్యనైనది స్నేహం. దానికీ నమ్మకం అనే విత్తనం కావలసిందే కానీ.. అది మొలకెత్తడానికి కనీసం 200 గంటల సమయం పడుతుందట! కొత్తగా పరిచయమైన వ్యక్తి మీద నమ్మకం ఏర్పడి, వారిద్దరి మధ్య స్నేహం వెల్లివిరుస్తుంది. ఒకే గూటి పక్షులు ఒకే మాట మాట్లాడతాయన్నట్లుగా, ఒకే భావాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ స్నేహబంధం ఏర్పడుతుంది. అయితే మొదటి చూపులోనే ప్రేమ ఏర్పడినట్లుగా తొలి పరిచయంతోనే స్నేహం ఏర్పడదు అని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. కన్సాస్‌ యూనివర్సిటీ కమ్యూనికేషన్‌ స్టడీస్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న జెఫ్రీ హాల్‌.. స్నేహం గురించి పరిశోధన చేసి ఇద్దరు మనుషుల మధ్య స్నేహం ఏర్పడటానికి ఎంతలేదన్నా కొంత సమయం పడుతుందని అంటున్నారు. ఆన్‌లైన్‌ పరిశోధనలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రహించారు. గత ఆరు నెలలుగా కొత్త స్నేహితుల కోసం ఆసక్తి కనపరుస్తున్న 355 మందితో  మాట్లాడారు.

వారు కొత్తవారితో ఎన్ని గంటలు కలిసి ఉంటున్నారో పరిశీలించారు. సాన్నిహిత్యం, సరదాగా స్నేహం, స్నేహం, గాఢమైన స్నేహం... ఈ నాలుగు అంశాల మీద జెఫ్రీ హాల్‌ సర్వే జరిపారు.  రెండవ దశగా 112 మంది విద్యార్థులను ప్రశ్నించారు. స్కూల్స్‌ తెరవడానికి రెండు వారాల ముందు నుంచే తాము, తమ స్నేహితులు కలుస్తామని వారు చెప్పారు. వారిని సుమారు నాలుగు నుంచి ఏడు వారాల పాటు అధ్యయనం చేశాక.. సాధారణమైన స్నేహం ఏర్పడటానికి 40–60 గంటల సమయం, సాధారణ స్థాయి నుంచి కొద్దిగా ముందుకు వెళ్లడానికి 80–100 గంటల సమయం, మంచి స్నేహితులు కావడానికి కనీసం 200 గంటల సమయం పడుతోందని హాల్‌ గమనించారు. అంటే మధురమైన స్నేహాన్ని పటిష్టంగా ఏర్పరచుకోవడానికి 200 గంటలు నిరీక్షించాల్సిందేనా? అవసరం లేదు. మంచి స్నేహం ఏర్పడిందంటే రెండొందల గంటలు గడిచి ఉంటాయనే అనుకోవాలి జెఫ్రీ హాల్‌ మాటల్ని బట్టి. 
– రోహిణి 

మరిన్ని వార్తలు