స్నే‘హితుడు’

30 Apr, 2017 22:43 IST|Sakshi
స్నే‘హితుడు’

ఆత్మీయం

లింగ వయోభేదాలు లేనిది స్నేహం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ – స్నేహం చేయవచ్చు. బాధ చెప్పుకోవడానికి, ఓదార్పు పొందడానికి స్నేహితులను మించినవారు ఎవరుంటారు! నిష్కల్మషమైన స్నేహం జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. స్నేహం కలవటం సులభమే! కానీ, ఆ స్నేహం కలకాలం నిలుపుకోవడమే కష్టం. ఆ స్నేహం కూడా సజ్జనులతో కలవాలి. అది చిరకాలం నిలవాలి.
ఎవరైనా చెడుపనులు చేస్తూంటే మంచి మిత్రుడు నివారించాలి. అలాగే మంచిపనులు చేయటంలో ప్రోత్సహించాలి. మిత్రునికి సంబంధించిన రహస్యాలను సంరక్షించాలి అంటే తనలోనే దాచుకోవాలి. మిత్రునిలోని మంచి లక్షణాలను నలుగురిలో తెలియజేయాలి. మిత్రునికి ఆపద కలిగినప్పుడు మొహం చాటేయడమో, తప్పుకు తిరగడమో చేయకూడదు.

చేతనైన సహాయం చేయాలి. అవసర సమయాలలో తగిన సహాయాన్ని చేయాలి. ఇవి మంచి మిత్రునికి ఉండవలసిన లక్షణాలుగా భర్తృహరి చెబుతాడు. ‘‘అనేక సద్గుణాలు, విశేషమైన ప్రేమ కలిగిన నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం అనేది నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’’ అంటాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో. ఆపదలోను, ఆనందంలోను ఒకే విధంగా నడుచుకునేవాడే మిత్రుడు అవుతాడు. సంపదలున్నప్పుడు చెలిమి చేసి, ఆపదలో ముఖం చాటు చేసేవాడు అవకాశవాదే గానీ, స్నేహితుడు కాడు.

మరిన్ని వార్తలు