ప్లాస్టిక్‌ బాటిల్‌తో పండు ఈగలకు ఎర!

14 Aug, 2018 05:10 IST|Sakshi
ప్లాస్టిక్‌ బాటిల్‌ ట్రాప్‌, బాటిల్‌కు కన్నాలు చేసేదిలా..

ఇంటి పంట

పండు ఈగల వల్ల కూరగాయలు, పండ్లకు నష్టం జరుగుతూ ఉంటుంది. పండు ఈగ కాటేసిన కాయపై ఆ గాటు దగ్గర నుంచి వృత్తాకారంలో కొద్ది రోజుల్లో కుళ్లిపోతుంది. అపురూపంగా పెంచుకుంటున్న సేంద్రియ కూరగాయలు, పండ్లకు పండు ఈగ కలిగించే నష్టం ఇంటిపంటల సాగుదారులను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది.. విస్తారంగా సాగు చేసే రైతులను తీవ్ర ఆర్థిక నష్టానికి గురి చేస్తుంటుంది. హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్‌ కాలనీకి చెందిన సీనియర్‌ ఇంటిపంటల సాగుదారు దశిక చంద్రశేఖర శాస్త్రి పండు ఈగలను ఆకర్షించి నశింపజేసేందుకు ప్లాస్టిక్‌ బాటిల్‌తో ట్రాప్‌లను తయారు చేసి వాడుతున్నారు.

వాడేసిన లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ను తీసుకొని.. దానికి నాలుగు వైపులా ఆంగ్ల క్యాపిటల్‌ లెటర్‌ ‘హెచ్‌’ ఆకారంలో బ్లేడుతో.. కుడి, ఎడమల వైపున రెండు అంగుళాల పొడవున కత్తిరించాలి. మధ్యన (అంగుళం ఎత్తులో) అడ్డంగా కత్తిరించి, ఆ రెండు ముక్కలను(45 డిగ్రీల కోణంలో) లోపలికి వంచాలి. ఈ కిటికీ ద్వారా పండు ఈగ బాటిల్‌లోకి ప్రవేశించి బయటకు రాలేక.. లోపలే పడిపోతుంది.  పండు ఈగను బాటిల్‌ వైపు ఆకర్షించడానికి పసుపు, నీలం ఆయిల్‌ పెయింట్‌ రంగులను బాటిల్‌కు పూస్తున్నారు. పెయింట్‌ అందుబాటులో లేకపోతే.. ఇన్సులేషన్‌ టేప్‌ను బాటిల్‌పై అతికించవచ్చని శాస్త్రి సూచిస్తున్నారు. అరటి పండు తొక్కను బెల్లంతో కలిపి.. ఈ బాటిల్‌లో అడుగున ఉంచాలి. దీని వాసన.. బాటిల్‌పై పసుపు, నీలం రంగులకు పండు ఈగలు ఆకర్షితమై నశిస్తున్నాయని, ఇది చాలా సులభమైన, ఖర్చులేని మార్గమని ఆయన వివరించారు.

 అరటి పండు తొక్క, బెల్లం పెట్టిన వారం రోజుల వరకు పనిచేస్తుందన్నారు. అరటి తొక్క కుళ్లిపోయిన తర్వాత తీసివేసి, మళ్లీ పెట్టుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ వరకు పండు ఈగలకు ఈ ట్రాప్స్‌ పెట్టుకుంటే మంచిదని ఆయన తెలిపారు. దీనికి బదులు, చిన్నపాటి సోలార్‌ ఎల్‌.ఇ.డి. లైటు కొనుగోలు చేసి పెట్టుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ లైటు పగలు సూర్యరశ్మితో చార్జ్‌ అవుతుంది. చీకటి పడగానే వెలుగుతుంది. ఈ లైటు అడుగున వాడేసిన ఫుడ్‌ ప్యాకింగ్‌ ప్లాస్టిక్‌ బాక్స్‌ను అమర్చి.. వేపనూనె కలిపిన నీటిని పోయాలి. లైటు రాత్రి 10.30 గం. వరకు వెలుగుతుంది. ఈ వెలుతురుకు దగ్గరకు వచ్చే పండు ఈగలు వేపనూనె నీటిలో పడి చనిపోతాయని శాస్త్రి (81211 58628) వివరించారు. పండు ఈగ సమస్యను అధిగమించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ‘సాక్షి ఇంటిపంట’ జేజేలు పలుకుతోంది.


               చంద్రశేఖర శాస్త్రి, ∙పండు ఈగ,  సోలార్‌ లైట్‌ ట్రాప్‌ 

మరిన్ని వార్తలు