పండ్ల మీద పన్ను..

13 Jun, 2014 23:31 IST|Sakshi
పండ్ల మీద పన్ను..

కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా పన్నుల మోతకు ఎవరూ అతీతం కాదు. ఆదాయపు పన్ను కావొచ్చు లేదా అమ్మకం పన్ను కావొచ్చు.. ప్రాపర్టీ ట్యాక్సు కావొచ్చు ఏదో ఒక రూపంలో వడ్డన ఉంటూనే ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని చిత్ర విచిత్ర పన్నులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని..
 
వెండింగ్ మెషీన్ ఫ్రూట్ ట్యాక్స్..
 
తాజా పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో వెండింగ్ మెషీన్ల నుంచి కొంటే మాత్రం పర్సుకు చేటు చేస్తాయి. ఎందుకంటే.. మెషీన్ల నుంచి తాజా ఫలాలపై కాలిఫోర్నియాలో 33% పన్ను వడ్డిస్తారట. అమెరికాలో టాప్ 10 అసాధారణ పన్నుల్లో ఇది చోటు దక్కించుకుంది.
 
సిగరెట్ల మోత..
 
సిగరెట్ల మీద భారీ ట్యాక్స్‌లతో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, చైనాలోని హుబై ప్రావిన్స్ మరో అడుగు ముందుకెళ్లింది. ప్రజలు మరింత ఎక్కువగా సిగరెట్లు తాగేలా ప్రోత్సహించి.. తద్వారా మరింత పన్నులను రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. సంక్షోభాల నుంచి ఎకానమీ సురక్షితంగా ఉండాలంటే అధికారులు ఏటా 400 కార్టన్ల సిగరెట్లు ఊదిపారేయాలంటూ 2009లో హుబై ప్రావిన్స్‌లోని ఒక గ్రామం ఆదేశించింది. టీచర్లకు కూడా స్మోకింగ్ కోటా విధించింది. టార్గెట్లు అందుకోకపోయినా.. పక్క రాష్ట్రాల కంపెనీల సిగరెట్లు తాగుతూ పట్టుబడినా జరిమానాలతో వాతలు పెట్టింది.
 
టాటూలపై ట్యాక్స్
 
అమెరికాలోని ఆర్కాన్సాస్ ప్రభుత్వం 2005లో టాటూలపైనా ట్యాక్స్ విధించి ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రోలసిస్ ట్రీట్‌మెంట్‌ను కూడా ఇందులోకి చేర్చింది.
 

మరిన్ని వార్తలు