నీటి శుద్ధికి  పండ్ల తొక్కలు!

3 Aug, 2018 00:35 IST|Sakshi

నీటిలోని కాలుష్యాలను తొలగించేందుకు పండ్లు, కాయగూరల మొక్కలు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు డికిన్‌సన్‌ కాలేజీ శాస్త్రవేత్తలు. గుమ్మడికాయ విత్తనాలు మొదలుకొని నిమ్మ, అరటి తొక్కలు దాదాపు 12 రకాలతో తాము ప్రయోగాలు నిర్వహించామని.. కృత్రిమ రంగులు, లోహాల వంటి కాలుష్యాలను తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సిండీ సామెత్‌ తెలిపారు. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే అవొకాడో తొక్కను ఉపయోగించినప్పుడు నీటిలో కలిసిన నీలి రంగు (మిథిలీన్‌ బ్లూ)  రెండు గంటల్లో అడుగుకు చేరిపోయిందని సామెత్‌ తెలిపారు.

మూడేళ్ల క్రితం సురేశ్‌ వలియవీటిల్‌ అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధనల ఆధారంగా తాము ప్రయోగాలు నిర్వహించామని కాయగూరలు, పండ్ల తొక్కలను ముందుగా నీటిలో ఉడకబెట్టి ఆ తరువాత ఆరబెట్టి పొడి చేశామని చెప్పారు. నిమ్మ విత్తనాలు నీటిలోని సీసపు అయాన్లను పూర్తిగా తొలగించగలిగాయని, తొక్కలను ఉపయోగించినప్పుడు 96.4 శాతం అయాన్లు మాత్రమే వేరు పడ్డాయని సామెత్‌ వివరించారు. శుద్ధమైన తాగునీటికి కొరత ఉన్న చోట్ల ఇలాంటి చౌక పద్ధతులను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. 

మరిన్ని వార్తలు