పండ్లతో మేనికాంతి...

25 Jun, 2014 22:42 IST|Sakshi
పండ్లతో మేనికాంతి...

బ్యూటీ
 
దుమ్ము, ఎండ, కాలుష్యం, రసాయన సౌందర్య ఉత్పత్తుల మూలంగా చర్మం నల్లబడటమే కాకుండా పొడిబారి జీవం కోల్పోతుంది. అలాంటప్పుడు పండ్లతో మసాజ్ చేసుకోవడంవల్ల కణాలను శుభ్రపరిచి, చర్మానికి విశ్రాంతినివ్వడమే కాదు పండ్లు సహజ కాంతిని, మెరుపును తీసుకువస్తాయి.
 
పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లైనా ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం నిస్తేజంగా మారదు.
 
 జిడ్డు చర్మం గలవారికి టొమాటో సరైన ఎంపిక. సాధారణంగా జిడ్డుచర్మం గలవారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన టొమాటా గుజ్జును ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. స్క్రబ్ చేయడం వల్ల మొటిమలున్న చోట చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా రుద్దుతూ కడగాలి. చర్మంపై స్వేదరంధ్రాలు శుభ్రపడి మొటిమల సమస్య తగ్గుతుంది.
 
 ముఖంపై అక్కడక్కడా మొటిమలు విపరీతంగా గడ్డల్లా ఏర్పడుతుంటాయి. దీనినే యాక్నె అంటుంటారు. ఈ సమస్య నివారణకు దాక్ష్ర పండ్లు మహత్తరంగా పనిచేస్తాయి. ద్రాక్షపండ్ల గుజ్జును ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయకారంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి, మెత్తని కాటన్ క్లాత్‌తో తడిని అద్దాలి.
 
 ఎండకు కమిలిన చర్మం (ట్యాన్) నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్య నుంచి స్ట్రాబెర్రీ సత్వర ఉపశమనం ఇస్తుంది. స్ట్రా బెర్రీలను కొద్దిగా నీరు కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును ట్యాన్ అయిన శరీర భాగాలకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మం పూర్వపు కాంతిని పొందుతుంది.
 

మరిన్ని వార్తలు