విశ్వాసి సంపూర్ణంగా తెలుసుకోవాలి

29 Dec, 2013 00:06 IST|Sakshi
విశ్వాసి సంపూర్ణంగా తెలుసుకోవాలి

నలభై ఏళ్లు అవిశ్రాంతంగా పరిచర్య చేసిన మహాదైవజనుడు జాన్ న్యూటన్. చివరి దశలో అల్జీమర్స్ అనే మతిమరపు వ్యాధి సోకి ఆయన అన్నీ మర్చిపోసాగాడు. చివరికి తన భార్యను, పిల్లల్ని, తన పేరు కూడా మర్చిపోయాడు. అవ సాన దశలో ఉన్న ఆయన్ను శ్లాఘిస్తూ బ్రిటిష్ వార్తాపత్రికలు వ్యాసాలు ప్రచురిస్తే అవి చదివి ‘‘వీళ్లు రాస్తున్నదెవరి గురించి?’’ అని అమాయకంగా ప్రశ్నించేవాడట. ఆయన మరణించిన రాత్రి తలగడ కింద ఆయన డైరీ దొరికింది. ‘నేను అన్నీ మర్చిపోతున్నానని తెలుసు. కాని దేవా, నేనొక ఘోరపాపినని, నా దేవుడొక అద్భుతమైన రక్షకుడని మాత్రం నన్ను మరువనీయకు’అని చనిపోవడానికి ముందు రాత్రి అందులో రాసుకున్నారు.
 
కొద్దిసేపట్లో మనం చనిపోతున్నామని తెలిస్తే, మన జీవితాన్ని సమీక్షించే రెండు మాటలు రాయవలసి వస్తే మనమేం రాస్తాం?రోమ్ చెరసాలలో మరణ శిక్షను శిరచ్ఛేదనం ద్వారా అమలయ్యేందుకు ఎదురు చూస్తున్న ఖైదీగా అపోస్తలుడైన పౌలు తనకత్యంత ప్రియశిష్యుడైన తిమోతికి రాసిన రెండవ పత్రిక అలాంటిదే! ‘మంచిపోరాటం పోరాడాను, నా పరుగుని తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను’అన్న ఆ పత్రికలోని పౌలు మాటల్లో శిరచ్ఛేదనం కాబోతున్న ఖైదీ తాలూకు బాధ, నిరాశ, నిర్వేదం లేనే లేదు సరికదా, ఒక విజేత తాలూకు సంతృప్తి, విజయభావన, ధీమా ప్రతిధ్వనించడం లేదా?(2 తిమో 4:17)ఇంతటి ఆత్మీయ ఔన్నత్యానికి, పరిస్థితికి కారణం కూడా ఆయనే ‘నేను నమ్మిన వానిని నేనెరుగుదును (1:12) అన్న ఒక్కమాటతో వెల్లడి చేశాడు. అడుగడుగునా ఆపదలు, ప్రాణాపాయ స్థితులతో ఒక నిరంతర పోరాటంగా సాగిన ఆయన జీవితంలో సంతృప్తికి, విజయానికి కారణం దేవుణ్ణి అంతకంతకూ ఎక్కువగా తెలుసుకోవడమే!
 
మీ దేవుడు మీకు తెలుసా? అనడిగితే అంతా అవునంటారు. కాని, ఎంత తెలుసు? అనడిగితే నీళ్లు నములుతారు. విశ్వాసి తన రక్షకుడైన యేసుక్రీస్తు వారి సంపూర్ణ జ్ఞానంలోకి ఎదగడమే అతని ఆత్మీయారోగ్యం బాగా ఉందనడానికి సూచన. తన దేవుని ఎరిగిన వారు బలము పొంది గొప్ప కార్యాలు చేస్తారని బైబిలు కూడా చెబుతోంది(దాని 11:32). తమ దేవుడెవరో తెలియడం వేరు, ఆ దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడం వేరు. యేసుక్రీస్తుగా నరావతారిగా పరలోకాన్ని వీడి, పాపి కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవుని ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పు తెలిసిన విశ్వాసి ఈ లోకంలో అజేయుడవుతాడు. మనిషి తన జీవితాన్ని మెత్తని పక్షిగూడుగా మార్చుకోవాలనుకుంటే అందుకు తాను విశ్వసించే దేవుణ్ణి సన్నిహితంగా ఎరగాలి. ఆ అనుభవం లేకపోతే మనిషి తన తెలివి తక్కువతనంతో జీవితాన్ని పంజరంగా మార్చుకుని బందీ అవుతాడు.

అసూయ, ద్వేషం, వైషమ్యం వంటి బందీ భావాలను మనిషి తనకు తానే నిర్మించుకుని స్వచ్ఛందంగా వాటిలో బందీ అవుతున్నాడు. దీనికి తోడు అనవసర భయాలు, చింతలు. జీవితంలోని మాధుర్యాన్ని ఈ కారణాల వల్ల మనిషి ఆస్వాదించలేకపోతున్నాడు. జీవితం అసలే చిన్నదంటే, వీటన్నింటివల్ల దాన్ని మరింత చిన్నదిగా చేసుకుంటున్నాడు. దైవభయం, దైవజ్ఞానంతోనే అతని జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ఈ రెండూ లేకుండా జీవితంలో ఆనందం, సంతృప్తి, అనే త లుపులు తెరిచే తాళాలు వెదుకుతుంటే అది వ్యర్థ ప్రయత్నమే! ఎందుకంటే దేవుణ్ణెరిగినవారికి ఆ తలుపులూ వాటంతట అవే తెరుచుకుంటాయి.

చింతించడం, భయపడటమంటే ఇంట్లో ఊయలలో కూర్చుని ఊగడమేనంటాడు ఒక తత్వవేత్త. ఊయల అటూ ఇటూ ఊగుతుందే తప్ప దానికంటూ గమ్యం ఉండదు. మరణశిక్షనెదుర్కొంటూ కూడా ఒక ఖైదీగా పౌలు అంతటి సంతృప్తినీ, ధీమానూ వ్యక్తం చేయడానికి కారణం దేవుని పట్ల ఆయనకున్న అవగాహనే! కాని అతనికి శిరచ్ఛేదనం శిక్ష విధించిన నీరో చక్రవర్తి మాత్రం తన అవసాన దశలో పిచ్చివాడై తిరుగుతూంటే సంకెళ్లతో బంధించారు. దేవుణ్ణెరిగిన ఒక ఖైదీలో స్వతంత్రభావం, దేవుణ్ణెరుగని చక్రవర్తిలో ఉన్మాదం, బందీ జీవితం!! విచిత్రం కదూ!!

 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
 
 సంపూర్ణంగా తెలుసుకోవడమే సిసలైన భక్తి

దేవుడెవరో తెలియడం వేరు, ఆ దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడం వేరు. యేసుక్రీస్తుగా నరావతారిగా పరలోకాన్ని వీడి, పాపి కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవుని ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పు తెలిసిన విశ్వాసి ఈ లోకంలో అజేయుడవుతాడు. మనిషి తన జీవితాన్ని మెత్తని పక్షిగూడుగా మార్చుకోవాలనుకుంటే అందుకు తాను విశ్వసించే దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవాలి.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా