అదంటే చాలా భయం

4 Mar, 2018 07:49 IST|Sakshi

‘టోకోఫోబియా’ గురించి వివరంగా తెలియజేయగలరు. ఈ ఫోబియా వల్ల ప్రమాదం ఉందా? దీని నుంచి ఎలా బయటపడాలి? అనేది వివరించగలరు.
– టీఎల్, ఏలూరు

గర్భం దాల్చడం అంటే భయం, అలాగే కాన్పు గురించిన భయం, కాన్పు సమయాల్లో జరిగే మార్పులు, నొప్పుల గురించి విపరీతమైన భయాన్నే టోకోఫోబియా అంటారు. ఇందులో ప్రైమరీ టోకోఫోబియా, సెకండరీ టోకోఫోబియా ఉంటాయి. ఒక్కసారి కూడా గర్భం దాల్చక ముందే .. కాన్పు గురించి విపరీతమైన భయాన్ని ప్రైమరీ టోకోఫోబియా అంటారు. ఇక కాన్పులో వచ్చే నొప్పులు, సమస్యలతో కూడిన చెడు అనుభవం వల్ల మరలా గర్భం దాల్చడానికి కలిగే భయాన్ని సెకండరీ టోకోఫోబియా అంటారు. చిన్నతనంలో లైంగిక వేధింపులు, స్నేహితులు కాన్పు గురించిన విషయాలను చెప్పేది విని, కాన్పు వీడియోలు చూడటం లాంటివి జరిగినప్పుడు వారిలో భయాలు, అపోహలు పెరుగుతాయి. దాంతో గర్భం దాల్చడానికి భయపడి, గర్భం కోసం ప్రయత్నాలు కూడా చేయరు. కొంతమంది భర్తలను దూరం పెడతారు. కొంతమంది గర్భం దాల్చినా సిజేరియన్‌ చేయమంటారు. దీనికి ప్రధానంగా కౌన్సెలింగ్‌ చేయడం ఒక్కటే మార్గం. వీరికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. డాక్టర్‌తో మెల్లమెల్లగా ఎక్కువ సెషన్స్‌లో కౌన్సెలింగ్‌ చేయించుకోవడం ద్వారా వారికి కాన్పు మీద ఉన్న భయం దూరమవుతుంది. అలాగే ధ్యానం, యోగా కూడా ఉపయోగపడతాయి.

యాంటీబయోటిక్స్‌ తీసుకునే గర్భిణులకు ‘బేబీస్‌ ఇన్‌ఫెక్షన్‌ రిస్క్‌’ ఎక్కువగా ఉంటుందని ఈమధ్య ఎక్కడో చదివాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.
– స్వాతి, నకిరెకల్‌
గర్భిణీలు యాంటీబయోటిక్స్‌ ఎలా అంటే అలా వాడకూడదు. ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ అయితేనే వాడాలి. అలాగే యాంటీబయోటిక్స్‌ వాడకపోతే వచ్చే రిస్క్‌ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ సలహా మేరకు వాడవలసి ఉంటుంది. గర్భిణీలు వాటిని తరచూ వాడటం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. మంచి బ్యాక్టీరియా అనేది తల్లి నుంచి బిడ్డకు కూడా చేరి వారిలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. రోగకారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడే తెల్లకణాలను వృద్ధి చేస్తాయి. తల్లి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడితే బిడ్డలో కొన్నిసార్లు రోగనిరోధకశక్తి తగ్గి, పుట్టిన తర్వాత తరచూ ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి గర్బిణీలు అవసరాన్నిబట్టే యాంటీబయోటిక్స్‌ను డాక్టర్‌ సలహామేరకు వాడాలి. అలాగని వదిలేస్తే తల్లిలో ఇన్‌ఫెక్షన్‌ ఇంకా పెరిగి, అది బిడ్డకు కూడా సోకి ఇద్దరికీ ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి.

నా వయసు 25. నాకు పీరియడ్స్‌ ఇరెగ్యులర్‌గా వస్తున్నాయి. థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. మూడు నెలలు మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. మందులు వాడిన మూడు నెలల తరువాత టెస్ట్‌లు చేయించుకుంటే కొన్ని పాయింట్స్‌ తగ్గాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు.  థైరాయిడ్‌ వస్తే లైఫ్‌లాంగ్‌ మెడిసిన్‌ వాడాలి, పిల్లలు కూడా పుట్టరని తెలిసిన వారు అంటున్నారు. నాకు భయంగా ఉంది.
 – ఏఎన్, గుంటూరు

థైరాయిడ్‌ గ్రంథి మెదడు ముందు భాగంలో ఉంటుంది. దీని నుంచి విడుదలయ్యే థైరాక్సిన్‌ హార్మోన్‌ (టీ3, టీ4) ప్రతి ఒక్కరిలోని అనేక జీవప్రక్రియలకు ఎంతో అవసరం. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే టీఎస్‌హెచ్‌ హార్మోన్‌ థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి టీ3, టీ4 హార్మోన్లను విడుదల అయ్యేటట్లు చేస్తుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నప్పుడు టీఎస్‌హెచ్, టీ3, టీ4 హార్మోన్లు సక్రమంగా విడుదల కావు. అలాంటప్పుడు పీరియడ్స్‌ సరిగా రాకపోవడం, బ్లీడింగ్‌ ఎక్కువ, తక్కువ కావడం వంటి ఇబ్బందులు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఏర్పడతాయి. అలాంటప్పుడు థైరాయిడ్‌ సమస్యకు డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ సక్రమంగా మందులు వాడాలి. థైరాయిడ్‌ హార్మోన్‌ అదుపులో ఉంటే ఇంకా ఇతర హార్మోన్లు, అండాశయాలు, గర్భాశయంలో సమస్యలు ఏమీ లేకపోతే, గర్భం రావటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

థైరాయిడ్‌ మాత్రలు ఎప్పటికీ వాడాలా వద్దా అనేది, ఒక్కొక్కరి థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం యొక్క తీవ్రతను బట్టి బరువు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బరువు మరీ ఎక్కువగా ఉన్నవారు... బరువు బాగా తగ్గితే, కొందరిలో హార్మోన్‌ లెవల్‌నిబట్టి హార్మోన్‌ మోతాదును మెల్లగా తగ్గిస్తూ రావచ్చు. థైరాయిడ్‌ లోపం ఉన్నప్పుడు కొందరిలో పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే డాక్టర్‌ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకుంటూ థైరాయిడ్‌ మందులు సరిగా వాడుతుంటే... థైరాయిడ్‌ హార్మోన్‌ అదుపులో ఉండి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా భయపడకుండా మందులు సక్రమంగా వేసుకుంటూ, పీరియడ్స్‌ ఇరెగ్యులర్‌గా రావడానికి గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిది.

డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు