పాత కొత్తకథ!

22 Jul, 2018 00:10 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజుగారు వాళ్లను పిలిచి...‘‘నా కొడకల్లారా... లేచామా? తిన్నామా? పడుకున్నామా? అని కాకుండా... ఏదైనా చేయండ్రా’’ అని అరిచాడు.‘‘ఏం చేయమంటారేంటి?’’ పెద్దకొడుకు ఆవులిస్తూ అడిగాడు.‘‘వేటకెళ్లి చావండి’’ ఆదేశించాడు రాజు తల మీద కిరీటం సవరించుకుంటూ.‘‘నువ్వు తండ్రివేనా? తండ్రి రూపంలో ఉన్న శత్రువువా?’’ గట్టిగా అరిచాడు రెండో కొడుకు.‘‘తినడానికి తప్ప... నువ్వు నోరు తెరవగా చూడడం ఇదే ఫస్ట్‌టైమ్‌. ఎందుకంతలా ఫీలై పోతున్నావు? వేటకెళ్లమని చెప్పడం తప్పా?’’ రెండో కొడుకుని నిలదీయబోయాడు  రాజు.‘‘ఇన్ని న్యూస్‌చానల్స్‌ వస్తున్నాయి. ఒక్కటైనా చూసి చస్తేగా... ఎంతసేపూ వందిమాగధుల పొగడ్తలు వినడంతోనే మీకు టైమ్‌ సరిపోతుంది’’ విసుగ్గా అన్నాడు మూడో కొడుకు. ‘‘నేను చెప్పిందానికి, న్యూస్‌చానల్స్‌కు ఏమిటోయ్‌ సంబంధం?’’ అడిగాడు రాజు. ‘‘సల్మానుఖాను కృష్ణజింకల కేసు గురించి తెలిస్తే... మీ  నోటి నుంచి వేట అనే మాటే రాదు. ఈ కేసు పుణ్యమా అని సల్మానుఖాను ఎప్పుడు కటకటాల వెనక్కి వెళతాడో తెలియదు. మీ చేతులకు మట్టి అంటకుండా మమ్మల్ని  కటకటాల వెనక్కి తొయ్యాలనేదే కదా మీ తొక్కలో ప్లాను’’ తండ్రి కళ్లలోకి సూటిగా చూస్తూ అరిచినంత పనిచేశాడు  నాల్గో  కొడుకు.‘‘వేటాడడం అనేది రాజుల తరతరాల సంప్రదాయం. సాహసప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం. మీకు వేటాడే దమ్ము లేక... సాకులు వెదుకుతున్నారు. కనీసం చేపలనైనా పట్టి చావండ్రా’’ అంటూ సింహాసనంపై నుంచి లేచి అటెటో వెళ్లిపోయాడు రాజు.

‘‘తియ్యండ్రా గాలాలు... ఇయ్యండ్రా వీళ్లకు’’ సేనాధిపతి గొంతు గట్టిగా వినిపించింది.మరుసటి రోజు పొద్దుటే వాగులనాగారం చెరువుకు వెళ్లారు రాకుమారులు.చెరువులో గాలాలు వేసి గట్టుపై  ఉన్న చెట్టు కింద కూర్చొని పేకాడడం మొదలు పెట్టారు.గంటలు గడుస్తున్నా గాలాలకు చేప కాదు కదా చిన్న  పీత కూడా పడలేదు.రాకుమారులకు విసుగొచ్చింది.‘‘ఏహే... తొక్కలో ఫిషింగ్‌. వెళ్దాం పదండి’’ సోదరులకు పిలుపునిచ్చాడు పెద్ద రాకుమారుడు.‘‘ఇలా ఇరిటేట్‌ అయితే ఎలా సోదరా? ఇక్కడ సమస్య అనేది చేప గురించి కాదు. మన సహనం గురించి. మనకు ఎంత సహనం ఉంది అని పరీక్షించడానికే తండ్రిగారు మనకు ఈ పరీక్ష పెట్టారు. ఈ చిన్న పరీక్షలో కూడా మనం నెగ్గక పోతే ఇంకేమైనా ఉందా?’’ అని హితవు చెప్పాడు చిన్న రాకుమారుడు.ఈలోపు ‘‘అయిదు వరహాలకు కిలో చేపలు...డెడ్‌ చీప్‌.... బంపర్‌ ఆఫర్‌’’ అని గట్టుకు  ఒకవైపున అరుస్తున్నాడు ఒక జాలరి.‘హమ్మయ్య.... సమయానికి తిమింగలంలా వచ్చాడు’ అని జాలరి దగ్గరికి వెళ్లి చెరో చేప కొనుగోలు చేసి అంతఃపురానికి చేరుకున్నారు రాకుమారులు.

‘‘శబ్బాష్‌... ఇప్పుడనిపించార్రా నా కొడుకులని’’ కొడుకుల వైపు చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రాజు.‘‘అది సరే... ఇప్పుడు వీటిని  ఏం చేయమంటారు?’’ అడిగాడు పెద్ద రాకుమారుడు.‘‘నాయనలారా.... ఈ ఏడు చేపలను ఎండకు ఎండబెట్టండి. ఎండుచేపల  పులుసు తినక చాలారోజులవుతుంది’’ అన్నాడు రాజు.‘‘అలాగే తండ్రి’’ అని రాజు చెప్పిన పని చేశారు  కుమారులు.ఆరు చేపలు బ్రహ్మాండంగా  ఎండాయి. ఏడో చేప మాత్రం... ఎండలేదు సరికదా.... ఎవరినో ఎండగడుతుంది.‘‘ఈ ఎండలకు బండలే పగులుతున్నాయి. చేపా.... చేపా... నువ్వెందుకు  ఎండలేదు?’’ అడిగాడు రాజు.‘‘నా ఇష్టం. నా గురించి అడగడానికి నువ్వెవడివి?’’ గొంతు పెద్దది చేసింది  చేప.‘‘నేను రాజును’’ గంభీరం ఉట్టి పడే కంఠంతో అన్నాడు రాజు.‘‘ఏ రాజువు? అప్పల్రాజువా? సుబ్బరాజువా? భీమరాజువా? ఏ రాజువి?’’ వెటకారంగా అంది చేప.‘‘ఆ రాజులలో ఏ రాజుని కాదు... ఐయామ్‌ ఎ కింగ్‌ యూ నో’’ మీసాలు మెలేస్తూ అన్నాడు రాజు.‘‘నువ్వు కింగ్‌ అయితే నేను కింగ్‌ ఫిష్‌ని. ఆషామాషీ చేపను కాదు. లా చదువుకున్నదాన్ని. చేపల హక్కుల సంఘానికి ప్రెసిడెంటుని’’ ఒకింత గర్వంగా అంది చేప.‘‘అయితే ఏంటంటావు ఇప్పుడు? ఎండకు ఎందుకు ఎండలేదో ముందు చెప్పు?’’ కోపంగా అడిగాడు రాజు.‘‘మళ్లీ అదే చెత్త ప్రశ్న వేస్తున్నావు. ఎండకు ఎండడమా! వానకు తడవడమా! అనేది నా చాయిస్‌. నువ్వెవరివయ్యా ఆర్డర్‌ వెయ్యడానికి. ఎడారిలో ఇసుక అమ్ముకునే ముఖం నువ్వూనూ’’ గట్టిగానే తిట్టింది చేప. ‘‘ ఏ ధైర్యంతో ఇంతలా ఎగురుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అయోమయంతో కూడిన ఆవేశంతో అరిచాడు రాజు.

‘‘ఫిష్‌ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2018 గురించి ఎప్పుడైనా విన్నావా? ఖచ్చితంగా విని ఉండవు. ఈ యాక్ట్‌  ప్రకారం... చేపలను పట్టడం, వాటిని పులుసు చేసుకోవడం, ఎండలో దండానికి వేలాడదీయడం... ఇలాంటి చర్యల ద్వారా చేపల జీవించే హక్కును కాలరాయడం...  డబ్ల్యూపీసి 272/384 సెక్షన్‌ల  ప్రకారం శిక్షార్హం. దీనికిగానూ పది సంవత్సరాల జైలుశిక్ష, పదిలక్షల జరిమానా విధించబడుతుంది’’ అని హెచ్చరించింది చేప.
గజగజ వణికిపోయాడు రాజు.వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌... పొరుగు రాజ్యం రాజు తమ రాజ్యం మీదికి దండెత్తుకు వచ్చినప్పుడు కూడా ఈ రేంజ్‌లో వణక లేదు.‘‘ఏం బాసూ.... ఎండకు ఎందుకు ఎండలేదో చెప్పమంటావా?’’ కవ్వింపు చర్యలకు దిగింది చేప.‘‘అక్కర్లేదమ్మా... నువ్వు  ఎండితే ఏమిటి? ఎండక పోతే ఏమిటి? బుద్ధి తక్కువై ఏదో వాగాను. నన్ను క్షమించమ్మా’’ అంటూ చేపకు సారీ చెప్పాడు రాజు.ఆ తరువాత...‘‘ఎవరక్కడా’’ అని కేకేశాడు.‘‘చెప్పండయ్యా’’ అంటూ పరుగెత్తుకు వచ్చారు భటులు.‘‘ ఈ చేపమ్మను పల్లకీలో ఎక్కించుకొని, మేళతాళాలతో వాగులనాగారం చెరువులో వదిలి రండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘అలాగేనయ్యా’’ అంటూ భటులు పరుగులు తీశారు.
– యాకుబ్‌ పాషా 

మరిన్ని వార్తలు